కాళేశ్వరానికి అటవీ అనుమతులు
అధికారికంగా మినిట్స్ జారీ చేసిన కేంద్ర అటవీ శాఖ సలహా సంఘం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 3,128.13 హెక్టార్ల అటవీ భూమిని వాడుకునేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారికంగా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు అటవీ శాఖ సలహా కమిటీ (ఎఫ్‌ఏసీ) చేసిన నిర్ణయాన్ని మినిట్స్ రూపంలో బుధవారం ప్రభుత్వానికి తెలియ జేసింది. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా ఐదు పాత జిల్లాల పరిధిలో 3,128.13 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ మొత్తం అటవీ భూమి లో రిజర్వాయర్ల నిర్మాణానికి 2,803.31 హెక్టార్లు, కాల్వలు, డెలివరీ వ్యవస్థల కోసం 337.16 హెక్టార్లు, విద్యుత్ లైన్లకు 27.65 హెక్టార్లు అవసరం ఉంటుందని గుర్తించారు. ఈ అటవీ భూమిని సేకరించి, ప్రత్యామ్నాయంగా అడవిని విస్తరించుకునేందుకు, పరిహారపు భూములను ఇచ్చేందుకు నీటిపారుదల శాఖ నిర్ణయించి ఆ భూముల వివరాలను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు సమర్పించి, అనుమతులకై విజ్ఞప్తి చేసింది. అయితే గ్రామ సభల ఆమోద తీర్మానాల తర్జుమా కాపీలను, సమగ్ర భూ వినియోగ ప్రణాళికలు, రెండుచోట్ల అటవీ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి మాత్రం వివరణలు ఇవ్వాలని ఎఫ్‌ఏసీ సూచించింది.