ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి(ఫైల్)
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ పట్లోళ్ల రామచంద్రారెడ్డి(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని స్వగృహంలో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం ఇంట్లోని బాత్రూంలో ఆయన జారిపడ్డారు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆçస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి చెందారు. ఆయనకు భార్య శాంతారెడ్డి, ఇద్దరు కుమారులు నిరూప్‌రెడ్డి, స్వరూప్‌రెడ్డి, కూతురు శ్రీదేవి ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో 1929 డిసెంబర్ 3న ఆయన జన్మించారు.ఓయూ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.
హైదరాబాద్, సంగారెడ్డిలలో న్యాయవాదవృత్తి నిర్వహించా రు. 1957లో పటాన్‌చెరువు పంచాయతీ సమి తి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 నుంచి 1989 వరకు ఐదుసార్లు సంగారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో 1989లో శాసనసభ స్పీకర్‌గా పని చేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్‌లో భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 2004 లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యా రు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరం గా ఉన్నారు. రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు నిరూప్‌రెడ్డి సుప్రీంకోర్టులో న్యాయవాది. చిన్న కుమారుడు స్వరూప్‌రెడ్డి కెమికల్ ఇంజనీరింగ్ వృత్తిలో కొనసాగుతున్నారు.
కూతురు శ్రీదేవి కూడా న్యాయవిద్యను అభ్యసించారు. లోకా యుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, గుజరాత్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఎంపీలు డాక్టర్ కె.కేశవరావు, కె.ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీ కర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితోపాటు పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు రామచంద్రారెడ్డి నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. సాయంత్రం రాయదుర్గం శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన తొలితరం నాయకుడు రామచంద్రారెడ్డి అని కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు రామచంద్రారెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment