
నకిలీ పత్తి విత్తనాల ముఠా ఆటకట్టు
పోలీసులు నకిలీ పత్తి విత్తనాల ముఠా ఆట కట్టించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న నలుగురిని రాచకొండ, మహబూబ్‌న గర్ పోలీసులు
♦ గోపీకృష్ణ సీడ్స్ యజమాని సహ నలుగురి అరెస్టు
♦ 4 రాష్ట్రాల్లో నకిలీ దందా, 1,651 ప్యాకెట్లు స్వాధీనం
♦ భూత్పూర్ ఎస్సై అశోక్‌కుమార్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్: పోలీసులు నకిలీ పత్తి విత్తనాల ముఠా ఆట కట్టించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న నలుగురిని రాచకొండ, మహబూబ్‌న గర్ పోలీసులు బుధవారం వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో గోపీకృష్ణ సీడ్స్ యజమాని జానకీరాం కూడా ఉన్నారు. నకిలీ విత్తనాల భాగోతంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడడంతో వ్యవసాయ, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా పత్తి విత్తనాలు తయారు చేస్తున్న సృష్టి సీడ్స్, గోపీకృష్ణ సీడ్స్, ఇతర సీడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్లను తనిఖీ చేశారు.
మహబూబ్‌నగర్ ఎస్పీ రమారాజేశ్వరి, వ్యవసాయ అధికారులు సుజాత, దయాకర్ రెడ్డితో కలసి రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ గచ్చిబౌలిలోని పోలీసు కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో ఉంటున్న మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వాసి జానకీరాం 20 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో సృష్టి సీడ్స్, గోపీకృష్ణ సీడ్స్‌ను ఏర్పాటు చేశాడు. 2005లో పత్తి విత్తనాల తయారీకి ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొంది నిబంధనలకు విరుద్ధంగా గోదాముల్లో పత్తి విత్తనాలు తయారు చేస్తున్నాడు. వాటిని లైసెన్స్‌డ్ డీలర్ల వద్ద కాకుండా ఇతరుల ద్వారా రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు.
హయత్‌నగర్ తొర్రూర్‌కు చెందిన సూపరవైజర్ సంఘి మహేందర్, నల్లగొండ రైతు పచ్చిపాల శ్రీను, రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన లక్ష్మితో కలసి ముఠా ఏర్పాటు చేసి నకిలీ పత్తి విత్తనాలను తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు, ఎస్‌వోటీ సిబ్బంది కలసి జానకీరాం, సంఘీ మహేందర్, పచ్చిపాల శ్రీనును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తొర్రూర్‌లోని సృష్టి సీడ్స్ గోదాంపై దాడి చేశారు. 1,651 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తయారీలో ఉన్న మిగతా విత్తనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.
ముఠాకు సహకరించిన ఎస్సైపై వేటు
నకిలీ పత్తి విత్తనాల దందాకు భూత్పూర్ ఎస్సై ఎన్.అశోక్‌కుమార్ సహకారం అందిస్తున్నారని ఎస్‌వోటీ పోలీసులు కనుగొన్నారు. వెంటనే మహబూబ్‌నగర్ పోలీసులకు సమాచారమివ్వగా డీఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో భూత్పూర్‌లోని గోపీకృష్ణ సీడ్స్‌పై దాడి చేశారు. 1,129 ప్యాకెట్లను, 2,045 కిలోల ముడి పత్తి విత్తనాలను, 1,050 కిలోల కంది విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.46 లక్షల వరకు ఉంటుందని అంచనా. రికార్డుల తనిఖీల్లో లక్ష్మీ విషయం వెలుగులోకి రావడంతో మాడ్గుల పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి 108 బీ–2 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నకిలీ విత్తనాల ముఠాకు సహకరించిన భూత్పూర్ ఎస్సై ఎన్.అశోక్‌కుమార్‌ను సస్పెండ్ చేశామని మహబూబ్‌నగర్ ఎస్పీ రమారాజేశ్వరి తెలిపారు.