
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని మందుల దుకాణాల యజమానులు మాయాజాలం చేస్తున్నారు. ఒకే లైసెన్సుపై రెండు మూడు షాపులునిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధికధరలకు మందులు విక్రయిస్తున్నారు.మరోవైపు అనర్హులను ఫార్మాసిస్టులుగా నియమిస్తుండడంతో... వారు వైద్యుడొకటి రాస్తే బాధితులకు మరొకటి అంటగడుతున్నారు. ఎంఫార్మసీ, బీఫార్మసీ అర్హతలు లేని వారికి స్వల్పకాలిక శిక్షణనిచ్చి మందులవిక్రయాలు చేపడుతున్నారు. అనుమతి లేకుండా ఒకే ఆస్పత్రి భవనంలో రెండు మూడు ఫార్మసీ కేంద్రాలు నడుపుతున్నారు. వీటిలో చాలా వరకు బ్రాండెడ్ కంపెనీ మందులకు బదులు జనరిక్ మెడిసిన్‌అమ్ముతున్నారు. ఇలా మారుమూల ప్రాంతాల్లోని మందుల దుకాణాల్లోనే కాదు... నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, మందుల నాణ్యతను పరిశీలించాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడుతూ పరోక్షంగా వారికే సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత ఇవ్వని వారిని వేధింపులకు గురిచేస్తుండడంతో భరించలేక కొంతమంది ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.తాజాగా బోయిన్‌పల్లిలోని జనని వాలంటరీ బ్లడ్‌బ్యాంక్ నిర్వాహకురాలు ఏసీబీని ఆశ్రయించడానికి ఇదే కారణమని తెలిసింది.
తనిఖీలు... మామూళ్లు
గ్రేటర్‌లో 8,500లకు పైగా మందుల దుకాణాలు ఉండగా... 18 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు (డీఐ) ఉన్నారు. తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, పరీక్షలు, కొత్త దుకాణాలకు లైసెన్సుల జారీ, పాత వాటికి రెన్యూవల్ తదితర పనుల కోసం ఒక్కో డీఐకి 400–500 దుకాణాలు కేటాయించారు. వీరు ఎప్పటికప్పుడు ఆయా దుకాణాలను తనిఖీ చేసి, మందుల నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. అయితే తనిఖీల పేరుతో అనేక విధాలుగా వేధింపులకు గురిచేయడం, ఆ తర్వాత ఎంతో కొంత మొత్తానికి సెటిల్ చేసుకోవడం డీఐలకు పరిపాటిగా మారింది. గతంతో పోలిస్తే శివారు ప్రాంతాలు విస్తరించాయి. బోడుప్పల్, బీఎన్‌రెడ్డి, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, కర్మన్‌ఘాట్, నందనవనం, మీర్‌పేట్, చర్లపల్లి, నారపల్లి, జీడిమెట్ల, సూరారం, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ తదితర బస్తీల్లో ఇప్పటికీ ఆర్‌ఎంపీలు చికిత్సలు అందిస్తున్నారు. వైద్య సేవలతో పోలిస్తే మందుల విక్రయాల్లోనే భారీగా లాభాలు వస్తుండటంతో.. ఎలాంటి అనుమతులు పొందకుండానే వారు ఆయా క్లినిక్స్‌లోనే మందులు విక్రయిస్తున్నారు. ప్రమాదకరమైన యాంటీబయోటిక్స్‌తో పాటు గర్భవిచ్ఛిత్తి మందులనూ విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల బేగంపేట సమీపంలోని ఓ యువతి గర్భ విచ్ఛిత్తి మందులు వాడి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే.
స్వదేశీయే విదేశీ...
గ్రేటర్ పరిధిలో 20 కార్పొరేట్ ఆస్పత్రులు, 85 పాలీక్లినిక్స్, 228 డయాగ్నోస్టిక్స్, 234 దంత ఆస్పత్రులు, 372 ఇరవై పడకల ఆస్పత్రులు ఉన్నాయి. 21–50 పడకల ఆస్పత్రులు 88 ఉండగా.. 101–200 పడకల ఆస్పత్రులు 94, 200కు పైగా పడకల ఆస్పత్రులు 13 ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లోకి ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రత, సీజీహెచ్‌ఎస్, ఇతర హెల్త్ ఇన్సూరెన్స్‌లున్న రోగులు వస్తే చాలు అందినకాడికి దోచుకుంటున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఆయా పేషెంట్లకు తక్కువ ఖరీదుతో కూడిన జనరిక్ మందులిచ్చి ఎక్కువ ధరున్న బ్రాండెడ్ మందులు ఇచ్చినట్లు బిల్లులు సమర్పిస్తున్నాయి. ఇక సర్జికల్ వస్తువులు, హృద్రోగులకు అమర్చే స్టంట్లు, కృత్రిమ మోకాళ్లు, విరిగిన ఎముకలను జాయింట్ చేసే స్టీల్ రాడ్స్ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ఇంపోర్టెడ్ డ్రగ్ కోటెడ్ స్టంట్ల పేరుతో స్వదేశీ కంపెనీలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన నాసిరకం స్టంట్లను అమర్చుతున్నాయి. గుండె రక్తనాళాలల లోపల వీటిని అమర్చుతుండడంతో రోగులు కూడా గుర్తించలేకపోతున్నారు. ఏ రోగికి ఏ కంపెనీ పరికరం అమర్చారు? దాని ఖరీదు ఎంత? రోగి ఎంత చెల్లించారు? తదితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయకుండా యథేచ్ఛగా ఐటీ ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఆస్పత్రుల అక్రమాలకు ఆయా ప్రాంతాల్లోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
డీసీఏలో వసూల్ రాజాలు
ఫార్మాష్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేయాలన్నా, ఆ కంపెనీ తయారు చేసిన మందులను మార్కెట్లోకి విడుదల చేయాలన్నా, చివరకు స్వచ్ఛందంగా ఓ రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయాలన్నా, ఓ మెడికల్ షాపు పెట్టుకోవాలన్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) లైసెన్సు తప్పనిసరి. ఇదే అదనుగా డీసీఏలోని అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రూ.2 లక్షలకు పైగా ముట్టజెప్పాల్సి వస్తోంది. మెడికల్ షాపునకు (హోల్‌సేల్, రిటైల్) రూ.20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్‌ను ఇన్‌వార్డులో సమర్పించిన తర్వాత సంబంధిత అధికారి టేబుల్‌కు చేరుకోవాలంటే వారికి ముందే ఎంతో కొంత ఇవ్వాల్సిందే. తనిఖీకి వచ్చే ఇన్‌స్పెక్టర్‌కు అడిగినంత అందించాల్సిందే. లేదంటే వివిధ రకాల లోపాల పేరుతో సవాలక్ష కొర్రీలు పెట్టి లైసెన్స్ జారీ కాకుండా అడ్డుకుంటారు. పాతవాటిని పునరుద్ధరించరు. నేరుగా దరఖాస్తు చేయడం కంటే కన్సల్టెంట్‌ను సంప్రదించడం మంచిదనే అభిప్రాయమూ ఉంది. ఇందుకు డీసీఏ అధికారులే ఓ రక్తనిధి కేంద్రం నిర్వాహకుడితో ప్రత్యేకంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
8,500 గ్రేటర్‌లోని మందుల దుకాణాలు
డీఐ టార్గెట్స్:దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేటకు చెందిన ఓ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) మందుల దుకాణాలు, రక్తనిధి కేంద్రాలకుప్రత్యేకంగా టార్గెట్లు విధించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన పేరు చెబితేనే ఆయా ప్రాంతాల్లోనినిర్వాహకులంతా హడలిపోతున్నారు.