వాహనాల నంబరు మార్పు రిజిస్ట్రేషన్లు ఫ్రీ కాదు | Free is not change number of vehicles | Sakshi
Sakshi News home page

వాహనాల నంబరు మార్పు రిజిస్ట్రేషన్లు ఫ్రీ కాదు

Published Thu, Jun 26 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

వాహనాల నంబరు మార్పు  రిజిస్ట్రేషన్లు ఫ్రీ కాదు

వాహనాల నంబరు మార్పు రిజిస్ట్రేషన్లు ఫ్రీ కాదు

 మార్పు బాదుడు రూ.1.64 కోట్లు!.
 ద్విచక్ర వాహనాలకు రూ.100
 తిచక్ర, ఇతర వాహనాలకు రూ.200
ఆందోళనలో వాహనదారులు

 ఆదిలాబాద్ క్రైం : వాహనాల నంబరు మార్పు విషయంలో రుసుం వసూలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సిరీస్ టీఎస్ వచ్చిన నేపథ్యంలో ఏపీ స్థానంలో టీఎస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పాత వాహనాలకూ సిరీస్ మార్చుకోవాల్సి ఉంటుంది. మొదట ఉచితంగా సిరీస్ మార్చాలని భావించినప్పటికీ రవాణా శాఖపై పడే ఖర్చును పరిగణనలోకి తీసుకుని వాహన యజమానులపై కొంత భారం మోపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వాహనాలపై సిరీస్ మారిస్తే సరిపోదు.. పాత వాహనాలైనా కొత్త రిజిస్ట్రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటిదాకా పాత సిరీస్ మార్పు గురించి అధికారికంగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ప్రస్తుతానికి జిల్లాలో టీఎస్-01 సిరీస్‌తో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రవాణా వాహనాలకు టీఎస్ 01 యూఏ 0001, రవాణేతర వాహనాలకు టీఎస్ 01 ఈఏ 0001 సంఖ్యతో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.

వాహనదారులపై భారం
జిల్లాలో అన్ని రకాల వాహనాలు 1,30,016 ఉన్నాయి. నంబరు ప్లేటుపై ఏపీకి బదులు టీఎస్, జిల్లా కోడ్ సంఖ్య మార్చడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ ఇందుకు అనుగుణంగా అధికారిక పత్రాల్లోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆర్సీ మార్చి కొత్త కార్డులు జారీ చేయాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో దానికి తగిన రుసుం విధించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది.  

ద్విచక్ర వాహనాలకు రూ.100, మూడు చక్రాలు ఆపైన అన్ని రకాల వాహనాలకు రూ.200 రుసుం విధించనున్నట్లు సమాచారం. జిల్లాలో 1,30,016 వాహనాల్లో ద్విచక్ర వాహనాలు 95,437, మిగిలిన అన్నిరకాల 34,579 వాహనాలు ఉన్నా యి. ఈ లెక్కన వాహన యజమానులపై రూ.1,64,59,500 భారం పడనుంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాకున్నా వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 
మార్పు ఎప్పుడు..?
జిల్లా వ్యాప్తంగా పాత వాహనాల సిరీస్‌ల మార్పు, మారిన సిరీస్‌తో కూడిన స్మార్ట్ రిజిస్ట్రేషన్ కార్డులు ఎప్పటి నుంచి జారీ చేస్తారనే దానిపై ఇంక ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ విషయమై అధికారులు కూడా తేల్చి చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడకపోవడం, విధివిధానాలు ఖరారు కాకపోవడంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు. పాత వాహనాల నంబర్లు మార్పు నాలుగు నెలల్లో చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో వాహనదారులు ఆ సమయం ఎప్పుడు వస్తుందో.. సమయానికి నంబర్లు మార్చుకుంటామో లేదోననే ఆందోళనలో ఉన్నారు.

జోరు పెరిగిన టీఎస్..
జిల్లాలో టీఎస్ సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. వారం రోజుల క్రితం టీఎస్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలకు సంబంధించి సుమారు 1,200 వరకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రతి రోజు 25 నుంచి 30 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 50 వరకు పెరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం జూన్ 2న అపాయింటెడ్ డేగా ప్రకటించడంతో వాహన యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం నిలిపివేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకుంటే టీఎస్ సిరీస్ వస్తుందనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ వాయిదా వేసుకున్నారు. టీఎస్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరందుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement