వెరిఫికేషన్‌ ఫ్రీ | Free Verification For Rentals in Hack I App | Sakshi
Sakshi News home page

వెరిఫికేషన్‌ ఫ్రీ

Published Mon, May 20 2019 10:27 AM | Last Updated on Sat, May 25 2019 12:24 PM

Free Verification For Rentals in Hack I App - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పనివాళ్లే పగవాళ్లుగా మారి నిలువునా దోచేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. ఇంట్లో అద్దెకు దిగి అరాచకాలకు కారణమవుతున్న వారికీ కొదవలేదు. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో అనేకం నమోదయ్యాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా వీలున్నంత వరకు నిరోధించాలంటే పనివాళ్లు, అద్దెకు దిగేవాళ్ల గత చరిత్రను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్‌ చేయించాల్సిన అవసరం ఉంది.  ఇందుకోసం పోలీసు విభాగం ఉచితంగా సేవలు అందిస్తోందని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. పోలీస్‌ అధికారిక యాప్‌ ‘హాక్‌–ఐ’ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆయా వ్యక్తుల గత చరిత్ర, పూర్వాపరాలు పూర్తిస్థాయిలో వెరిఫై చేసి నివేదిక అందిస్తామని తెలిపారు. ఇలా చేయడం ద్వారా పనివాళ్లు, అద్దెకు ఉండేవాళ్ల డేటాబేస్‌ సైతం పోలీసుల వద్ద నిక్షిప్తమవుతుందన్నారు. ఇప్పటి వరకు కేవలం 6 వేల మంది మాత్రమే ఈ ‘వెరిఫికేషన్‌’ను వినియోగించుకున్నారని, ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుతం సిటీ జనాభా కోటి వరకు ఉండగా... నేరగాళ్ల సంఖ్య ఇందులో ఒక శాతం కూడా లేదని, ప్రజలు, మీడియా సహకరిస్తే దీన్ని మరింత తగ్గిస్తామన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొత్వాల్‌ కీలకాంశాలు వెల్లడించారు. 

రండి.. తగ్గిద్దాం  
‘ప్రస్తుతం నగరంలో నమోదవుతున్న నేరాల్లో దాదాపు ప్రతి కేసూ సీసీ కెమెరాల ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోనే కొలిక్కి వస్తోంది. వీటి కారణంగానే సిటీలో నేరాల సంఖ్య తగ్గుతోంది. ప్రజలు సైతం ముందుకొచ్చి మరిన్ని కమ్యూనిటీ, ‘నేను సైతం’ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో మరో 5శాతం నేరాలు తగ్గిస్తాం. సిటీలో నేరం చేసిన వాళ్లు ఎవరైనా తప్పించుకోవడం అసాధ్యమనే సందేశం ఇచ్చాం. కాస్త ఆలస్యమైనా ఎవరినీ వదిలేది లేదని సుస్పష్టం చేస్తున్నాం. వేసవి సెలవుల నేపథ్యంలో నగరవాసులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్తే చోరులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. సెలవుల కోసం ఊళ్లకు వెళ్లే వాళ్లు ఆ విషయాన్ని సెక్టార్‌ ఎస్సై, గస్తీ బృందాలకు తెలిపితే వారి ఇళ్లపై నిఘా వేసి ఉంచుతాం. నగర పోలీసు విభాగం నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడంలో లీడర్‌గా ఉంది. ఇక్కడి కేసులే కాకుండా పక్క కమిషనరేట్లు, పొరుగు జిల్లాలు ఇతర రాష్ట్రాలకూ కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తున్నాం. దాదాపు ఆరేడు రాష్ట్రాలు సిటీ పోలీసు సేవల్ని వినియోగించుకుంటున్నాయి. గత వారం తమిళనాడులో నమోదైన ఓ దోపిడీ కేసును కొలిక్కి చేర్చడంలో కీలకంగా వ్యవహరించాం. అనేక అంశాల్లో నగర పోలీసు విభాగం ఇతర పోలీసులకు రోల్‌ మోడల్‌గా మారింది. రాష్ట్రం ఏర్పడి వచ్చే నెల 2 నాటికి ఐదేళ్లు అవుతుంది. అయితే కొన్ని నగరాలు, రాష్ట్రాలకు చెందిన పోలీసులు 50 ఏళ్లల్లో సాధించలేని ప్రగతి, అభివృద్ధి, సాంకేతికతను నగర పోలీసు విభాగం ఐదేళ్లలో సాధించింది. ఫలితంగానే హైదరాబాద్‌ సేఫ్‌ సిటీ’ అంటూ అనేక అవార్డులు వచ్చాయని కమిషనర్‌ తెలిపారు.

హెల్మెట్‌ పెట్టుకోండి...
‘ఇటీవల మధ్య మండల పరిధిలో ఓ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు దీని బారినపడ్డారు. ఆ భర్త హెల్మెట్‌ ధరించడంతో ఎలాంటి గాయాలు కాలేదు. అయితే వెనుక కూర్చున్న భార్య మాత్రం హెల్మెట్‌ లేని కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే వెనుక కూర్చునే మహిళలు సైతం హెల్మెట్‌ పెట్టుకోవాలి. ఓ కుటుంబానికి భర్త ఎంత ముఖ్యమో... భార్య అంతే కీలకం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చిన్నారులు సైతం ఈ విషయంలో తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రతి భర్త తన భార్యకు ఓ హెల్మెట్‌ ఖరీదు చేసి ఇచ్చే వరకు ఇది సాగాలి. ఇలా మొదట ద్విచక్ర వాహనాల వెనుక కూర్చునే భార్యలతో మొదలయ్యే ఈ అవగాహన ఆపై అందరికీ కలిగేలా కృషి చేయాలి. చట్ట ప్రకారం ద్విచక్ర వాహనం వెనుక కూర్చునే వారు (పిలియన్‌ రైడర్స్‌) హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి కాదు. అయితే మన భద్రత కోసం ఎవరికి వారు అవగాహన పెంచుకుని ఈ విధానం అలవాటు చేసుకోవాలి. ఈ కోణంలో నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు కూడా అనునిత్యం అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు భారీ ప్రచారం నిర్వహిస్తారు. ప్రతి వారం లేదా పక్షం రోజులకు ఓ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామ’ని చెప్పారు.  

వైట్నర్‌విక్రయాలపైడేగకన్ను...
‘సాధారణంగా విద్యార్థులు, ఇతరులు రిమూవర్‌/థిన్నర్‌గా వినియోగించే వైట్నర్‌కు అనేక మంది బానిసలుగా మారుతున్నట్లు గుర్తించాం. ప్రధానంగా దీనికి బానిసలుగా మారుతున్న విద్యార్థులు తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కొన్ని నేరాలకూ ఈ వైట్నర్‌కు అలవాటుపడిన వారే మూలంగా ఉంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని నగరంలోని వైట్నర్‌ విక్రయాలపై డేగకన్ను వేయాలని నిర్ణయించాం. దీనికోసం నగర నిఘా విభాగమైన స్పెషల్‌ బ్రాంచ్‌లో ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేశాం. ఈ అధికారులు వైట్నర్‌ విక్రయించే దుకాణాల్లో జరుగుతున్న క్రయవిక్రయాలను గమనిస్తారు. ఎవరు ఏ స్థాయిలో వైట్నర్‌ ఖరీదు చేస్తున్నారు? ఎందుకు వినియోగిస్తున్నారు? అనే అంశాలను వ్యాపారులు దృష్టిలో పెట్టుకోవాలి. అలా కాకుండా లాభాపేక్షతో వైట్నర్‌ విక్రయిస్తుంటే దీన్ని స్పెషల్‌బ్రాంచ్‌ బృందం గుర్తిస్తుంది. అలాంటి వ్యాపారులపై నివేదిక ఇచ్చి చర్యలకు సిఫార్సు చేస్తుంది. దీన్ని తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించాం. ఈ విషయంలో తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కదలికలు, వ్యవహార శైðలిని గమనిస్తూ పోలీసులకు సహకరించాల’ని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement