సంధ్య థియేటర్ ఘటనపై 'హైదరాబాద్‌ పోలీసుల' హెచ్చరిక | Hyderabad City Police Warn To Netizens For Spread Wrong News In Sandhya Theater Incident | Sakshi
Sakshi News home page

సంధ్య థియేటర్ ఘటనపై నెటిజన్లకు హైదరాబాద్‌ పోలీసుల హెచ్చరిక

Published Wed, Dec 25 2024 1:07 PM | Last Updated on Wed, Dec 25 2024 3:14 PM

Hyderabad City Police Warn To Netizens For Spread Wrong News In Sandhya Theater Incident

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని పోలీసులు గుర్తించారు. దీంతో వారు అధికారికంగా ఒక హెచ్చరిక చేశారు. పుష్ప2 సినిమా ప్రీమియర్‌ సమయంలో రేవతి మరణం గురించి ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సిటీ పోలీసులు తెలిపారు.

అల్లు అర్జున్ రాకముందే థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగినట్టుగా  కొందరు తప్పుడు వీడియోలతో పోస్టులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు తెలిపారు. ఈ అంశంపై వారు ఇలా చెప్పుకొచ్చారు ' ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినా, కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేస్తే.. వారిపై చట్ట ప్రకారం  చర్యలు తీసుకుంటాం.

ఈ విషయంలో పోలీసు శాఖ కీర్తిని తక్కువ చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్‌గా పరిగణిస్తాం. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.' అని హైదరాబాద్‌ సిటీ పోలీసులు తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement