
లక్ష్మినర్సయ్య, ధన్‌పాల్, యెండల
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీకి పట్టున్న ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం టికెట్ కోసం ఆ పార్టీలో పోటాపోటీ ఉండగా, బాన్సువాడ, జుక్కల్ లాంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో కేడర్ కలిగిన అర్బన్‌లో బీజేపీ అభ్యర్థిత్వం లభిస్తే గెలుపు దిశగా అడుగులు వేయవచ్చని భావిస్తున్న నేతలు ఈ టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ స్థానంలో ముగ్గురు ముఖ్యనేతల పేర్లు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వ లక్ష్మినర్సయ్య, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ ఎవరికి వారే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
తమకు టికెట్ ఇవ్వాలంటూ ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు తమకే టికెట్ ఖరారవుతుందని ముగ్గురు నేతలు పేర్కొంటున్నారు. సూర్యనారాయణగుప్త గత ఎ న్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంఐఎం తర్వాత మూడో స్థానంలో నిలిచారు. సామాజిక సేవా కార్యక్రమాలను చేసిన ఆయన తిరిగి తనకే అభ్యర్థిత్వం దక్కుతుందని ఆశాభావంతో ఉన్నా రు. అలాగే ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వ లక్ష్మినర్సయ్య కూడా ఇదే ధీమాను వ్యక్తం చేస్తు న్నారు. నియోజకవర్గంతోపాటు జిల్లాలో సామాజిక సమీకరణల దృష్ట్యా తనకు టికెట్ కేటాయిం చాలని ఆయన పార్టీ అధిష్టానికి విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన యెండల లక్ష్మినారాయణ కూడా టికెట్ రేసులో ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు.
పలు చోట్ల భిన్నంగా పరిస్థితి..
అర్బన్‌లో టికెట్ కోసం అభ్యర్థులు పోటీపడుతుండగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆర్మూర్, బాల్కొండ, బోధన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులను ఢీకొన గల సత్తా కలిగిన నేతలు కనిపించడం లేదు.
దీంతో అధి నాయకత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించిన నేతలను కమలదళంలో చేర్చుకోవడం ద్వారా ఆయా ని యోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని భావిస్తోంది. రెండు పార్టీల్లో టికెట్ దక్కని నేతలతో బీజేపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది.
ఎంపికకు జాతీయ బృందం..
ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్య ర్థుల ఎంపిక ప్రక్రియను ఆ పార్టీ జాతీయ బృం దం చేపడుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బృందం త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న నేతలెవరైనా పార్టీలో ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆయా నియోజకవర్గాలో సత్తా ఉన్న నేత లేనిపక్షంలో ఇతర పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడిన బలమైన నేతలకు కాషాయం కండువా కప్పి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. త్రిపురా వంటి రాష్ట్రాల్లోనే అధికారంలోకి వచ్చిన తమ పార్టీకి తెలంగాణలో పాగా వేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment