ఏకమొత్తంగా రుణమాఫీకి నిధులు!
♦ వచ్చే బడ్జెట్‌లో కేటాయించేందుకు పరిశీలన: మంత్రి పోచారం
♦ సూక్ష్మ సేద్యానికి రూ. 2,500 కోట్ల నాబార్డు నిధులు
♦ ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో మెగా డెయిరీ
♦ పాల ప్రోత్సాహకానికి రూ. 100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఏకమొత్తంగా రైతు రుణమాఫీ సొమ్మును బ్యాంకులకు చెల్లించేందుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెండు రోజులుగా వ్యవసాయ, పశుసంవర్థక శాఖలు, వాటి అనుబంధ రంగాల బడ్జెట్ రూపకల్పనపై మంత్రి కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అయితే రుణమాఫీని ఒకేసారి చెల్లించే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. బడ్జెట్‌ను వాస్తవానికి తగ్గట్లు రూపకల్పన చేస్తామన్నారు.
అనవసర పథకాలు, పద్దులను తొలగించి అవసరమైన వాటికి నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి 871 పద్దులున్నాయని... వాటిల్లో 50% పైగా నిరుపయోగంగా ఉన్నాయని గుర్తించామన్నారు. ప్రణాళిక బడ్జెట్‌ను పెంచాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వ్యవసాయ ప్రణాళిక బడ్జెట్ పెరిగే అవకాశం ఉందన్నారు. 2016-17లో ఉద్యాన కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వారంలోగా కార్పొరేషన్ విధివిధానాలు ఖరారు చేసి సీఎం వద్దకు ఫైలు పంపిస్తామన్నారు. రాష్ట్రంలో క్లస్టర్లను ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ పరిధిలో ఎన్ని కూరగాయలు, సుగంధద్రవ్యాలు అవసరమో నిర్ణయించి ఆ ప్రకారం పండిస్తామన్నారు. సూక్ష్మసేద్యం, పాలీహౌస్‌ల కోసం నాబార్డు నుంచి రూ.2,500 కోట్లు తీసుకుంటామన్నారు.
పోలండ్, డెన్మార్క్‌ల్లో పర్యటన
ప్రస్తుతం 6.65 లక్షల హెక్టార్లలో కూరగాయలు పండిస్తున్నామని... భవిష్యత్తులో మరో 4.40 లక్షల హెక్టార్లలో పండిస్తామని పోచారం తెలిపారు. ఉద్యాన కార్పొరేషన్ ద్వారా 200 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పోలండ్, డెన్మార్క్ దేశాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా ఉన్నాయని... ఉత్పత్తి అయిన ప్రతీ పంటను ప్రాసెస్ చేయడం ద్వారా రైతుకు అదనపు లాభం చేకూర్చుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు ముందే ఆ దేశాల్లో పర్యటించి అక్కడి నుంచి అవసరమైన యంత్రాలను కొనుగోలు చేస్తామన్నారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు ఇస్తున్న రూ.4 ప్రోత్సాహక పథకాన్ని రద్దు చేయబోమన్నారు. 25 లీటర్ల సీలింగ్ పెట్టామన్నారు.
అయితే మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ తదితర డెయిరీలు కూడా ప్రోత్సాహకాన్ని కోరుతున్నాయని... దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. వచ్చే బడ్జెట్‌లో రూ.100 కోట్లకు పైగా పాల ప్రోత్సాహకానికి కేటాయిస్తామన్నారు. ప్రైవేటు డెయిరీల్లో కొన్నింటిలో యూరియా కలిపిన పాలు అమ్ముతున్నారన్న ప్రచారం నేపథ్యంలో విజయ డెయిరీని బలోపేతం చేసి పాల సేకరణను పెంచుతామన్నారు. అందుకోసం ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న మెగా డెయిరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి రూ.400 కోట్లు కేటాయిస్తామన్నారు. అలాగే జిల్లాల్లోనూ విజయ డెయిరీ యూనిట్లను బలోపేతం చేస్తామన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఉద్యానశాఖలో 600 పోస్టుల నియామకం చేస్తామన్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ చేపడతామన్నారు.