స్నేక్‌గ్యాంగ్‌ను ఉరి తీయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత లక్ష్మణ్
హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో 11 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌ను నిర్భయ కేసు మాదిరిగా నిర్దాక్షిణ్యంగా ఉరి తీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్, అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి, కార్పొరేటర్లు దిడ్డిరాంబాబు, జి.శంకర్‌యాదవ్‌లతో కలసి మాట్లాడారు.
నగరంలో విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలకు , కబ్జాలకు పాల్పడుతున్న స్నేక్‌గ్యాంగ్‌కు మజ్లిస్ పార్టీ అండ ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలతో స్పష్టమవుతుందన్నారు. నగరంలో ఎక్కడ జంటలు కనిపించినా వారిని వెంబడించి వారి జీవితాలను విషనాగుల్లా కాటేస్తున్న వీరు సమాజంలో జీవించే హక్కును కోల్పోయారని పేర్కొన్నారు. ఏ పార్టీ అడ్డు వచ్చినా, ఎవరు ఒత్తిడి తెచ్చినా భయపడకుండా స్నేక్‌గ్యాంగ్‌కు ఉరిశిక్షను అమలు చేయాలని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి దౌర్జన్యాలు, అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నష్టాల వల్లే రైతుల ఆత్మహత్యలు
నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల ముందు 8 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, ఇంటింటికీ ఉద్యోగమిస్తామని వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అధికారం చేపట్టిన తర్వాత చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అప్పులు తెచ్చి విత్తనాలు వేసిన రైతులు వర్షాభావ పరిస్థితులతో నష్టాల పాలై ఆందోళన తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కనీసం ఆత్మహత్యలకు పాల్పడిన బాధితుల కుటుంబాలను పరామర్శించే స్థితిలో కూడా ప్రభుత్వం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలను పరిష్కరించడంలో లేదన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, పింఛన్‌లు, రైతుల రుణమాఫీ తదితర అన్ని పథకాలు వుూలన పడ్డాయుని ధ్వజమెత్తారు. నగరంలోని 30 ప్రాథమిక వైద్యశాలలతో పాటు అనేక ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, బీసీ హాస్టళ్లలో విద్యుత్ బిల్లులు కట్టలేదన్న కారణంగా విద్యుత్ సరఫరాను కట్ చేశారన్నారు. హాస్టళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే విద్యార్థులు చదువులెలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.