సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ : తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ బాధితుడు.. వైరస్ బారి నుంచి విజయవంతంగా కోలుకొని డిశ్చార్జి అయిన హైదరాబాద్‌వాసి గంప రామ్‌తేజ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో ‘మన్‌కీ బాత్’లో తన అనుభవాలు, గాంధీ వైద్యులు అందించిన సేవలు, వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలు, భయాలపై సవివరంగా పంచుకున్నారు. కరోనా వైరస్ సోకిందని తెలియగానే ఆయనకు ఏమనిపించింది? అసలు ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? గాంధీ ఆస్పత్రిలో చికిత్స ఎలా జరిగింది? కరోనా వైరస్ అనుమానితులు, విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో ఎందుకు ఉండాలి? క్వారంటైన్‌లో ఉన్నప్పుడు తాను ఎలా ఉన్నాడు? తెలంగాణ సమాజంపై ఉన్న బాధ్యత ఏంటి? ఈ మహమ్మారి దేశం నుంచి వెళ్లిపోతుందని ఆయన నమ్ముతున్నారా? లాంటి అనేక విషయాలపై మనసువిప్పి మోదీతో మాట్లాడారు. కరోనా సోకిన తనకు చికిత్స చేసిన గాంధీ ఆస్పత్రి వైద్యులు, నర్సులు చాలా మంచివాళ్లని, ఈ వైరస్ బారి నుంచి తాను బతికి బయటపడటానికి వారు నూరిపోసిన ధైర్యమే కారణమని చెప్పారు. మోదీ, రామ్‌తేజల మధ్య జరిగిన సంభాషణ వారి మాటల్లోనే...
మోదీ : ఎస్.. రామ్
రామ్‌తేజ : నమస్కారమండి.
మోదీ : ఎవరు? రామ్‌గారేనా మాట్లాడేది.
రామ్‌తేజ : అవును సార్, రామ్‌నే..
మోదీ : రామ్ నమస్తే..
రామ్‌తేజ : నమస్తే.. నమస్తే..
మోదీ : మీరు కరోనా వైరస్ పెనుప్రమాదం నుంచి బయటపడ్డారని విన్నా.
రామ్‌తేజ : అవును సార్
మోదీ : మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. మీరు పెను ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? మీ అనుభవాలు వినాలనుకుంటున్నాను.
రామ్‌తేజ : నేను ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగిని. పనిలో భాగంగా మీటింగ్స్ కోసం దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అనుకోకుండానే అలా జరిగిపోయింది. తిరిగి రాగానే జ్వరం లాంటివి మొదలయ్యాయి సార్. ఆ తర్వాత ఐదారు రోజులకు డాక్టర్లు కరోనా వైరస్ పరీక్షలు జరిపారు. అప్పుడు పాజిటివ్ వచ్చింది. వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో నన్ను చేర్చారు. ఆ తర్వాత 14 రోజులకు నాకు నయమైంది. నన్ను డిశ్చార్జి చేశారు. నిజంగా అదంతా తలుచుకుంటే భయంకరంగా ఉంటుంది.
మోదీ : మీకు కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసిందన్నమాట.
రామ్‌తేజ : అవును సార్.
మోదీ : మీకు ఈ వైరస్ ఎంతో భయంకరమైనదన్న విషయం ముందే తెలుసు కదా.
రామ్‌తేజ : తెలుసు సార్.
మోదీ : అయితే వైరస్ సోకిన విషయం తెలియగానే ఏమనిపించింది?
రామ్‌తేజ : ఒక్కసారిగా భయం వేసింది. ముందయితే నేను నమ్మలేకపోయా. అలా ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు మన దేశంలో కేవలం ఇద్దరు, ముగ్గురికే ఈ వ్యాధి సోకింది. నాకేమీ అర్థం కాలేదు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నన్ను క్వారంటైన్‌లో ఉంచారు. రెండు, మూడు రోజులు అలాగే గడిచిపోయాయి. అక్కడ ఉన్న డాక్టర్లు.. నర్సులు...
మోదీ : ఆ ఇంకా...
రామ్‌తేజ : వాళ్లు ఎంతో మంచివాళ్లు. ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాళ్లు. నాకు ఏమీ కాదన్న నమ్మకాన్ని కలిగించే వాళ్లు. నేను తొందరగా కోలుకుంటానంటూ ధైర్యం చెప్పేవారు. పగలు ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు మాట్లాడేవాళ్లు. నర్సులు కూడా మాట్లాడేవాళ్లు. మొదట్లో భయం వేసింది. కానీ క్రమంగా ఇంత మంది మంచివాళ్ల మధ్య ఉన్న నాకేమీ కాదన్న నమ్మకం కుదిరింది. ఏం చేయాలో వాళ్లకు తెలుసు. తప్పనిసరిగా నాకు మెరుగవుతుందన్న విశ్వాసం పెరిగింది.
మోదీ : మీ కుటుంబ సభ్యుల మానిసిక స్థితి ఎలా ఉండేది?
రామ్‌తేజ : నేను ఆస్పత్రిలో చేరిన మొదట్లో వాళ్లు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ మీడియా కూడా కొంత సమస్యాత్మకంగా మారింది. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చింది. నాకూ, నా కుటుంబ సభ్యులకూ, చుట్టుపక్కల వారికి కూడా అది ఎంతో ఊరటనిచ్చింది. ఆ తర్వాత రోజురోజుకూ నా పరిస్థితిలో మెరుగుదల కన్పించింది. డాక్టర్లు మాతో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులకు కూడా అన్ని విషయాలు చెప్పేవారు. వారు ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఏవిధంగా చికిత్స చేస్తున్నారో అన్ని విషయాలు కుటుంబ సభ్యులకు చెప్పేవారు.
మోదీ : మీరు స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు? మీ కుటుంబ సభ్యులు ఏయే జాగ్రత్తలు తీసుకునేవారు?
రామ్‌తేజ : నేను క్వారంటైన్‌లోకి వెళ్లిన తర్వాతే ఈ విషయం తెలిసింది. అయితే క్వారంటైన్ తర్వాత కూడా మరో 14 రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ 14 రోజులు ఇంటి దగ్గరే ఒక గదిలో ఉండాలని చెప్పారు. ఇంట్లో తమకు తాముగా క్వారంటైన్‌లో ఉండాలని మా కుటుంబ సభ్యులకు చెప్పారు. నేను ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఒక గదిలో ఉండేవాడిని. దాదాపుగా రోజంతా మాస్క్ తగిలించుకొనే వాడిని. తినడానికి గదిలోంచి బయటకు వచ్చే ముందు చేతులను శుభ్రంగా కడుక్కునేవాడిని. ఇది ఎంతో ముఖ్యం.
మోదీ : సరే రామ్.. మీరు పుంజుకొని బయటకు వచ్చారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
రామ్‌తేజ : ధన్యవాదాలు సార్.
మోదీ : మీరు ఐటీ ప్రొఫెషన్‌లో ఉన్నారు కదా... మీ అనుభవంపై ఆడియో తయారు చేసి...
రామ్‌తేజ: ఆ సార్...
మోదీ : ఇతరులతో పంచుకోండి. ప్రజలతో పంచుకోండి. దీనిని సామాజిక మాధ్యమంలో వైరల్ చేయండి. ఈ విధంగా చేస్తే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉంటారు. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి దూరంగా ఉండటానికి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు.
రామ్‌తేజ : అవును సార్. బయటకు వచ్చాక చూస్తున్నాను. క్వారంటైన్ అంటే తమను తాము జైలులో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది నిజంగా అలాంటిది కాదు. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది. అందుకే ఎంతో మందికి ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. పరీక్షలు చేయించుకోండి. క్వారంటైన్ అంటే భయపడకండి. క్వారంటైన్ అంటే అదేదో మచ్చలాంటిది అనుకోకండి.
మోదీ : మంచిది రామ్. మీకు ఎన్నెన్నో శుభాకాంక్షలు.
రామ్‌తేజ : ధన్యవాదాలు.. ధన్యవాదాలు. సార్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా.
మోదీ : ఆ చెప్పండి... చెప్పండి.
రామ్‌తేజ : నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తీసుకున్న చర్యలు ప్రపంచంలో ఏ దేశం కూడా తమ పౌరుల కోసం తీసుకోలేదు. అంతేకాదు.. మీ కారణంగా మేమందరం కూడా క్షేమంగా బయటపడగలమని ఆశిస్తున్నా.
మోదీ : ఈ వైపరీత్యం నుంచి దేశం బయటపడాలి. ఇది ఎంతో భయానకమైన పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి.
రామ్‌తేజ : ఏమీ కాదు సార్. మొదట్లో నాకు భయం వేసింది. మీరు లాక్‌డౌన్ లాంటి చర్యలు తీసుకున్నప్పుడు నాలో నమ్మకం పెరుగుతోంది. మనందరం మీ సహాయంతో బయటపడతాం సార్. ధన్యవాదాలు.
మోదీ : ధన్యవాదాలు సోదరా... కృతజ్ఞతలు.
రామ్‌తేజ : ధన్యవాదాలు సర్.
ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశవాసులారా... రామ్‌తేజ చెప్పినట్లు ఆయనకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిన తర్వాత డాక్టర్లు ఇచ్చిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించారు. ఆ కారణంగానే ఆయన ఆరోగ్యవంతుడై మళ్లీ సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు’ అని పేర్కొన్నారు. అనంతరం తరువాత ఆగ్రాకు చెందిన ఆశోక్ కపూర్, వైద్య నిపుణుడు, ఢిల్లీకి చెందిన డాక్టర్ నీతేష్ గుప్తా, పుణేలోని డాక్టర్ బోర్సేలతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వైద్య నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. నిత్యావసర సేవలు అందిస్తున్న రవాణా, బ్యాంకింగ్ వంటి రంగాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
(లాక్‌డౌన్ 15న ఎత్తేసే చాన్స్ లేదు)
గాంధీలో వైద్య సేవలు బాగున్నాయి :
గాంధీ ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి తన అనుభవాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. తాను యుకే నుంచి వచ్చానని, కరోనా లక్షణాలు కనిపించడంతో 104కి కాల్ చేసి గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యానని చెప్పాడు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ వార్డులో చేరి ఆదివారం నాటికి 13 రోజులు అయిందని పేర్కొన్నాడు. గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో వైద్యసేవలు, వసతి సౌకర్యాలు చాలా బాగున్నాయని, వైద్యులు చాలా కేర్ తీసుకుంటున్నారని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment