మరమ్మతులు జరుగుతున్న మదీనాలోని బాద్‌షాహి ఆషూర్‌ఖానా ,మండపానికి వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న భక్తులు
చార్మినార్: మొహర్రం సంతాప దినాలతో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒకరోజు తేడాతో కలిసి వస్తున్నాయి. 1985లో మొహర్రం సంతాప దినాలతో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒకే రోజు కలిసి వచ్చాయి. తిరిగి ఈసారి ఒక రోజు తేడాతో ఉత్సవాలు జరగనున్నాయి. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకుని షియా ముస్లిలు నగరంలోని ఆషుర్‌ఖానాలను తీర్చిదిద్దుతుండగా... వినాయక నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించుకోవడానికి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకే నెలలో ఒక రోజు తేడాతో మొహర్రం సంతాప దినాల ప్రారంభం...వినాయక విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు వెంటవెంటనే ప్రారంభమవుతున్నాయి.
అలాగే 10వ,మొహర్రం సందర్బంగా పాతబస్తీ వీధుల్లో నిర్వహించే బీబీకాఆలం సామూహిక ఊరేగింపు ముగిసిన మరుసటి రోజే వినాయక నిమజ్జనోత్సవాలు జరుగనున్నాయి. ఒక వైపు మొహర్రం సంతాప దినాలు కొనసాగనుండగా...మరోవైపు వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగనున్నాయి. దీంతో నగరంలోని హిందువులు వినాయక ఉత్సవాల్లో నిమగ్నమవుతుండగా... షియా ముస్లిం ప్రజలు మొహర్రం సంతాప దినాల్లో పాల్గొననున్నారు. దీంతో ఇరువర్గాల ప్రజల కార్యక్రమాలతో పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది. ఇందుకోసం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో అటు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు షియా ముస్లింలతో సమావేశాలు నిర్వహించి తగిన సలహాలు,సూచనలు అందిస్తున్నారు. అదనపు బలగాలతో గట్టి బందోబస్తును నిర్వహించనున్నారు.
12నుంచి సంతాప దినాలు...
హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ షియా ముస్లిం ప్రజలు ఈ నెల 12వ తేదీ నుంచి మొహర్రం సంతాప దినాలను కొనసాగించనున్నారు. ఈ నెల 11న రాత్రి ఆకాశంలో నెల వంక కనిపించిన వెంటనే మరుసటి రోజు సంతాప దినాల్లో పాల్గొంటారు. సంతాప దినాల్లో భాగంగా 21న, పాతబస్తీ వీధుల్లో అంబారీతో 10వ మొహర్రం సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. డబీర్‌పురా బీబీకాఅలావాకు చెందిన బీబీకాఆలంతో షియా ముస్లింలు ఊరేగింపులో పాల్గొంటారు. సంతాప దినాలను పురస్కరించుకొని డబీర్‌పురా బీబీకాఅలావాలో ఆలంలను ప్రతిష్టించి 1వ మొహర్రం నుంచి 10వ మొహర్రం వరకు మజ్లిస్, మాతం నిర్వహిస్తారు.
13నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు
ఈ నెల 13వ, తేదీ నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 23వ తేదీన విగ్రహాలను నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించే సామూహిక నిమజ్జనోత్సవ ఊరేగింపు అనంతరం నిమజ్జనం చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఖరీదు చేసి మండపాలకు తరలిస్తున్నారు. పది రోజుల ముందుగానే ఉత్సవాల నిర్వాహకులు మండపాలు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆయా మండపాల వద్ద ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment