మిస్డ్ కాల్ ఇచ్చి ముగ్గులోకి దించుతారు
వరంగల్ : మీడియా ముసుగులో నలుగురు వ్యక్తులు బృందంగా ఏర్పడి పలువురిని బ్లాక్‌మెయిల్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన సంఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ఎప్పుడూ వినని టీవీ చానళ్ల పేర్లు చెబుతూ ఈ ముఠా సమాజంలో పేరున్న వ్యక్తులను టార్గెట్ చేస్తుంది. ముఠా వ్యక్తి ఒకరు సదరు టార్గెట్ వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఒక మిస్డ్ కాల్ ఇస్తారు. తిరిగి వారు ఫోన్ చేయగానే.. ఇటు వైపు నుంచి ఓ యువతి మాట్లాడుతుంది. ఒకసారి పరిచయం అయిన తర్వాత వారికి పదే పదే ఆమె ఫోన్ చేస్తుంటుంది. మాటలతో సదరు వ్యక్తులను ట్రాప్ చేయడం ఆమె పని. అయితే ఆమె వెనుక సిండికేట్ సభ్యులు ఉండి ఈ తతంగం నడిపిస్తారు.
మొదట బేకరీలు, స్టార్ హోటళ్లలో పరిచయం పెంచుకోవడం.. చివరకు సదరు వ్యక్తి యువతిని సీక్రెట్‌గా కలిసే విధంగా రంగం సిద్ధం చేస్తారు. ఇద్దరు కలిసి ఇల్లు లేదా లాడ్జికి వెళ్లగానే క్షణాల్లో ఈ నలుగురు రంగంలోకి దిగుతారు. ఆ ఇద్దరు లోపలికి వెళ్లి గడియ వేసుకోగానే.. వీరు బయటి నుంచి తలుపు కొడతారు. వారు తలుపులు తీయగానే ఇద్దరినీ కెమెరాలో చిత్రీకరిస్తారు. ఇక్కడ కెమెరాలు రెండు విధాలుగా పనిచేస్తాయి. ముందుగా తాము ఎంచుకున్న గదికి సదరు వ్యక్తి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే.. గదిలోనే సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి, ఇద్దరు లోనికి వెళ్లగానే తలుపు కొడతారు. కెమెరాల్లో రికార్డు అయిన అంశాన్ని చూపెట్టి భయపెడతారు.
ఇక రెండవ విధానంలో.. సదరు వ్యక్తి చెప్పిన చోటికి యువతి రావాల్సి వస్తే మాత్రం కెమెరాలతో సిద్ధంగా ఉండి వారు గదిలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే వీరు ఎంట్రీ ఇస్తారు. ఇలా చిత్రీకరించిన తర్వాత తమ చానళ్లలో ప్రసారం చేస్తామని బెదిరిస్తారు. బేరసారాలకు దిగుతారు. లక్షలాది రూపాయలు డిమాండ్ చేసి గుంజుతారు. గతంలో వీరి చేతికి కేయూకు చెందిన ఓ ప్రొఫెసర్ చిక్కి రూ. లక్షలు పొగొట్టుకున్నట్లు సమాచారం. ఇలా సమాజంలో మహిళల వ్యసనం ఉన్న కొందరు ప్రొఫెషనల్స్‌ను, పెద్ద మనుషులను కూడా మభ్యపెట్టి అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తారు.
బయటపడిందిలా...
తాజాగా వీరు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ట్రాప్ చేశారు. యధాతథంగా ఫోన్‌కాల్ వెళ్లడం.. మిగిలిన తతంగమంతా పూర్తై... చివరకు ఆ ఉపాధ్యాయుడు వారి కెమెరాలకు చిక్కాడు. దీంతో ఈ బృందంలోని వారు రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు ఒప్పందానికి వచ్చినా.. ఒక చానల్‌లో స్క్రోలింగ్ వచ్చింది. అయితే వీరు తనతో మాట్లాడిన మాటలను సదరు ఉపాధ్యాయుడు ముందుగా రికార్డు చేసి పెట్టుకున్నాడు. స్క్రోలింగ్ రావడంతో పోలీసులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.