
సమావేశమైన మంత్రి గంగుల కమలాకర్, బి. వినోద్‌కుమార్, జయేష్ రంజన్
సాక్షి, కరీంనగర్ : హైదరాబాద్ తరువాత ఐటీ సిటీగా కరీంనగర్‌ను తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ) కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కరీంనగర్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఐటీ టవర్‌లో కంపెనీల ఏర్పాటు, మౌలికవసతుల కల్పన, ఉద్యోగావకశాలు వంటి అంశాలపై ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత రెండవ అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగానే కరీంనగర్ నగరంలో ఐటీ టవర్ నిర్మించాలని తాను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.38 కోట్ల వ్యయంతో 2018 జనవరి 8న కేటీఆర్ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రెండేళ్లలోనే ఐటీ టవర్‌ను అత్యాధునికంగా నిర్మించామని, ఈ నెల 30న కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని భావించినప్పటికీ, ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో వాయిదా వేసినట్లు తెలిపారు. ఐటీ టవర్‌లో ఇప్పటికే అంగీకరించిన 11 కంపెనీల ఏర్పాటుతోపాటు ఇతర అంశాలపై అధికారులు తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ ఇప్పటికే స్మార్ట్ సిటీ, క్లీన్ సిటీ, సేఫ్ సిటీగా పేరుపొందిందని, దేశంలో ఐదు లక్షలలోపు జనాభా కలిగిన పట్టణాలలో రెండవ నివాసయోగ్యమైన నగరంగా ఎన్నికైందని తెలిపారు. ఐటీ కంపెనీలు కరీంనగర్‌కు రావడం వల్ల స్థానికంగా కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పారు.
ఈ దిశగా అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడే ఐటీ టవర్ మంజూరైందని, భవిష్యత్తులో ఐటీ రంగానికి కరీంనగర్ మరో కేంద్రంగా మారనుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలను వికేంద్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొనియాడారు. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఐటీ కంపెనీలకు అందిస్తున్న రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనను వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్‌ఐసీ నరసింహారెడ్డి, 15 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment