వెలగని ‘దీపం’..?
నల్లగొండ :రాజకీయ నేతల ఆర్భాటం సామాన్యలను నట్టేట ముంచింది. దీపం కనెక్షన్లు ఎప్పటికై నా వస్తాయని ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. రాజకీయ పైరవీలతో ఎంపిక చేసిన లబ్ధిదారులతో పాటు, అర్హులైన సామాన్యులు సైతం ఇక్కట్లు పడక తప్పట్లేదు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నాటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా శాసన సభ్యులకు ప్రత్యేకంగా దీపం కనెక్షన్లు కేటాయించింది. వీటితో పాటు గతంలో మిగిలిన కొన్ని కనెక్షన్లు కూడా తోడయ్యాయి. అయితే ఈ మొత్తం కనెక్షన్లకు సంబంధించిన డిపాజిట్లను లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కనెక్షన్‌కు రూ.1400 చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఆయిల్ కంపెన్లీకు ఇవ్వలేదు. దీంతో కంపెనీలు కనెక్షన్లు మంజూరు చేయకుండా నిలిపేశాయి.
ఎదురుచూపులు...
అర్హులైన లబ్ధిదారులను ఎంపిక పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. జిల్లాలో గడిచిన రెండేళ్లలో 6,604 కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవిగాక ఎన్నికల ముందు శాసన సభ్యుల కోటా పేరుతో కొత్తగా 31వేల కనెక్షన్లు మంజూరు చేశారు. ఎప్పుడూ జిల్లా కోటాతోనే మంజూరవుతూ వస్తున్న దీపం కనెక్షన్లు.. ఈ సారి ఎన్నికలు రావడంతో శాసనసభ్యులకు లబ్ధిచేకూరాలనే ఉద్దేశంతో ప్రత్యేక కేటాయింపులు చేశారు. దీంతో అప్పటి ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వ్యక్తులను ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వారికి కేటాయించిన కోటాలో 10వేల కనెక్షన్లు అప్పటికే గ్రౌండింగ్ కూడా పూర్తి చేశారు. ఇంకా 21వేల కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
పథకం మార్చే యోచన...
కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారు పాలనలో లబ్ధిదారుల ఎంపిక మళ్లీ మొదటికి వస్తోందేమోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఎమ్మెల్యేల కోటా విషయంలోనే ఈ ప్రస్తావన ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో పాటు పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కూడా నివేదికలు కోరుతోంది. దీపం పథకాన్ని అసలు అమలు చేయాలా.. ? లేదా?, పథకంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనే అంశాలపై జిల్లా అధికారుల నుంచి సమాచారం సేకరిస్తోంది. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీపం కనెక్షన్లు పొందాలంటే లబ్ధిదారులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.
దీపం గ్యాస్ కనెక్షన్ల గ్రౌండింగ్ వివరాలు
సంవత్సరం మంజూరైనవి లబ్ధిదారుల ఎంపిక జరిగినవి పెండింగ్‌లో ఉన్నవి
2009-10 24,871 24,871 24,467 404
2011-12 14,000 14,000 7,800 6,200
ఎమ్మెల్యేలకు కేటాయింపు 31,000 31,000 10,000 21,000