స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి మృతి
సత్తుపల్లి: ముద్దులొలికే చిన్నారిని స్కూల్ బస్సు మృత్యువు రూపంలో కబళించిన సంఘటన సోమవారం సత్తుపల్లి పట్టణంలోని మసీద్ బజార్ రోడ్డులో చోటు చేసుకుంది. హృదయవిదారకమైన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి పట్టణంలోని మసీద్ బజార్ రోడ్డు చివరిలో కోత మిల్లు పక్క వీధిలో తమ్మా వెంకటేశ్వరరావు (జటార్ వెంకటేశ్వరరావు, ట్రాక్టర్ మెకానిక్) కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతని కుమార్తె మారేశ్వరిని గుంటూరుజిల్లా రేపల్లె మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన విశ్వనాధపల్లి బుల్లిబాబుకు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు.
ఇటీవల మారేశ్వరి రెండో కాన్పు కోసం మొదటి కుమార్తె గీతిక(18 నెలలు)తో కలిసి పుట్టింటికి వచ్చింది. 40 రోజుల క్రితం ఆమెకు ఓ బాబు జన్మించాడు. గీతిక ప్రతి రోజు ఎదురింట్లో ఉన్న పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. సోమవారం సాయంత్రం గీతిక ఇంట్లో ఇడ్లీలు తిని ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. అదే సమయంలో అటుగా వచ్చిన వీవీ విద్యాలయం స్కూల్ వ్యాన్ పిల్లలను దింపి ముందుకు కదిలింది. అప్పటికే గీతిక వ్యాన్ ముందు భాగానికి వచ్చింది. అది గమనించని డ్రైవర్ బస్సును కదిలించడంతో ముందు టైరుకు తగిలి కిందపడడంతో తలపై నుంచి వెళ్లింది.
తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తల్లి మారేశ్వరి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఓ వైపు 40 రోజుల పసికందు ఒడిలో.. మరో వైపు విగతజీవిగా పడి ఉన్న చిన్నారి గీతిక మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. అమ్మమ్మ నాగేశ్వరమ్మ ఆర్తనాధాలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో ముగినిపోయింది.
డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రాణం బలిగొంది.. :
స్కూల్‌బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే చిన్నారి గీతిక ప్రాణాలను బలిగొందని.. బస్సును ఆపి ముందుకు పోనిచ్చేటప్పుడు పరిసరాలు సరిగ్గా గమనించకపోవటం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చే స్కూల్ బస్సులు మితిమీరిన వేగంతో నడుపుతుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. స్కూల్ బస్సులో కనీసం అటెండెంట్(క్లీనర్) ఉండక పోవటం వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారి గీతిక కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం డివిజన్ కార్యదర్శి బండి గణేష్‌రెడ్డి, తుమ్మలపల్లి నరేష్‌ల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వీవీ విద్యాలయం ఎదుట ధర్నా చేశారు. అవగాహన లేని డ్రైవర్లను నియమించటం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. కాగా సంఘటన స్థలానికి సత్తుపల్లి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సుడ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.