‘‘నేను ఫుట్‌పాత్ నుంచి ఈ స్థాయికి వచ్చాను. ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీకి ఎలా రావాలో తెలియనివాళ్లు చాలామంది ఉన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లకు నేను బ్రేక్ ఇస్తాను.. నేనున్నంత వరకూ అవకాశాలు ఇస్తాను.. స్టార్ హీరోలతో సినిమా చేసినా అందులో కొత్తవారికి చాన్స్ ఇస్తాను’’ అని డైరెక్టర్ తేజ అన్నారు. అభిరామ్, గీతికా తివారీ జంటగా రూపొందిన చిత్రం ‘అహింస’. పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా తేజ చెప్పిన విశేషాలు.
► అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తానని రామానాయుడుగారికి మాట ఇచ్చాను.. ఆ మాట కోసమే తనతో ‘అహింస’ చేశాను. సినీ నేపథ్యంలో ఉన్న పెద్ద కుటుంబాల్లోని వ్యక్తులతో చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి. ఇప్పటికే స్టార్స్ అయిన వెంకటేశ్, రానాలతో అభిరామ్‌ని పోల్చకూడదు. ఎక్కువ డబ్బులు, పేరు కోసం పెద్ద స్టార్స్‌తో పని చేయాలి. నేను డబ్బులు, పేరు చూశాను.. నాకు ఇంకేం కావాలి?
► ప్రేక్షకులు చాలా తెలివైనవారు. ట్రైలర్‌ని చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. స్టార్ హీరోని బట్టి థియేటర్‌కి వెళతారనుకుంటే.. అప్పుడు పెద్ద స్టార్స్‌కి అపజయాలే రాకూడదు కదా! సినిమాలో ఎమోషన్ ఉంటే ట్రైలర్‌లో కనిపిస్తుంది. ప్రేక్షకులు ఆ ఎమోషన్‌కి కనెక్ట్ అయితే స్టార్ సినిమానా? కొత్తవారిదా అనే తేడా లేకుండా వచ్చేస్తారు.
► ఒక ఫిలాసఫీని బేస్ చేసి తీసిన చిత్రమిది. అహింసని ఎలా ఫాలో అవ్వాలి? అనే కాన్సెప్ట్‌తో మంచి కమర్షియల్ కథతో ఈ సినిమా చేశాం. ఇందులో దాదాపు 14 యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఓ నాలుగు ఎపిసోడ్స్‌కి నేనే ఫైట్ మాస్టర్‌గా చేశాను.
► అభిరామ్‌కి సినీ నేపథ్యం ఉంది. తనని పరిచయం చేస్తున్నప్పుడు నాకంటే అభీపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. సురేశ్‌బాబుగారు ఒకసారి సెట్‌కి వచ్చారు. ‘నాన్నా.. నువ్వుంటే నేను చేయను’ అని అభి అనడంతో మానిటర్ వద్దకెళ్లి కూర్చున్నారాయన. ఇన్ని సినిమాలు చేసిన వెంకటేశ్‌గారు, రానాకి కూడా సురేశ్‌గారు సెట్‌కి వస్తే టెన్షన్ వచ్చేస్తుంది (నవ్వుతూ).. సురేశ్‌గారి దృష్టి వేరుగా ఉంటుంది. కిరణ్‌గారు రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ మూవీకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం ప్లస్ అయ్యాయి.
► ‘అహింస’ విజయం సాధించి డబ్బులు వస్తే ఆ డబ్బుతో మళ్లీ సినిమాలు తీస్తాను. నా చిత్రం మూవీస్ బేనర్‌లో కొత్త దర్శకులని పరిచయం చేస్తాను. నా తర్వాతి సినిమా ‘రాక్షస రాజు’ని రానాతో చేస్తాను. ఆ తర్వాత మా అబ్బాయిని హీరోగా పరిచయం చేసే సినిమా చేస్తాను.
ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లకు నేనున్నా
Published Thu, Jun 1 2023 1:07 AM | Last Updated on Thu, Jun 1 2023 8:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment