కరీంనగర్ సప్తగిరికాలనీకి చెందిన దంపతులకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. మూడేళ్ల తర్వాత రెండో సంతానం కోసం ఓ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నారు. ఈ సమయంలో ఆ ఇల్లాలు మళ్లీ గర్భం దాల్చడంతో లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేయించారు. తొలి సంతానం ఆడపిల్ల కావడంతో మళ్లీ ఎవరు పుడతారో తెలుసుకునేందుకు కరీంనగర్‌లోని ఓ స్కానింగ్ సెంటర్‌కు చెందిన నిర్వాహకులకు కొంత మొత్తం చెల్లించారు. కాగా.. కడుపులో ఉన్నది మళ్లీ ఆడపిల్లేనని చెప్పారు. దీంతో తమ వైద్య నిపుణురాలిని సంప్రదించి గర్భ విచ్ఛిత్తి (అబార్షన్) చేయించారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘కంటే కూతుర్ని కనాలి’ అంటూ ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. బంగారుతల్లి, కల్యాణలక్ష్మి, బేటి బచావో బేటి పడావో అంటూ పథకాలను ప్రవేశపెడుతున్నాయి.. కానీ భ్రూణహత్యలకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. అమ్మ కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు.. బాహ్య ప్రపంచంలోకి రాకముందే ఛిదిమేస్తున్నారు కొందరు. రక్తమాంసాలు గూడుకట్టుకోక ముందే.. ఊపిరి తీసేస్తున్నారు. మహిళ గర్భం దాల్చిన విషయం తెలిసిందే తడువుగా మగబిడ్డా..? ఆడ బిడ్డా..? తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇది కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు వ్యాపారంగా మారింది. కాసులకు కక్కుర్తి పడి లింగ నిర్ధారణ చట్టానికి తూట్లు పొడుస్తున్న వైనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల నిత్యకృత్యమైంది. ఇది భ్రూణహత్యలకు దారి తీస్తోం ది. కడుపులో శిశివులను కర్కశంగా పిండేస్తున్నారు. వెరసి రాష్ట్రంలో ఎందరో పసిపాపల జీవితాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. లింగ నిష్పత్తిలో అంతరమే ఈ అమానుషాన్ని మన ముందుంచుతోంది.
అధికారులు భ్రూణహత్యల నివారణకు వంద శాతం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆడ శిశువుల జననాలు తగ్గిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 1991 జనాభా లెక్కల ప్రకారం 0–6 బాలబాలికల నిష్పత్తి 1000ః981గా ఉంటే.. 2011 జనాభా లెక్కల వరకు 0–6 వయస్సు గల బాల బాలికల నిష్పత్తి 1000ః937కు పడిపోయింది. ప్రభుత్వం 1994లో గర్భస్త పిండ ప్రక్రియ నిరోధక చట్టాన్ని (పీఎన్‌డీటీ) ప్రవేశపెట్టింది. చట్టంపై అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయిలో నిధులు విడుదలవుతున్నా బాలికల నిష్పత్తి తగ్గుతూనే ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు మరిచారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లపై పూర్తిగా నిఘా కొరవడింది. వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 117 వరకు స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2002 నుంచి 2012 వరకు కేవలం నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2012 నుంచి 2017 వరకు ఎనిమిది వరకు కేసులు నమోదైనా, ఆ స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిబంధనలు పాటించకుండా స్కానింగ్ కేంద్రాలు వ్యవహరిస్తుంటే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం మొద్దునిద్ర నటిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్కానింగ్ కేంద్రాలలో రికార్డుల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉంది. కనీసం గర్భిణీకి ఎన్నో కాన్పు..? గతంలో అబార్షన్లు జరిగాయా..? అన్న ప్రాథమిక సమాచారం లేకుండానే రికార్డులను నిర్వహించడం వారి డొల్లతనానికి అద్దం పడుతోంది.
ప్రత్యేక బృందాల తనిఖీలు ఏవి..?
నిత్యకృత్యంగా మారిన భ్రూణహత్యలను అరికట్టడంలో భాగంగా ఉన్నతాధికారులు మొబైల్ బృందంగా ఏర్పడి లింగ నిర్ధారణ చట్టం ఎలా అమలవుతోంది? ఆసుపత్రుల్లో పరిస్థితేంటి? స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నాయా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తారు. ఈ క్రమంలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించినట్లయితే వారిపై వెంటనే చర్యలకు ఉపక్రమించే అధికారం ఈ బృందానికి ఉంది. ఎంతో గోప్యంగా సాధారణ వ్యక్తుల్లా వచ్చే ఈ బృందసభ్యులు ఓ గర్భిణిని వెంట తీసుకొచ్చి రహస్యంగా ఆపరేషన్‌ను పూర్తి చేస్తారు. చాలా కాలంగా ఇలాంటి ఆపరేషన్లేవి జిల్లాలో జరగడం లేదు. దీంతో ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల నిర్వహకులు చట్టా మరచి అడ్డదారిలో అర్థిస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది..
చట్టం? : గర్భంలోనే ఆడ శిశువులను చిదిమేసే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం 1994లో లింగ నిర్ధారణ నిరోధక చట్టాన్ని తెచ్చింది.
పరిధి : ఈ చట్టాన్ని అనుసరించి గర్భిణి ఆరోగ్య పరిస్థితిలో మార్పులు, పిండం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తప్ప ఎలాంటి పరి స్థితిల్లోనూ పరీక్షలు చేయకూడదు.
నిబంధన : గర్భస్థ శిశు పరీక్షలు జరపాలంటే ప్రైవే ట్, ప్రభుత్వ సంస్థలు, ఇతర కేంద్రాలు వైద్య ఆరో గ్యశాఖ వద్ద తప్పకుండా రిజిష్ట్రర్ చేయించుకోవాలి.
శిక్ష : చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారికి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.
ఒక్క కేసైనా.. : కానీ జిల్లాలో ఇటీవల కాలంలో అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసిన దాఖలాల్లేవు. దీన్నిబట్టి జిల్లాలో సాగుతున్న భ్రూణహత్యల వ్యవహారంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంకా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కరీంనగర్‌లోని మంకమ్మతోటలో శ్రీ సాయి వేంకటేశ్వర నర్సింగ్ హోమ్‌పై పోలీసులు, ఐసీడీఎస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఆధ్వర్యంలో టాస్క్‌పోర్సు దాడులు నిర్వహించి గర్భిణికి స్కానింగ్ నిర్వహిస్తుండగా 2017లో పట్టుకున్నారు. ఈ దాడిలో సీపీ కమలాహసన్‌రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని నర్సింగ్ హోమ్‌ను సీజ్ చేశారు. క్రైం నెంబర్ సీసీ 1801/2017 కేసు నమోదైంది.
లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం..
చట్టం ప్రకారం లింగ నిర్ధారణ చేయడం నేరం. చట్టానికి లోబడి పనిచేయాలి. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులే వివక్ష చూపుతున్నారు. సమాజంలో వివక్షచూపడం మానుకోవాలి. ఎవరు పుట్టినా వారికి జన్మనిచ్చింది తామేనని గుర్తించాలి. ఆడపిల్ల వద్దనుకునే సంస్కృతి మారాలి. ఇద్దరు ఒక్కటే అనే భావన రావాలి. కొంతమంది డబ్బులకు కక్కుర్తిపడి స్కానింగ్‌లు చేస్తున్నారు. ఇది సరైంది కాదు.
– డాక్టర్ పుల్లెల సునీత,ప్రముఖ గైనకాలజిస్టు, కరీంనగర్
ఫిర్యాదులు అందితే తనిఖీలు..
స్కానింగ్ సెంటర్లపై ఫిర్యాదులు అందితే తనిఖీలు చేస్తాం. ప్రత్యేక నిఘా కమిటీ అంటూ ఏమీ లేదు. స్కానింగ్ సెంటర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నపుడే పరిశీలిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎం.రాజేశం, డీఎంహెచ్‌ఓ, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment