కిక్కుకు నేడే లక్కు
- మద్యం దుకాణాలకు లాటరీ సిద్ధం
- భారీగా విచ్చేయనున్న వ్యాపారులు
సాక్షి,సిటీబ్యూరో: మద్యం దుకాణం పెట్టి రెండుచేతులా సంపాదించాలనుకునే వ్యాపారులు లక్కు కోసం సిద్ధమయ్యారు. నగరపరిధిలోని 212 మద్యందుకాణాలకు సోమవార ం లాటరీ నిర్వహించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్ ఆవరణలో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా ఆధ్వర్యంలో డ్రా తీయనున్నట్లు నగర ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ఫారూఖీ తెలిపారు. మొత్తం ఇప్పటివరకు 161 దుకాణాలకుగాను 312 మంది దరఖాస్తు చే శారని చెప్పారు.
మరో 51 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. దరఖాస్తు చేసుకోని దుకాణాలకు గడువు పెంచే అంశాన్ని ఎక్సైజ్ కమిషనర్ పరీశీలిస్తున్నారని చెప్పారు. కాగా గ్రేటర్ పరిధిలో ఒక్కో దుకాణానికి రూ.90 లక్షల లెసైన్సు ఫీజు నిర్ణయించిన విషయం విదితమే. లాటరీ ప్రక్రియ కోసం ఎగ్జిబిషన్‌మైదానంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలో: రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొత్తం 390 మద్యం దుకాణాలుండగా..340 దుకాణాలకు ఏకంగా 3368 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఉదయం వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో ఈ దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. మరో 50 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. ఈ దుకాణాలకు లెసైన్సు ఫీజు రూ.90 లక్షలుండడంతో వ్యాపారులెవరూ ముందుకురానట్లు తెలిసింది. ఈ దుకాణాలకు గడువు పెంచే అంశాన్ని త్వరలో ప్రకటిస్తామని ఆవర్గాలు పేర్కొన్నాయి.