12న హరితహారానికి శ్రీకారం
కరీంనగర్‌లో సీఎం చేతుల మీదుగా ప్రారంభం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12న హరితహారానికి శ్రీకారం చుడుతున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కరీంనగర్‌లో దీనిని ప్రారంభిస్తామని పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించి 2,925 నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. శుక్రవారం ఉపాధిహామీ, హరితహారంపై సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లు, డీఆర్డీఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
మూడేళ్లలో 230 కోట్ల మొక్కలను హరితహారంలో భాగంగా నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను, ప్రతి నియోజక వర్గంలో 40 లక్షల మొక్కలను మూడేళ్లలో నాటే దిశగా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ఈ ఏడాది మొత్తం 42 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించామన్నారు. రాష్ట్రంలో 24 శాతమున్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.