మృత్యు ఘంటికలు
రక్షిత మంచినీటి సరఫరా పథకం ఓవర్‌హెడ్ ట్యాంకులు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న ట్యాంకులను నేలమట్టం చేసి జనం ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కూల్చివేతకు నిధులు లేవని గ్రామ పంచాయతీ పాలక మండళ్లు తెగేసి చెప్తున్నాయి. కూల్చి వేయాల్సిన బాధ్యత మీదంటే మీదంటూ గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ అధికారులు ఎవరికి వారుగా తప్పుకుంటున్నారు.
-సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో వేల లీటర్ల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకులు 2700కు పైగా ఉన్నాయి. వీటిలో దశాబ్ధాల క్రితం నిర్మిం చిన చాలా ట్యాంకులు శిథిలావస్తకు చేరుకున్నాయి. 78 ఓవర్ హెడ్ ట్యాంకులు కూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం గుర్తించింది. ఇలాంటి ట్యాంకులను నీటిని నిల్వ చేసేందుకు ఉపయోగించవద్దంటూ సంబంధిత గ్రామ పంచాయతీలకు ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం నోటీసులు కూడా జారీచేసింది.
ఆర్‌డబ్ల్యూఎస్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ చాలాచోట్ల శిథిలావస్తకు చేరిన ట్యాంకుల ద్వారానే రక్షిత నీరు సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్యాంకు కూల్చివేతకు రూ.40వేలకు పైగా ఖర్చవుతుందని అధికారులు లెక్కలు వేశారు. అయితే కూల్చివేతకు అవసరమైన నిధులు తమ వద్ద లేవంటూ గ్రామ పంచాయతీలు చేతులెత్తేస్తున్నాయి. ప్రత్యేకంగా నిధులు ఇస్తే తప్ప కూల్చివేతలు చేపట్టలేమంటూ పంచాయతీ పాలకమండళ్లు తెగేసి చెప్తున్నాయి. ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలోనూ ఇదే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ప్రమాదకరంగా మారిన ఓవర్‌హెడ్ ట్యాంకుల కూల్చివేతకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని జిల్లాకు చెందిన మంత్రులు కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే నిధులు ఎక్కడ నుంచి సమీకరించాలో స్పష్టత లేకపోవడంతో అధికారులు మౌనం పాటిస్తున్నారు. మరోవైపు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఇవ్వడమే తమ బాధ్యత అని, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఆస్తులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెప్తున్నారు. ‘టెక్నికల్ జేఈలు గుర్తించిన ట్యాంకులను వినియోగించ వద్దంటూ నోటీసులు జారీ చేశామని’ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృపాకర్ రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు.
కొరవడిన సమన్వయం
ఏళ్ల తరబడి ట్యాంకుల మరమ్మతు, నిర్వహణ పట్టించుకోకపోవడం వల్లే జీవిత కా లం తగ్గి శిథిలావస్తకు చేరుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ట్యాంకుల శుద్ధి పేరిట బ్లీచింగ్ కోసం నిధులు ఖర్చు చేసిన ట్లు లెక్కలు చూపుతున్న గ్రామ పంచాయతీలు మరమ్మతులపై మాత్రం దృష్టి సా రించడం లేదు. ట్యాంకుల కూల్చివేతపై జిల్లా పంచాయతీ కార్యాల యం స్పందన ఆర్‌డబ్ల్యూఎస్ వివరణకు పూర్తి భిన్నంగా కని పిస్తోంది.
శిథిలావస్తలో ఉన్న ట్యాంకుల కూల్చివేతకు సాంకేతిక అంశాలు ముడిపడి ఉ న్నందున ఆర్‌డబ్ల్యూఎస్ సహకారంతోనే సాధ్యమవుతుం దని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి వెల్లడి ంచారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ట్యాంకుల కూల్చివేతల గురించి త్వరలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో చర్చిస్తామని డీపీఓ వెల్లడించారు.