సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికలు జీహెచ్‌ఎంసీపై పెనుప్రభావం చూపాయి. దిగువస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల దాకా అందరూ ఎన్నికల విధుల్లో నిమగ్నమవడంతో నాలుగునెలల పాటు ఎక్కడి పనులక్కడే నిలిచిపోయాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న బి.జనార్దన్‌రెడ్డిని బదిలీ చేశాక ఎం.దానకిశోర్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీలోని ఐదు జోన్లు ఆరు జోన్లుగా రూపాంతరం చెందాయి. 30 సర్కిళ్లను 48 సర్కిళ్లకు, ఆరు జోన్లను 12 జోన్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, వారి ఏర్పాటు మాత్రం సాధ్యం కాలేదు. నలుగురు యువ ఐఏఎస్‌లు భారతి హొళికేరి, ముషారఫ్, శ్రుతి ఓజా, సిక్తా పట్నాయక్ లు బదిలీపై జీహెచ్‌ఎంసీకి వచ్చారు.
వీరిలో భారతి హొళికేరి స్వల్ప కాలంలోనే జీహెచ్‌ఎంసీ నుంచి బదిలీ కాగా.. ఆమె స్థానంలో మరో ఐఏఎస్ సందీప్‌కుమార్ ఝా వచ్చారు. అక్రమ కట్టడాల నిరోధం, విపత్తు నిర్వహణ తదితర పనుల కోసం కొత్తగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసి యువ ఐపీఎస్ విశ్వజిత్‌ను డైరెక్టర్‌గా నియమించారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకెళ్తూ ఫుట్‌ఫాత్‌లపై దాదాపు 12 వేల ఆక్రమణలను తొలగించారు. విపత్తుల నివారణకు ప్రత్యేక వాహనాలు, యంత్ర సామగ్రిని సమకూర్చుకున్నారు. బార్లు, పబ్బులపైనా కొరడా ఝళిపించారు. అయితే, ఎన్నికల ప్రకటనతో ఆయా కార్యక్రమాలకు బ్రేక్ పడింది. భవన నిర్మాణ అనుమతుల్లో ఈసీబీసీని అమల్లోకి తెచ్చారు. వివిధ ప్రాజెక్టుల కవసరమైన నిధులు చెల్లించేందుకు ఖజానాలో నిధులు లేకపోవడంతో టీడీఆర్(అభివృద్ధి బదలాయింపు హక్కు)ను విస్తృతంగా ప్రచారం చేశారు. రహదారుల విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి నాలుగురెట్లు పరిహారంతో దీన్ని అమల్లోకి తెచ్చారు.
అందుబాటులోకి అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు
ఎస్సార్‌డీపీలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో అయ్యప్ప సొసైటీ, చింతల్‌కుంట, మైండ్‌స్పేస్ అండర్‌పాస్‌లు, కామినేని, మైండ్‌స్పేస్ ఫ్లై ఓవర్లు పూర్తిచేసి అందుబాటులోకి తేవడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ ఉపశమనం లభించింది. నిధుల లేమితో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మందగించింది. గ్రేటర్‌లో అక్రమ నిర్మాణాలు ఆగలేదు. ఓటర్ల జాబితా నుంచి మొదలు పెడితే ఫలితాలు వెలువడ్డాక వీవీప్యాట్ స్లిప్‌లు బయటకు రావడం దాకా ఎన్నికల నిర్వహణలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ఘనవ్యర్థాల నిర్వహణలో నంబర్–1
రహదారుల కోసం పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్(పీపీఎం) పేరిట రూ.720 కోట్లు మంజూరైనా నిధులు విడుదల కాక పనులు ముందుకు సాగలేదు. ప్రజలకు రోడ్ల పాట్లు తప్పలేదు. భూసేకరణ సమస్యలతో నాలాల ఆధునీకరణ పనులూ ముందుకు సాగలేదు. స్వచ్ఛ ర్యాంకింగ్‌లో జీహెచ్‌ఎంసీ గత ఏడాది కంటే దిగజారిపోయింది.
గత సంవత్సరం 22వ ర్యాంకు రాగా, ఈ సంవత్సరం 27వ ర్యాంకు లభించింది. ఘనవ్యర్థాల నిర్వహణలో మాత్రం రాజధాని నగరాల్లో ప్రథమస్థానం పొందింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పనుల్లో పురోగతి సాధించింది. సాలార్జంగ్ మ్యూజియం వద్ద పాలికాబజార్ తరహాలో ఐకానిక్ బ్రిడ్జి, చార్మినార్ వద్ద అమృత్‌సర్ తరహా ప్రాజెక్టులు కార్యరూపం దాల్చలేదు. ‘టీమ్ యాప్’ వినియోగంలోకి రాలేదు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏసీ బస్టాపులు ప్రచార పటాటోపాలుగా మిగిలాయి. ఎఫ్‌ఓబీలు తదితరమైనవి వాస్తవరూపం దాల్చలేదు. రూ.13,500 కోట్లతో భారీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినప్పటికీ, సగం నిధులు కూడా సమకూరలేదు. నెలనెలా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల జీతాల చెల్లింపు కూడా కష్టంగా మారింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment