
మహానగరం పూర్తిస్థాయి ఎల్‌ఈడీ దీపాల వెలుగులతో నిండనుంది. సిటీలో 4.60 లక్షల లైట్ల ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటికే 4.03లక్షల లైట్లను ఏర్పాటు చేశారు. మిగిలినవి నెలరోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. దీంతో దేశంలో ఈ ఘనత సాధించిన తొలి మున్సిపల్‌కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ గుర్తింపు పొందనుంది. పైగా ఈ లైట్లఏర్పాటుతో గ్రేటర్‌లో ఏటా 162.275 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది.
సాక్షి, సిటీబ్యూరో: పూర్తిస్థాయి ఎల్‌ఈడీ వీధిదీపాల నగరంగా హైదరాబాద్ త్వరలోనే అవతరించనుంది. దేశంలోనే ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయని విధంగా దాదాపు 4.60 లక్షల ఎల్‌ఈడీల లక్ష్యాన్ని జీహెచ్‌ఎంసీ పూర్తి చేయనుంది. నగరంలోని మొత్తం వీధిదీపాల స్థానే ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ.. ఇప్పటి వరకు 4.03 లక్షల లైట్లను ఏర్పాటు చేసింది. మిగతా వాటిని మరో నెలరోజుల్లో ఏర్పాటు చేయనుంది. దేశంలో ఎన్నో మునిసిపల్ కార్పొరేషన్లు ఎల్‌ఈడీల ఏర్పాటుకు సిద్ధమైనప్పటికీ ఏర్పాటుకు మాత్రం ఎంతో సమయం పడుతోంది. ఇప్పటి వరకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండు లక్షల ఎల్‌ఈడీలు, విశాఖపట్నం కార్పొరేషన్‌లో లక్ష ఎల్‌ఈడీలు ఏర్పాటు చేశారు. వాటిని అధిగమించి జీహెచ్‌ఎంసీ దాదాపు ఎనిమిది నెలల్లో 4 లక్షల పైచిలుకు ఎల్‌ఈడీలను ఏర్పాటు చేసింది. మిగతా ఏర్పాటు పూర్తయితే దేశంలోనే అత్యధిక ఎల్‌ఈడీలే కాక నగరమంతా ఎల్‌ఈడీలు అందుబాటులోకి తెచ్చిన కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ అవతరించనుంది. రహదారుల వెంబడి, జీహెచ్‌ఎంసీ పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, శ్మశానవాటికలు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఎల్‌ఈడీలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) ఆధ్వర్యంలో ఈ పనులుజరుగుతున్నాయి.
తగ్గిన విద్యుత్ ఖర్చులు
జీహెచ్‌ఎంసీలో ఈ లైట్ల ఏర్పాటు ద్వారా ఏటా 162.275 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా రూ.115.12 కోట్ల విద్యుత్ ఖర్చులు తగ్గుతాయి. ఏడాదికి 1,29,820 టన్నుల కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని విద్యుత్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటుతో రహదారులు ప్రకాశవంతంగా ఉండి రాత్రుళ్లు ప్రమాదాలు ఇప్పటికే చాలా వరకు తగ్గాయని పేర్కొన్నారు. గడచిన ఐదు మాసాల్లోనే జీహెచ్‌ఎంసీ విద్యుత్ బిల్లులు దాదాపు రూ.29 కోట్లు తగ్గాయి. ప్రాజెక్టు మొత్తం పూర్తయితే విద్యుత్ వినియోగం 55 శాతం తగ్గుతుందని అంచనా. ఎల్‌ఈడీల ఏర్పాటు ప్రాజెక్ట్ వ్యయం మొత్తం రూ.217.12 కోట్లు కాగా, జీహెచ్‌ఎంసీ ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు. విద్యుత్ ఆదాతో మిగిలే నిధులనే వాయిదాల పద్ధతిలో ఈఈఎస్‌ఎల్‌కు చెల్లించనుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఆటోమేటిగ్గా ఆన్/ ఆఫ్..
♦ సూర్యకాంతి కనుగుణంగా ఆటోమేటిగ్గా స్ట్రీట్‌లైట్స్ ఆన్/ఆఫ్ అవుతాయి.
♦ సెంట్రల్లీ కంట్రోల్డ్ మానిటరింగ్ సిస్టమ్‌తో ఏరోజు ఎన్ని లైట్లు వెలగనిదీ తెలుస్తుంది.
♦ ప్రకాశవంతమైన వెలుతురు వల్ల రహదారి ప్రమాదాలు తగ్గుతాయి.
ఏటా ప్రయోజనం ఇదీ..
♦ ఆదా అయ్యే విద్యుత్ చార్జీలు: రూ.115.22 కోట్లు
♦ తగ్గే నిర్వహణ ఖర్చు: రూ.22 కోట్లు
♦ తగ్గనున్న కార్బన్ డై ఆక్సైడ్: 1,29,820 టన్నులు
♦ తగ్గే పీక్ డిమాండ్: 40.42 మెగావాట్లు
Comments
Please login to add a commentAdd a comment