టీడీఆర్‌కు రండి! | GHMC Welcomes TDR | Sakshi
Sakshi News home page

టీడీఆర్‌కు రండి!

Published Thu, May 9 2019 8:27 AM | Last Updated on Mon, May 13 2019 1:11 PM

GHMC Welcomes TDR - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చేపడుతున్న దాదాపు రూ.25 వేల కోట్ల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ భారాన్ని తగ్గించుకునేందుకు జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తెచ్చిన టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌)కు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో భూములపై హక్కులున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. తద్వారా ఎవరి వద్దనైతే ఈ హక్కులు ఉంటాయో..వారి వద్దనుంచి అవసరమైన వారు కొనుక్కునేందుకు అవకాశం లభిస్తుంది. తద్వారా భూములు అమ్ముకోవాలనుకునేవారికి, కొనుక్కునే వారికీ ప్రయోజనం కలుగుతుంది. దాదాపు రెండు నెలల్లో ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది.

ఏమిటీ టీడీఆర్‌..?
నగరంలో చేపడుతున్న ఆయా ప్రాజెక్టుల అవసరాల కోసం జీహెచ్‌ఎంసీ భూసేకరణ  చేస్తోంది. ముఖ్యంగా రహదారుల విస్తరణ, ఫ్లై ఓవర్ల పనులకు ఈ అవసరమేర్పడుతోంది. భూసేకరణలో నష్టపోయే వారికి ఆస్తులు కోల్పోతే స్ట్రక్చరల్‌ వాల్యూను నష్టపరిహారంగా చెల్లిస్తారు. కోల్పోయే భూమికి సంబంధించి భూసేకరణ చట్టం ద్వారా సేకరిస్తే రిజిస్ట్రేషన్‌ విలువకు రెండింతలు నష్టపరిహారంగా  చెల్లించాలి. టీడీఆర్‌ కల్పిస్తే జీహెచ్‌ఎంసీకి నగదు రూపేణా ఎలాంటి భారం పడదు. టీడీఆర్‌కు ముందుకొచ్చేవారు కోల్పోయే ప్లాట్‌ ఏరియాకు 400 శాతం బిల్టప్‌ ఏరియాతో మరో చోట నిర్మాణం చేసుకునేందుకు హక్కు కల్పిస్తారు. లేదా వారు పొందే ఈ హక్కును ఇతరులకు అమ్ముకోవచ్చు. అంతే కాకుండా భవన నిర్మాణ నిబంధనల మేరకు ఆయా ప్రాంతాల్లో అనుమతించే అంతస్తుల కంటే ఒక అంతస్తును అదనంగా నిర్మించుకోచ్చు.  ఉదాహరణకు ఎవరైనా 500 గజాల స్థలాన్ని రహదారుల విస్తరణలో కోల్పోతే వారికి 2000 గజాల బిల్టప్‌ ఏరియాకు అవకాశమిస్తారు. భూమి కోల్పోయిన వ్యక్తికి అక్కడి రిజిస్ట్రేషన్‌ ధర మేరకు 2 వేల గజాల భూమి ధర ఎంత ఉంటుందో అంత విలువ మేరకు నగరంలో ఎక్కడైనా నిర్మాణం చేసుకోవచ్చు.

ఇందుకుగాను నిబంధనల కంటే మరో అంతస్తును కూడా అదనంగా నిర్మించుకోవచ్చు.  బహుళ అంతస్తుల్లో (18మీటర్ల ఎత్తుకుమించిన భవనాల్లో) అయితే రెండు అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చునని జీహెచ్‌ఎంసీ చీఫ్‌సిటీప్లానర్‌ ఎస్‌.దేవేందర్‌రెడ్డి తెలిపారు. చెరువులు, కుంటల ప్రదేశాల్లో పట్టాలున్నవారు భూములు కోల్పోతే వారికి  200 శాతం బిల్టప్‌ ఏరియాకు టీడీఆర్‌  హక్కు కల్పిస్తారు. టీడీఆర్‌ వల్ల నాలుగింతల బిల్టప్‌ ఏరియాతోపాటు అదనపు అంతస్తులకు వీలుండటంతో పలువురు దీని వైపు మొగ్గు చూపుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఇటీల చేపట్టిన ఎస్సార్‌డీపీ, నాలా విస్తరణ పనుల్లో  ఖాజాగూడ, దీప్తిశ్రీనగర్‌  తదితరప్రాంతాల్లో  టీడీఆర్‌ హక్కులే కల్పించారు. ఈ టీడీఆర్‌ హక్కులతో కొండాపూర్, మాదాపూర్‌ చందానగర్‌ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలకు ముందుకొస్తున్న వారు పెరుగుతున్నారు. జీహెచ్‌ఎంసీలో దాదాపు ఏడాదిన్నర క్రితం  ఈ టీడీఆర్‌ను అమల్లోకి తేగా ఇప్పటి వరకు దాదాపు 300 మంది నుంచి సేకరించిన స్థలాలకు టీడీఆర్‌ హక్కులిచ్చారు. వారిలో దాదాపు వందమంది వరకు ఈ హక్కులతో నిర్మాణాలు చేపట్టడమో, ఇతరులకు విక్రయించడమో చేశారు. టీడీఆర్‌ గురించి అందరికీ సరైన సమాచారం లేదని, స్పష్టంగా తెలిస్తే ఇంకా ఎక్కువమంది దీనివైపు మొగ్గు చూపగలరని భావిస్తున్నారు. అందుకుగాను టీడీఆర్‌ హక్కులున్న వారి వివరాలను (వారి సమ్మతితోనే)వారికి హక్కు కల్పించినప్పుడే ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోనే నమోదయ్యే అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనున్నారు. పంద్రాగస్టు నాటికి ఈ అప్లికేషన్‌ అందుబాటులోకి రానుందని సీసీపీ తెలిపారు. ప్రస్తుతం గుజరాత్, ముంబైలలో టీడీఆర్‌కు బాగా డిమాండ్‌ ఉందన్నారు.

టీడీఆర్‌ వల్ల జీహెచ్‌ఎంసీకి పరిహారంగా నిధులు చెల్లించే పనిలేదు. లేని పక్షంలో జీహెచ్‌ఎంసీ ఎస్సార్‌డీపీ ప్రాజెక్టులకు ఇప్పటి వరకు సేకరించిన స్థలాలకు దాదాపు రూ 150 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. అటు హక్కులు పొందిన వారికి నాలుగింతల పరిహారంతో ప్రయోజనం కలుగనుంది.  అదనపు అంతస్తుకు అవకాశం లేని ప్రాంతంలో అక్రమాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఈ హక్కులు కొనుక్కునేవారికీ ప్రయోజనమే కానుండటంతో దీనిని మరింతగా ప్రమోట్‌ చేసే యోచనలో జీహెచ్‌ఎంసీ ఉంది.

నిబంధనలిలా...
ఆయా ప్రాంతాల్లోని స్థలాల  రిజిస్ట్రేషన్‌ విలువను పరిగణనలోకి తీసుకొని ఆ విలువ కనుగుణంగా  మాత్రమే టీడీఆర్‌ కింద అనుమతులిస్తారు. ఉదాహరణకు రోడ్డు విస్తరణకు భూమి కోల్పోయే వారు వంద గజాల భూమిని జీహెచ్‌ఎంసీకి ఇస్తే.. అక్కడి భూమి రిజిస్ట్రేషన్‌ విలువ మేరకు నాలుగింతల హక్కు కల్పిస్తారు. అంటే వంద గజాల స్థలం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.10 లక్షలైతే అంతకు నాలుగింతలు అంటే రూ.40 లక్షలకు  టీడీఆర్‌ హక్కులిస్తారు. ఈ హక్కును వినియోగించుకొని భూమి కోల్పోయిన వారు  రూ.40 లక్షల రిజిస్ట్రేషన్‌ ధరకు ఏ ప్రాంతంలో ఎంత భూమి వస్తుందో అంత బిల్టప్‌ ఏరియాతో నిర్మాణం చేసుకోవచ్చు. ఒకటి, రెండు అంతస్తులను అదనంగా కూడా నిర్మించుకోవచ్చు. ఇతరులకు విక్రయించుకోవాలనుకునేవారు విక్రయించుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను రూపొందించనున్నారు. తమ ఈ హక్కును ఆన్‌లైన్‌లో ఉంచేందుకు సుముఖత వ్యక్తం చేసిన వారి హక్కుల వివరాలు మాత్రమే ఉంచుతారు. తద్వారా కొనుక్కోవాలనుకునేవారు నేరుగా ఆన్‌లైన్‌లో చూసి తెలుసుకోచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement