బస్తీలకు ఫిల్టర్ వాటర్
* జీహెచ్‌ఎంసీ కొత్త సంవత్సరం కానుక
* రూ.4కే 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు
* తొలి దశలో 45 స్లమ్‌ల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లోని 45 పేదబస్తీల ప్రజలకు వచ్చేనెలలో శుద్ధజలం(ఫిల్టర్ వాటర్) అందుబాటులోకి రానుంది. ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుతో బోరు నీటిని శుద్ధిచేసి తక్కువ ధరకు అందజేయనున్నారు. పేదల కోసం ఇప్పటికే రూ. 5కే భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న జీహెచ్‌ఎంసీ కొత్త సంవత్సర కానుకగా వచ్చే నెలలో రూ.4కే 20 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఇంకా తక్కువ ధరకే అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 400 నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, తొలిదశలో 60 కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందుకుగాను సర్కిళ్ల వారీగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న బస్తీలు/కాలనీలను గుర్తించారు.
వీటిలో 45 బస్తీల్లో మాత్రమే నీటిశుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు సదుపాయాలుండటంతో తొలుత ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. శివోహం ఎంటర్‌ప్రజైస్ కోటి రూపాయలతో వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. వచ్చేనెలలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్లలో స్థానిక స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు కొద్ది రోజుల పాటు శిక్షణనిచ్చి.. అనంతరం నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు. నిర్వహణ ఖర్చులు పోను మిగిలే ఆదాయం సంఘ సభ్యులకు చెందుతుంది. తద్వారా ఒకవైపు తాగునీరు లేని బస్తీలకు తాగునీటి సదుపాయంతోపాటు స్వయం సహాయక సంఘాలకు ఎంతోకొంత ఆదాయం లభిస్తుంది. వీటి పని తీరు, స్పందనను బట్టి దశలవారీగా గ్రేటర్‌లోని అన్ని బస్తీలలో వీటిని ఏర్పాటు చేస్తారు.
తీవ్రత ఉన్నచోట ప్రాధాన్యం..
ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పేదలకు తాగునీటి సదుపాయాల కోసం రూ. 20 కోట్లు కేటాయించినప్పటికీ, వివిధ కారణాలతో ఇప్పటి వరకు ఖర్చుచేయలేకపోయారు. భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలు, ప్లాంట్ల ఏర్పాటుకు తగిన భవనం(జీహెచ్‌ఎంసీ లేదాప్రభుత్వ భవనం), పవర్‌బోర్ల ఏర్పాటుకు కరెంట్ సదుపాయం తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని 45 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుద్ధి చేసిన నీటిని 20 లీటర్ల క్యాన్‌ను రూ. 4లకే అందజేయాలని భావిస్తున్నారు. కోరుకున్న వారికి ప్లాంట్ నుంచి ఇళ్లకు క్యాన్లను పంపిణీ చేసే యోచన కూడా చేస్తున్నారు. సొంత సైకిల్ కలిగిన యువతకు ఉపాధిగా కూడా ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. నీటి క్యాన్లను ఇళ్లకు చేరవేసే యువత రవాణాచార్జీగా వినియోగదారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసుకునేందుకు అనుమతిస్తారు. తొలి దశ ఎంపిక చేసిన వాటిలో 600 నుంచి 4000 జనాభా వరకున్న స్లమ్స్ ఉన్నాయి.
ప్లాంట్లు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలివే..
నాగోల్ ఓల్డ్ విలేజ్, చెరుకుతోట బస్తీ, ఎన్టీఆర్ నగర్, పూసల బస్తీ, క్రాంతినగర్ (ఏకలవ్యనగర్), జీఎం చావుని, కాలాడేరా, గౌలిపురా కమేలా, గగన్‌పహాడ్ వీకర్‌సెక్షన్‌కాలనీ, బుద్వేల్ రైల్వేస్టేషన్, నేతాజీనగర్, మైలార్‌దేవ్‌పల్లి, లక్ష్మీగూడ, ఎంసీహెచ్ కాలనీ, నటరాజ్‌నగర్, అహ్మద్‌నగర్, బజార్‌ఘాట్, మౌలానా ఆజాద్‌నగర్, నరసింహబస్తీ, నల్లగండ్ల, అంబేద్కర్‌నగర్, దర్గా ఎస్టేట్స్, న్యూ వివేకానందనగర్, గాయత్రినగర్ కాలనీ, అంబేద్కర్‌నగర్, ఇందిరానగర్, కార్ఖానా, బాపూజీనగర్, భోలక్‌పూర్, బండమైసమ్మనగర్, ఓల్డ్ కస్టమ్స్ బస్తీ, తదితర ప్రాంతాలు.