రుణమో రామచంద్రా!
మృగశిర కార్తె ప్రవేశించింది. వర్షాకాలం ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్‌కోసం రైతన్న సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ప్రస్తుతం రుణమో రామచంద్రా అని అన్నదాత ఎదురు చూస్తున్నాడు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం, కొత్తగా రుణాలివ్వడానికి బ్యాంకర్లు ముందుకు రాకపోవడంతో ఈసారి ఖరీఫ్‌కు పెట్టుబడి గండం పట్టుకుంది. దీంతో మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు వచ్చాయి.
కామారెడ్డి : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 3.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. 4.42 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో అధిక శాతం మంది చిన్న, సన్నకారు రైతులే కావడం వల్ల పెట్టుబడుల కోసం వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లకు అవసరమైన పెట్టుబడులను ఆయా బ్యాంకుల ద్వారా పొందేవారు. ఈసారి రుణాల మాఫీ వ్యవహారం ముందుకు రావడంతో పెట్టుబడులకు అప్పు సమస్యగా మారింది.
ఇప్పటికే పంటల సాగుకు అయ్యే వ్యయం విపరీతంగా పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులు.. అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చేదని ఆవేదన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాజకీయ పార్టీలన్నీ పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో చాలా మంది రుణాలను చెల్లించలేకపోయారు. దానికి తోడు గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరెంటు సమస్యలు, ఆపై అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని కర్షకులు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రుణాలు మాఫీ అవుతాయని, ఖరీఫ్ సాగుకు కొత్త రుణాలు అందుతాయని ఆశించారు. అయితే రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం మూలంగా కొత్త రుణాలు అం దే పరిస్థితి లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పని పరిస్థితుల్లో...
పెట్టుబడుల కోసం రైతులు బ్యాంకుల్లో అప్పులు పొందారు. మరికొందరు రైతులు పెట్టుబడులు సరిపోని పరిస్థితుల్లో భార్య, పిల్లల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో ఎక్కడి బాకీలు అక్కడే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పెట్టుబడుల సమస్య రైతులను వేధిస్తోంది. ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టిన రైతులు పెట్టుబడుల వేటలో పడ్డారు.
బ్యాంకులకు వెళితే లాభం లేకపోవడంతో మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గతంలో వడ్డీ వ్యాపారుల వలలో పడి ఆర్థికంగా చితికిపోయిన రైతులు గత కొన్నేళ్లుగా వారికి దూరమయ్యారు. తిరిగి పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే పంట రుణ మాఫీ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసి, ఖరీఫ్ పెట్టుబడుల సమస్యను తీర్చాలని కర్షకులు కోరుతున్నారు.