సాక్షిప్రతినిధి, ఖమ్మం: చెక్ పవర్‌పై సందిగ్ధం వీడింది. గ్రామ సర్పంచ్‌కు, ఉప సర్పంచ్‌కు కలిపి జాయింట్ చెక్ పవర్ అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక గ్రామస్థాయిలో పంచాయతీ పాలన వేగవంతం కానుంది. ఇప్పటి వరకు ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసిన సర్పంచ్‌లకు ప్రభుత్వం తీపి కబురు అందించినట్లయింది. జిల్లాలో 584 గ్రామ పంచాయతీలు ఉండగా ఏన్కూరు మండలం నూకాలంపాడు సర్పంచ్ మినహా 583 పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఈ అధికారం దక్కింది. సుమారు ఐదు నెలలుగా ఎదురుచూస్తున్న వీరికి ఈ అవకాశం లభించడంతో ఆనందంగా ఉన్నారు.
ఈ నెల 17వ తేదీ నుంచి జాయింట్ చెక్‌పవర్ అమలులోకి రానుంది. పంచాయతీల్లో నిధులు ఉన్నప్పటికీ చెక్ పవర్ లేకపోవడంతో పనులు ముందుకు సాగని పరిస్థితి ఇప్పటివరకూ నెలకొంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పంచాయతీ పాలకులతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. ఏన్కూరు మండలంలో నూకాలంపాడుకు సర్పంచ్ లేకపోవడంతో ఉప సర్పంచ్, కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి నుంచి నిరీక్షణ..
జిల్లాలో జనవరి నెలలో మూడు విడతలుగా ఎన్నికలు జరగ్గా ఫిబ్రవరి 2వ తేదీన పాలకవర్గం ఏర్పడి సర్పంచ్, ఉప సర్పంచ్‌లు బాధ్యతలు స్వీకరించారు. అయితే..అప్పటి నుంచి తమకు చెక్ పవర్ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను చేపట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెక్‌పవర్ వస్తే త్వరగా గ్రామాభివృద్ధిపై, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించవచ్చనే ఆలోచనలో సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఉన్నారు.
గతంలో ఇలా...
గతంలో సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉండేది. సర్పంచ్, కార్యదర్శి ఇరువురు ఉప సర్పంచ్‌కు, గ్రామ ప్రజలకు తెలియకుండా తమకు నచ్చిన పనులు చేసేవారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ఉప సర్పంచ్‌కు ఎలాంటి అధికారాలు లేకుండా నామమాత్రంగా పేరుకే అన్న చందంగా నాటి పరిస్థితి తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చి సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్‌పవర్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా ప్రభుత్వం అమలు చేయబోతున్న జాయింట్ చెక్ పవర్‌తో ఉపసర్పంచ్ పదవికి విలువ పెరగబోతోంది.
నిధులున్నా..వెనుకంజ
జిల్లాలో 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ కింద పలు గ్రామ పంచాయతీల్లో నిధులు ఉన్నప్పటికీ చెక్‌పవర్ లేకపోవడంతో పనులు చేసేందుకు గ్రామ పంచాయతీలు వెనుకంజ వేశాయి. ఈ నెల 17వ తేదీ నుంచి జాయింట్ చెక్ పవర్ అమల్లోకి రానున్నట్లు ప్రకటించడంతో ఎంపీడీఓలు వారి పేర్లు, సంతకాలను సేకరించడంతో పాటు ఎస్టీఓ, డీటీఓ కార్యాలయాలకు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తయితేనే చెక్ పవర్ విధానం అమలవనుంది.
శుభ పరిణామం..
రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను ఇవ్వడం శుభ పరిణామం. ఇరువురికి చెక్‌పవర్ ఉండడం వల్ల అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉప సర్పంచ్‌లకు మరింత గుర్తింపు లభించినట్లయింది. –నున్నా వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్, రేగులచలక, రఘునాథపాలెం మండలం
Comments
Please login to add a commentAdd a comment