‘ప్రభుత్వ’ బియ్యం కొనే వారేరీ?
- ప్రత్యేక కౌంటర్లలో తక్కువ ధరకు విక్రయిస్తున్నా అమ్మకాలు అంతంత మాత్రమే
- ప్రజల్లో అవగాహన కల్పించని సర్కారు
- పలు చోట్ల అందుబాటులో లేని కౌంటర్లు
- 5 నెలల్లో విక్రయించింది 12 వేల క్వింటాళ్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బియ్యం ధరల నియంత్రణతో పాటు సాధారణ ప్రజలకు మేలు రకం బియ్యం తక్కువ ధరకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లతో ప్రయోజనం కనిపించడం లేదు. ఈ ప్రత్యేక కౌంటర్లపై సాధారణ ప్రజలకు అవగాహన లేకపోవడం, ప్రభుత్వం కూడా పెద్దగా ప్రచారం కల్పించకపోవడం, సరైన చోట్ల, సరైన సంఖ్యలో ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో వాటిని వినియోగించుకునే వారే కరువయ్యారు. దాదాపు ఐదు నెలల్లో మొత్తంగా 337 కౌంటర్ల ద్వారా కేవలం 12 వేల క్వింటాళ్ల బియ్యం విక్రయం మాత్రమే జరగడం దీనిని స్పష్టం చేస్తోంది.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఫైన్ రకం బియ్యం ధరలను వ్యాపారులు ఇష్టారీతిగా పెంచే అవకాశాన్ని ముందుగానే పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఈ ఏడాది జూన్‌లోనే తగిన చర్యలు చేపట్టింది. పొరుగు రాష్ట్రాల్లో మేలు రకం బియ్యానికి మంచి ధర లభించడంతో గతంలో రైస్‌మిల్లర్లు అక్కడికి తరలించి రాష్ట్రంలో కొరత సృష్టించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని... ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ మేరకు సామాన్య, మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని, రైస్‌మిల్లర్లతో చర్చించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలను అధికారులు చేపట్టారు. ఇలా జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని పది జిల్లాల్లో 337 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మేలు రకం సోనామసూరి బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తుండగా.. ‘ప్రభుత్వ’ కౌంటర్లలో కిలో రూ. 35కే అందిస్తున్నారు.
కానీ ఈ ప్రత్యేక కౌంటర్లపై ప్రజలకు అవగాహన కొరవడటంతో.. విక్రయాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈ కేంద్రాల ద్వారా దాదాపు 23 వేల క్వింటాళ్ల బియ్యం విక్రయాలు సాగగా... అందులో ఆగస్టు మొదటి వారానికి 335 కౌంటర్ల ద్వారా 11 వేల క్వింటాళ్లు విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు ఐదు నెలల కాలంలో 337 కౌంటర్ల ద్వారా కేవలం 12 వేల క్వింటాళ్ల బియ్యం విక్రయాలు మాత్రమే జరిగాయి.
సోనామసూరి ధరలు అధికంగా ఉన్న హైదరాబాద్‌లో కేవలం 1,173 క్వింటాళ్ల బియ్యం విక్రయాలు జరుగగా.. మహబూబ్‌నగర్‌లో 777, మెదక్‌లో 1,266, ఆదిలాబాద్‌లో 1,371 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలో మాత్రం 60 కేంద్రాల ద్వారా అత్యధికంగా 8,085 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ప్రత్యేక కౌంటర్లు 20కు మించి లేకపోవడంతో విక్రయాలు బాగా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా జిల్లాల్లో అసలు బియ్యం కౌంటర్ల ఏర్పాటుపై అవగాహన లేకపోవడం కారణంగా చెబుతున్నారు.
మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో వరి సాగు 28 శాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో... బియ్యం ధరలకు రెక్కలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి.