
తెలంగాణ అధికారిక చిహ్నం
* జూన్ 2న తెలంగాణ వ్యాప్తంగా రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాలు
* అదే రోజు ఉదయం 6.30కి టీ-గవర్నర్‌గా నరసింహన్ ప్రమాణం
* 8.15 గంటలకు సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
* 10.45కి పరేడ్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు
* అటు నుంచి సచివాలయానికి కేసీఆర్.. రెడ్‌కార్పెట్ స్వాగతం
* 12.57 గంటలకు బాధ్యతల స్వీకరణ.. ఉద్యోగులతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త రాష్ట్రానికి అపాయింటెడ్ డే అయిన జూన్ 2న(సోమవారం) ఉదయం టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. 10.45 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా కొత్త సీఎం కేసీఆర్ సాయుధ బలగాల వందనం స్వీకరిస్తారు. పరేడ్ అనంతరం ఆయన ప్రసంగిస్తారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే ప్రముఖులనూ కలుస్తారు. కాగా, తెలంగాణలోని అన్ని జిల్లా కార్యాలయాల్లో ఉదయం 8.30 గంటలకు పతాకావిష్కరణ కార్యక్రమం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కట్టడాలతో పాటు ట్యాంక్‌బండ్, సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్, పబ్లిక్ గార్డెన్స్‌లను వారం పాటు విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని భావించినప్పటి కీ ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు వెనక్కితగ్గారు. ఈ భేటీ జరుగుతుండగానే గవర్నర్ నుంచి పిలుపు రావడంతో సీఎస్ మహంతి మధ్యలోనే వెళ్లిపోయారు. సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి శివశంకర్, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, ఇంటెలిజెన్స్ అధిపతి మహేందర్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి, హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ సోమేష్‌కుమార్, పలుశాఖల ముఖ్యకార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ముందుగా గవర్నర్.. తర్వాత సీఎం ప్రమాణం
తెలంగాణ రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్‌గా నియమితులైన ఈఎస్‌ఎల్ నరసింహన్ కూడా జూన్ రెండునే ఉదయం ఆరున్నర గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ర్టపతి ఉత్తర్వుల మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఇప్పటికే టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నాయకునిగా ఎన్నికైన కేసీఆర్ కూడా అదే రోజు ఉదయం 8.15 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకు 600 మందికి ఆహ్వానాలు పంపిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు గురువారం శుభాకాంక్షలు తెలిపిన నరసింహన్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలికారు.
అదే రోజు బాధ్యతల స్వీకరణ..
ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత నేరుగా మింట్ కంపౌండ్ వైపున కొత్తగా ఏర్పాటు చేసిన ద్వారం నుంచి ఆయన తెలంగాణ సచివాలయంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నల్లపోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి రెడ్‌కార్పెట్‌పై నడుచుకుంటూ ‘సీ’ బ్లాక్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.57 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తెలంగాణ సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనున్నట్లు తెలిసింది.
భద్రతా ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి గురువారం సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమం జరిగే జూన్ 2న రాజ్‌భవన్, నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీఎస్ ఈ సందర్భంగా సూచించారు. అవసరమైతే అదనపు బలగాలను వినియోగించాలని కూడా పోలీస్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది.
నగర పోలీసులతో పాటు ఏపీఎస్పీని బెటాలియన్‌తో భద్రత కల్పిస్తామని అనురాగ్ శర్మ వివరించారు. కాగా, జూన్ 1 అర్ధరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా రాష్ర్ట ఆవిర్భావ ఉత్సవాలకు రాజకీయ పార్టీలన్నీ సన్నాహాలు చేస్తున్నందున జిల్లాల్లోనూ భద్రతను పటిష్టం చేయాలని మహంతి సూచించారు. ఈ విషయమై గవర్నర్ నరసింహన్ నుంచి కూడా పోలీసులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఇక కీలక ప్రాంతాల్లో శనివారం నుంచే పికెట్లను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను డీజీపీ ప్రసాదరావు ఆదేశించినట్లు తెలిసింది.
అధికారిక చిహ్నం రెడీ!
తెలంగాణ ప్రభుత్వ కొత్త అధికారిక చిహ్నానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫైలు సచివాలయానికి చేరింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజున ఈ చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. వృత్తాకారంలో ఉండే ఈ చిహ్నం బయటి వృత్తం గోధుమ రంగులో, దానికి అంతరవృత్తం చిలకపచ్చ రంగులో ఉంటాయి.
ఈ వలయంలోనే పైభాగంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆంగ్లంలో.. దాని కింద ఎడమవైపు తెలంగాణ ప్రభుత్వము అని తెలుగులో, కుడివైపు తెలంగాణ సర్కార్ అని ఉర్దూలో ఉంటుంది. దీనికి అంతర వృత్తంలో కాకతీయ ద్వారం గుర్తు, దానిపై మూడు సింహాల చిహ్నం, కాకతీయ ద్వారం మధ్యలో చార్మినార్ గుర్తు ఉంటాయి. బాహ్య వ లయం దిగువ భాగంలో హిందీలో ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది. ఎంఐఎం అభ్యర్థన మేరకు ఈ చిహ్నంలో చార్మినార్ గుర్తును చేర్చారు.