వాహనదారులపై భారం వద్దు
* నంబర్‌ప్లేట్ల మార్పుపై ప్రభుత్వం
* మార్చకపోవడమే మేలన్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాత వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు విషయంలో వాహనదారులపై భారం పడకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వాహనాలకు టీఎస్ సిరీస్‌ను కేంద్రం కేటాయించిన నేపథ్యంలో ఏపీ సిరీస్‌తో ఉన్న పాత వాహనాల నంబర్లను కూడా టీఎస్ సిరీస్‌లోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అన్ని వాహనాల నంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సి రావటం వల్ల వాహనదారుల జేబుకు చిల్లుపడటంతోపాటు వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున అది భారంగా పరిణమించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదే శించింది.
పాత వాహనాలకు ఎలాగూ హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండటంతో టీఎస్ సిరీస్ వివాదం తెరపైకి రాకున్నా... వాహనదారులు ఎలాగూ దానికయ్యే వ్యయాన్ని భరించాల్సి వచ్చేది. టీఎస్ సిరీస్‌తో కొత్తగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తీసుకోవటం ద్వారా అదనంగా వారిపై భారం పడేదేమీ లేదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయితే రికార్డు పత్రాల్లో దాని నంబర్ మార్పు చేసుకోవటానికి అయ్యే వ్యయం వారిపై పడకుండా చూస్తే సరిపోతుందని, నామమాత్రపు రుసుముతో ఆ తంతు ముగించొచ్చని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు.
అయితే రాష్ట్రంలో వాహనాల సంఖ్య 73 లక్షల వరకు ఉన్నందున వాటి నంబర్ల మార్పు ప్రక్రియ తమకు తలకుమించిన భారమేనని, వీలైనంతవరకు ఆ కసరత్తు లేకుండా చూస్తేనే మంచిదంటూ అధికారులు మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం శనివారం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇక జిల్లా కోడ్ నంబర్లకు సంబంధించి అధికారులు ప్రాతిపదిక ఏమీ చెప్పలేదని సమాచారం. జిల్లాల వారీగా నంబర్లు కేటాయిస్తే సరిపోతుందని, అక్షరక్రమం ఆధారంగా మాత్రం ఇవ్వకపోవటమే మంచి దన్నారు. తమపరంగా కొన్ని నంబర్లను సూచి ంచారు. ఆదిలాబాద్ 01, కరీంనగర్ 02, వరంగల్ 03, ఖమ్మం 04, నల్గొండ 05, మహబూబ్‌నగర్ 06, రంగారెడ్డి, హైదరాబాద్‌లకు 7 నుంచి 14 వరకు, మెదక్ 15, నిజామాబాద్ 16గా పేర్కొన్నట్టు తెలిసింది. నంబర్లు మార్చినా ఇబ్బందే ఉండదని, ఎవరికివారుగా నంబర్‌ప్లేట్లపై టీఎస్ అని రాసుకుంటే సరిపోతుందంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ పేర్కొనటం విశేషం.