సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం సరిగా వ్యవహరించని కారణంగానే రాష్ట్రంలో 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఏర్పడలేదని, ఇది అసాధార ణ సమస్య అని పేర్కొన్నారు. ఇంత జరిగినా ప్రభు త్వం సరిగా వ్యవహరించకపోవటం దారుణమన్నా రు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల నుంచే తప్పిదాలు చోటు చేసుకున్నట్టు తేలినా బోర్డు సరిగా వ్యవహరించలేదని, దాన్ని పర్యవేక్షించే వారు పరిష్కారానికి చొరవ చూపలేదని, అదే ఇప్పుడు ఇందరు విద్యార్థుల మృతి, లక్షల కుటుంబాల్లో ఆవేదనకు కారణమైందన్నారు.
ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయతో కలసి మీడియాతో మాట్లాడారు. ఇంటర్ వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక సారాంశంతో బీజేపీ ఏకీభవించడం లేదని తెలిపారు. ఇలాంటి పెద్ద పరీక్షలను నిర్వహించిన పరిపాలనపరమైన అనుభవం ఉన్నవారు కమిటీలో లేకపోవడం సరికాదని మురళీధర్‌రావు అభిప్రాయపడ్డారు. ఏదో కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ నివేదికపై ప్రభావం చూపిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఆశ్చర్యపరుస్తోందని, ఈ వ్యవహారానికి కారకులెవరో చెప్పకపోవటం విడ్డూరమన్నారు.
ఎవరినో రక్షించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, ఈ వ్యవహారంలో దోషులకు ప్రభుత్వంలో పెద్దస్థాయి వారితో సన్నిహిత సంబంధాలుండటమే దీనికి కారణమనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి, అసమర్ధత వల్లనే 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాత్రధారి అయితే సూత్రధారి ఎవరో ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment