
స్వైన్‌ఫ్లూ నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సీపీఐ నారాయణ
స్వైన్‌ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు నారాయణ ఆరోపించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని మంగళవారం సందర్శించిన ఆయన ఐసోలేషన్‌వార్డులో చికిత్స పొందుతున్న స్వైన్‌ఫ్లూ బాధితులను పరామర్శించారు.
గాంధీ ఆసుపత్రి వార్డులో అందిస్తున్న వైద్యసేవలు, మందులు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆస్పత్రి అధికారులతో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్వైన్‌ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో సరిపడేంత సిబ్బంది, మౌళికసదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.