హతవిధీ.. ఇది ఉస్మానియా హాస్టల్ గది
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల చరిత్ర గల ఈ వర్సిటీ హాస్టళ్లు మాత్రం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. క్యాంపస్ కాలేజీల్లో బీఈడీ, ఎంఈడీ, ఐదేళ్ల లాకోర్సు, ఎంబీఏ, ఎంకామ్, పీహెచ్‌డీ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల విద్యార్థులకు వసతి గృహాలే లేవు. విధిలేని పరిస్థితిలో వీరికి ఇతర భవనాల్లో సర్దుబాటు చేస్తున్నారు. ఎంకామ్ ఐఎస్, ఫోరెన్సిక్‌సైన్స్ సహా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల విద్యార్థులు హాస్టల్ వసతి లేక బయటే ఉంటున్నారు. విదేశీ మహిళా విద్యార్థునుల పరిస్థితీ ఇలాగే ఉంది. పడుకునేందుకు సరిపడినని మంచాలే కాదు.. కనీసం కూర్చొనేందుకు కుర్చీలు, చదువు కునేందకు స్టడీ టేబుళ్లు, ర్యాక్‌లు కూడా లేవు. ఉన్న కొన్నింటినీ సీనియర్లే(నాన్‌బోర్డర్స్) ఆక్రమించు కోవడంతో హాస్టల్లో కొత్తగా చేరిన జూనియర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. అంతేగాక స్నానానికి సరిపడు గదులు లేకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికీ మెస్సుల్లో కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి.
ఈ నెల 23 నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త విద్యార్థులకు వసతి కేటాయింపు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఉన్న హాస్టల్ భవనాల్లో ప్రస్తుతం చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. గదుల పైకప్పు తరచూ పెచ్చులూడి పడుతోంది. చిన్నపాటి వర్షానికే హాస్టల్ గదులు నదులను తలపిస్తున్నాయి. క్యాంపస్‌లో 22 వసతి గృహాలు ఉండగా, వీటిలో 18 బోయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. పీజీ ఆర్ట్స్ అండ్ సైన్స్, పీహెచ్‌డీ, ఇంజినీరింగ్, టెక్నాలజీ, బీఈడీ, లా, మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. వర్సిటీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్నా.. ఇప్పటికీ నిజాం కాలంనాటి రేకుల షెడ్లలోనే విద్యార్థులు తలదాచుకునే పరిస్థితి దాపురించింది. నిర్దేశించిన విద్యార్థుల కంటే ఎక్కువగా ఉండడంతో ఆయా హాస్టళ్లలో శానిటేషన్ నిర్వహణ అధికారులకు ఇబ్బందిగా మారింది. మెస్సులను ఆధునికీకరించక పోవడంతో అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. ఇప్పటికీ కట్టెల పొయ్యిలపైనే వంటలే చేస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎంత వెనుకబడి ఉందో అర్ధం చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో కట్టెలు తడిసిపోయి వాటి నుంచి పొగతో కళ్ల మంటలు తప్పడం లేదు.
జైళ్లను తలపిస్తున్న లేడీస్ హాస్టల్ గదులు
గత పదేళ్లతో పోలిస్తే ఉన్నత చదువుల కోసం వస్తున్న విద్యార్థినుల సంఖ్య రెట్టింపైంది. గతంలో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తి 60:40గా ఉండగా ప్రస్తుతం అమ్మాయిల సంఖ్య 60 శాతానికి పెరిగింది. క్యాంపస్ కాలేజీల్లో చదువుతున్న వారితో పాటు అనుబంధ కాలేజీలైన కోఠి ఉమెన్స్, సికింద్రాబాద్ పీజీ, ఖైరతాబార్ పీజీ కాలేజీల్లో చదువుతున్న యువతులకు కూడా ఇక్కడే వసతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్‌లో నాలుగు హాస్టల్ భవనాలు వీరికి కేటాయించగా వాటిలో 3800 మంది ఉంటున్నారు. గదుల కొరత వల్ల ఒక్కోదాంట్లో ఆరు నుంచి ఎనిమిది మంది ఉండాల్సి వస్తోంది.
వసతికి నోచుకోలేని విదేశీ యువతులు
ఉస్మానియా పరిధిలోని వివిధ కాలేజీల్లో 4 వేల మందికి పైగా విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. వీరి నుంచి వర్సిటీకి ఏటా రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. వీరిలో వెయ్యి మందికిపైగా క్యాంపస్‌లోనే చదువుతున్నప్పటికీ ఏ ఒక్కరికీ ఇక్కడి హాస్టళ్లలో వసతి కల్పించలేదు. ఫలితంగా వీరంతా బయట గదులను అద్దెకు తీసుకుని ఉంటున్నామని వర్సిటీలోని ఇరాక్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బాస్ చెప్పారు. విదేశీ విద్యార్థులకు కూడా వర్సిటీలో వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.
‘పీహెచ్‌డీ’ వారికీ పాట్లు తప్పడం లేదు..
వర్సిటీ నిబంధనల ప్రకారం ఒక్కో పీహెచ్‌డీ విద్యార్థికి ఓ గదిని కేటాయించాలి. 120 గదుల సామర్థ్యం ఉన్న న్యూ పీజీ హాస్టల్‌లో పీహెచ్‌డీ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ఇరవై ఏళ్ల వరకు ఒక రూమ్‌కు ఒక విద్యార్థే ఉండేవారు. కొత్త హాస్టళ్లు లేకపోవడం, గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిశోధక విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఒక్కో గదిలో ఇద్దరి నుంచి ముగ్గురు సర్దుకుంటున్నారు. ఇక 101 గదులున్న ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్లో 300 మందికి పైగా ఉంటున్నారు. అన్ని హాస్టళ్లలోను విద్యార్థుల నిష్పత్తికి తగినన్ని మరుగుదొడ్లు, స్నానాల గదులు లేక తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరిన వారికి వసతి గగనమే అయింది.
ఉస్మానియాలో కోర్సులు, విద్యార్థులు..
వందేళ్ల చరిత్ర గల పురాతన వర్సిటీగా గుర్తింపు పొందింది. దీనికి 720 అనుబంధ కాలేజీలు, 87 దేశాలకు చెందిన 5155 మంది విద్యార్థులు, 3.5 లక్షల మంది దేశీయ విద్యార్థులు, 27 యూజీ పోగ్రామ్స్, 68 పీజీ కోర్సులు, 24 డిప్లొమా కోర్సులు, 15 సర్టిఫికెట్ కోర్సులు, రెండు రీసెర్చ్ పోగ్రామ్స్ ఉన్న వర్సిటీ ఇది. క్యాంపస్‌లో 12 ఫ్యాకల్టీలు, 53 డిపార్ట్‌మెంట్లు, 560 మంది టీచింగ్ స్టాఫ్, 1695 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, 446 మంది కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్, 16 రీసెర్చ్ సెంటర్లు కొనసాగుతున్నాయి. కేవలం ఒక్క క్యాంపస్‌లోనే ఏడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికోసం 20 వసతి గృహాలు ఉండగా, వీటిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
మరో పది హాస్టల్స్ నిర్మించాలి
ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని మరో 10 హాస్టళ్లను నిర్మించాలి. గతంలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంతో హాస్టల్స్ సమస్యలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఎంబీఏ, లా, బీఈడీ, ఎంఈడీ కోర్సుల విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్స్ నిర్మించాలి. – మారం శ్రీనివాస్, ఓయూ
చాలా వరకు శిథిలమయ్యాయి
ఓయూ క్యాంపస్ హాస్టళ్లు చాలావరకు శిథిలావస్తకు చేరుకున్నాయి. హాస్టల్ భవనాలు, గదులు, ఇతర మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలమయ్యారు. సమస్యల శాస్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. నాణ్యత, పౌష్టికాహరం, తాగునీటి వసతి కల్పించాలి. – కాంపెల్లి శ్రీనివాస్, ఓయూ
Comments
Please login to add a commentAdd a comment