తెలంగాణ సిగపూవా.. బాగున్నావా?
తెలంగాణ సిగపూవా.. బాగున్నావా?
Published Tue, Apr 4 2017 1:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
మసకబారుతున్న వందేళ్ల కీర్తి
ఏటేటా దిగజారుతున్న ఓయూ ప్రతిష్ట.. ఒకప్పుడు దేశంలోనే నంబర్ వన్.. నేడు 38వ ర్యాంకు
- ఉస్మానియాలో పాఠాలు బోధించేవారే కరువు..
- తగ్గిపోయిన లెక్చరర్లు.. పడిపోతున్న ప్రమాణాలు
- వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనన్ని ఖాళీలు
- 12 విభాగాల్లో ఒక్క రెగ్యులర్ టీచరూ లేరు
- 1,264 టీచింగ్ పోస్టులకు.. ఉన్నది 532 మందే
- న్యాక్ గుర్తింపునకు కూడా నోచుకోని దుస్థితి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ.. చదువులమ్మ ఒడి! ఉద్యమాల గుడి!! విద్యా పరిమళాలకైనా.. పోరాట కెరటాలకైనా అదే కేరాఫ్.. దేశవిదేశాల్లో సైతం కీర్తి పతాకను ఎగురవేసిన ఘన చరిత్ర.. పీవీ నరసింహారావు వంటి ఎందరో మహామహులను అందించిన కీర్తి.. ఐఐటీలో సీటు సాధించడం కంటే ఈ యూనివర్సిటీలో చదవడమే గొప్ప అనుకునే రోజులు.. ఇదంతా ఒకప్పటి ఓయూ వైభవం. ఇప్పుడు అది కనుమరుగైంది. రోజురోజుకు పడిపోతున్న ప్రమాణాలతో వర్సిటీ ప్రతిష్ట మసకబారిపోతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నానంటే.. ‘అవునా ఇప్పుడెలా ఉంది..’అని జాలిగా పలకరించే రోజులొచ్చాయి. ఫ్యాకల్టీ ఉందా? బోధన కొనసాగుతోందా? అని ప్రశ్నించే దుస్థితి ఏర్పడింది. మరో 25 రోజుల్లో వందేళ్ల పండుగకు ముస్తాబవుతున్న ఓయూలో.. అధ్యాపకుల ఖాళీలు, భర్తీకి ముందుకు పడని అడుగులు పాలకుల వైఖరిని వెక్కిరిస్తున్నాయి.
చివరకు యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులను తెచ్చుకోవడంలో కీలకమైన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు కోసం ఆపసోపాలు పడాల్సిన స్థితిలో విశ్వవిద్యాలయం సతమతం అవుతోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా సోమవారం కేంద్రం ప్రకటించిన ర్యాంకింగ్‌లోనూ వర్సిటీ వెనుకబడిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నంబర్ వన్ యూనివర్సిటీగా ఉన్న ఓయూ ఇప్పుడు బోధన సిబ్బంది లేని కారణంగా నేషనల్ (ఓవరాల్) ర్యాంకింగ్‌లో 38వ స్థానంతో సరిపెట్టుకుంది.
కేంద్రం ఇచ్చే ర్యాంకులకు ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే ఐదు అంశాల్లో మొదటిది.. ప్రధానమైందీ టీచింగ్, లెర్నింగ్, రీసోర్సెస్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం అదే కరువైంది. బోధించే వారు లేరు. 12 విభాగాల్లో ఒక్క రెగ్యులర్ అధ్యాకులు లేరు. 1,264 అధ్యాపక పోస్టుల్లో 58 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 532 మందితో బోధన కొనసాగిస్తుండడంతో నేషనల్ ర్యాంకింగ్‌లో చతికిల పడింది. యూనివర్సిటీల కేటగిరీ ర్యాంకింగ్‌లో గతేడాది 33వ స్థానంలో ఉన్న ఓయూ ఈసారి 23వ ర్యాంకులో నిలవడం గుడ్డిలో మెల్ల. అదే రెగ్యులర్ సిబ్బంది, మౌలిక సదుపాయాలు సరిపడా ఉంటే వర్సిటీ పరిస్థితిలో కొంత మార్పు ఉండేదన్నది విద్యావేత్తల అభిప్రాయం.
ఏ విభాగం చూసినా ఖాళీలే..
ఉస్మానియాలో పలు విభాగాల్లో బోధకులే కరువయ్యారు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, థియేటర్ ఆర్ట్స్ విభాగాల్లో ఒక్క రెగ్యులర్ టీచర్ కూడా లేరు. కీలకమైన ఎకనామిక్స్ విభాగంలో 40 మంది టీచర్లకు 11 మంది మాత్రమే ఉన్నారు. హిస్టరీలో 25 మందికిగాను ముగ్గురు, సైకాలజీలో ఇద్దరు, సోషియాలజీలో నలుగురు, బయోమెడికల్‌లో 19 మందికి ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. అత్యధిక అవకాశాలు ఉన్న గ్రంథాలయ విభాగంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంజనీరింగ్ కేటగిరీలో ఈసీఈ విభాగానికి అధిపతే లేరు. జెనెటిక్స్, బయోటెక్నాలజీ విభాగాల్లో సగం పోస్టులే భర్తీ అయ్యాయి.
జియోగ్రఫీలో 15 మందికి ఏడుగురు, జియాలజీలో 30 మందికిగాను నలుగురు మాత్రమే కొనసాగుతున్నారు. టెక్నాలజీలో 66 మందికిగాను 18 మంది మాత్రమే ఉన్నారు. కీలక విభాగాల్లో అరకొరగా టీచర్లుండడంతో బోధన ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రతి సంవత్సరం వర్సిటీ పరిధిలో గరిష్టంగా 30 నుంచి 40 మంది టీచర్లు పదవీ విరమణ పొందుతున్నారు. 2005 నుంచి వర్సిటీలో టీచర్ల నియామకాలు పూర్తిస్థాయిలో జరగడంలేదు. ప్రస్తుతం 53 విభాగాల్లో 732 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది న్యాక్ అక్రెడిటేషన్ కోల్పోయిన ఓయూ తాజాగా మరోమారు దరఖాస్తు చేసుకుంది. త్వరలో న్యాక్ బృందం ఓయూకు రానుంది. అప్పటిలోగా పూర్తిస్థాయి టీచర్ పోస్టులు భర్తీ చేస్తేనే గుర్తింపు దక్కే అవకాశముంది.
కాంట్రాక్టు, పార్ట్‌టైమ్, గెస్ట్ టీచర్లతో బోధన
విశ్వవిద్యాలయంలో బోధన ప్రక్రియ గాడి తప్పుతోంది. ఏళ్ల తరబడి బోధకుల నియామకాలు చేపట్టడం లేదు. వర్సిటీ పరిధిలో 58 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వర్సిటీతోపాటు అనుబంధ కాలేజీలైన సికింద్రాబాద్, నిజాం, ఉమెన్స్ కాలేజీల్లో కలుపుకొని 1,264 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ 532 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టు, పార్ట్ టైమ్, గెస్ట్ టీచర్లతో బోధనను నెట్టుకొస్తున్నారు. వర్సిటీలో పరిశోధన కార్యక్రమాలు సైతం వెనకబడుతున్నాయి. న్యాక్ గుర్తింపు సైతం లేకపోవడం గమనార్హం.
Advertisement
Advertisement