సాక్షి, సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్: ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా...సరిగ్గా 94 ఏళ్ల క్రితం కేవలం నలుగురు విద్యార్థినులతో ప్రారంభమైన కోఠి మహిళా కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక మహిళలకు మరింత నాణ్యమైన ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఇక్కడ 44 కోర్సులుండగా...4516 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ కళాశాలకు న్యాక్ ఏ గుర్తింపు సైతం ఉంది.
హైదరాబాద్ నడిబొడ్డున కోఠిలో 42 ఏకరాల విస్తీర్ణంలోఉమెన్స్ కళాశాల విస్తరించి ఉంది. ప్రస్తుతం 29 శాఖలు ఉండగా, వీటిలో 22 యూజీ కోర్సులు, 20 పీజీ కోర్సులు కొనసాగుతున్నాయి. 253 మంది టీచింగ్ స్టాఫ్, 191 మంది నాన్ టీచింగ్ ఉద్యోగులు పనిచేస్తు న్నారు. ఎంతో మంది మహిళలను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈ కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దితే..కొత్తగా వీసీ, రిజిస్ట్రార్ పోస్టులు మంజూరు కావడంతో పాటు ఇప్పటికే ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు అధ్యాపక పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. యూజీసీ నుంచే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. మహిళల ఉన్నత విద్యకు ఎంతగానో దోహదపడుతుంది. యూజీ, పీజీ విద్య కోసం ఈ కళాశాలలో 49 సైన్స్ ల్యాబులు, ఆరు కంప్యూటర్ ల్యాబ్‌లు, ఒక లైబ్రరీ, సైబర్ కేఫ్, గ్రీన్‌హౌస్, 110 తరగతిగదులు, ఫార్మస్యూటికల్ ల్యాబ్, సైకాలాజీ కౌన్సిలింగ్ ల్యాబ్, ఇంగ్లీష్ లాగ్వేజ్ ల్యాబ్, హెల్త్ సెంటర్లతో పాటు రెండు వసతి గృహాలు, నాలుగు సెమినార్ హాల్స్, దర్బార్‌హాల్, ఎగ్జామినేషన్ బ్రాంచ్, పరిపాలన భవనాలు కలిగిఉన్నాయి.
కళాశాలలోని శాఖలు.....
ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్...
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అరబిక్, హింది, ఇంగ్లీష్, పర్షియన్, ఉర్దూ, మరాఠి, ఫ్రెంచ్, తెలుగు, సంస్కృతం
ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ స్టడీస్...
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, పొల్టికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, సోషియాలాజీ, సైకాలాజీ, మాస్ కమ్యూనికేషన్స్, జియోగ్రఫీ, ఫిలాసఫీ
ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్, మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్
ఫ్యాకల్టీ ఆఫ్ లైఫ్‌సైన్స్..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బోటని, జువాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ, న్యూట్రీషియన్ తో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, బిజినెస్ మెనేజ్‌మెంట్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, యూజీ,పీజీ, ఎంఎస్సీ, ఎంబీఎ, ఎంసీఎ, డిప్లొమా తదితర కోర్సుల శాఖలు ఉన్నాయి..
అనుకూల వాతావరణం ఉంది...
కోఠి ఉమెన్స్ కళాశాలను మహిళ విశ్వవిద్యాలంగా ఏర్పాటు చేస్తే ఎంతో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగా మారుతుంది. ఈ కళాశాలలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు అన్ని వనరులు ఉన్నాయి. 42 ఏకరాల స్థలం, ఇతర భవనాలు, ల్యాబ్‌లు, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి. మరికొన్ని కోర్సులు పెంచుకుని విద్యార్థులకు పరిశోధన విభాగం ఏర్పాటు చేయవచ్చు. విశ్వవిద్యాలయానికి ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. – ప్రొఫెసర్ ప్రశాంతాత్మ, కోఠి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్
మహిళా వర్సిటీ సంతోషకరం...
నేను చదివే కోఠి ఉమెన్స్ కళాశాల మహిళా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు కానుందని మంత్రి కడియం శ్రీహరి మా కళాశాల సందర్శించిన తర్వాతే తెలిసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పద్మావతి విశ్వవిద్యాలయం ఉండేది. అది ఏపీకి వెళ్లింది. తెలంగాణలో కోఠి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు సంతోషకరం. – జూహిరాణి సింగ్, యూజీ విద్యార్థిని, బొల్లారం
మహిళలకు ఉన్నత విద్య
నేను ఇండియాకు విద్యను అభ్యసించేందుకు వచ్చాను. ఏ కళాశాలలో చేరాలో అని వెదికితే కోఠి మహిళ కళాశాల ప్రతిష్టాత్మకంగా కనిపించింది. ఈ కళాశాలలో అన్ని వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఈ కళాశాల యూనివర్సిటీగా మారితే దేశ విదేశాలనుంచి విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీయుల సంఖ్య పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. – కలిద– ఒమన్ (విదేశీ విద్యార్థిని)
చరిత్ర సృష్టిస్తుంది
కోఠి ఉమెన్స్ కళాశాలలో రెగ్యులర్ యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఈ కళాశాల విశ్వవిద్యాలయంగా మారితే మహిళలకు ఆల్‌రౌండ్ విశ్వవిద్యాలయంగా ఉంటుంది. రానున్న విద్యాసంవత్సరం లోగా దీన్ని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలి. ఇది తప్పక చరిత్ర సృష్టిస్తుంది. – అస్రాబాను (గుజారాత్), బీఏ విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment