కొత్త మార్గదర్శకాలెక్కడ? | Government Not Following TSIPAS Guidelines | Sakshi
Sakshi News home page

కొత్త మార్గదర్శకాలెక్కడ?

Published Mon, Oct 14 2019 3:55 AM | Last Updated on Mon, Oct 14 2019 3:55 AM

Government Not Following TSIPAS Guidelines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో పారిశ్రామిక రంగం అత్యంత కీలకమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2015, జనవరి ఒకటి నుంచి నూతన పారిశ్రామిక చట్టం టీఎస్‌ ఐపాస్‌ను అమలు చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల పాటు అమల్లో ఉన్న టీఎస్‌ఐపాస్‌ మార్గదర్శకాల అమలు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. నూతన పారిశ్రామిక చట్టం మార్గదర్శకాల రూపకల్పనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పాత మార్గదర్శకాలను కొనసాగించాలని పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 నుంచి రాయితీలు,ప్రోత్సాహకాల చెల్లింపు రూ.2,540 కోట్ల మేర బకాయిల రూపంలో నిలిచిపోయాయి. పాత మార్గదర్శకాలు అమలుకు నోచుకోక, కొత్త మార్గదర్శకాలపై స్పష్టత లేక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో గందరగోళం నెలకొంది. ఇది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి.

ఇంకా ఎన్నాళ్లు..
రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించి పారిశ్రామిక చట్టం టీఎస్‌ఐపాస్‌లో అంతర్భాగంగా ఉన్న టీ ఐడియా, టీ ప్రైడ్‌ను తదుపరి మార్గదర్శకాలు జారీ అయ్యేంత వర కు కొనసాగించాలంటూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ ఏడాది మార్చి 28న ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 2019–24 మధ్యకాలంలో ఐదేళ్ల పాటు అమల్లో ఉండేలా టీఎస్‌ఐపాస్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రూపొందించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి లేఖ రాసి 6 నెలలు గడిచినా నూతన మార్గదర్శకాల రూపకల్పనపై పరిశ్రమల శాఖకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. దీంతో టీఎస్‌ఐపాస్‌ పాత మార్గదర్శకాలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ వర్గాలు అంటున్నాయి.

బకాయిలు రూ.2,540 కోట్లు..
టీఎస్‌ఐపాస్‌లో భాగం గా జనరల్‌ కేటగిరీ పరిశ్రమల యజమానులకు టీ ఐడియా, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు టీ ప్రైడ్‌ కింద కలిపి మొత్తంగా 29 వేల మంది పారిశ్రామికవేత్తలకు రూ.2,540.17 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాల బకాయి లు అందాల్సి ఉంది. రాష్ట్ర అవతరణకు పూర్వం అమ్మకం పన్నుకు సంబంధిం చిన బకాయిలు 2013 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుత్‌ రాయితీలు, పావలా వడ్డీ ప్రోత్సాహకం, తనఖా సుంకం, నైపుణ్య శిక్షణ తదితరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో 2017 నుంచి, జనరల్‌ కేటగిరీల్లో 2015 నుంచి పరిశ్రమల శాఖ నుంచి విడుదల కావాల్సిన రాయితీలు, బకాయిలు పేరుకుపోయాయి. టీఎస్‌ఐపాస్‌ పాత మార్గదర్శకాల ప్రకారమే రాయితీలు, బకాయిలు కొనసాగిస్తామని పరిశ్రమల శాఖ ప్రకటించినా..ఏళ్ల తరబడి బకాయిలు పేరుకు పోవడంతో పరిశ్రమల నిర్వహణ భారంగా మారుతోందని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. కొత్త మార్గదర్శకాలు రూపొం దించే పక్షంలో రాయితీలు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వ వైఖరెలా ఉంటుందనేది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అంతు చిక్కడం లేదు.

ముగిసిన గడువు...
త్వరితగతిన పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014లో ‘తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రీయల్‌ ప్రాజెక్టు అప్రూవల్, సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌’(టీఎస్‌ఐపాస్‌) చట్టాన్ని రూపొందించింది. 14 కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేలా మార్గదర్శకాలు రూపొందించింది.

టీఎస్‌ఐపాస్‌ కింద అనుమతిచ్చిన పరిశ్రమలు: 11,000
ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమలు: 8,400
వీటి కోసం చేసిన ఖర్చు: 1.60 లక్షల కోట్లు
ప్రత్యక్షంగా ఉపాధి లభించిన వారు: 12 లక్షలు
పరోక్షంగా ఉపాధి పొందిన వారు: 20 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement