TSIPASS
-
టీఎస్ఐపాస్ ద్వారా 24000 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం
మాదాపూర్: టీఎస్ ఐపాస్ ద్వారా గత 8.5 ఏళ్లలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు టీఎస్ఐఐసీ ఎండీ వెంకట్ నర్సింహారెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ప్లాస్టిక్ ఎక్స్పో, హిప్లెక్స్ 2023 ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి ప్లాస్టిక్ పార్క్ పూర్తిగా అమ్ముడు పోయిందని, రెండోదాని ఏర్పాటుకు టీఎస్ఐఐసీ స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ లకు వసతి కల్పించేందుకు వీలుగా టీఏపీఎంసీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్లాస్టిక్ పరిశ్రమకు హబ్‌గా ఉందన్నారు. ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ 60 ఎంఎస్ఎంఈలకు ఆర్ధికసాయాన్ని అందించిందన్నారు. హెచ్‌కె గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్( మార్కెటింగ్ పెట్రోకెమికల్స్) శ్రీ వాస్తవ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమకు తాప్మా మార్గనిర్దేశం చేస్తుందన్నారు. నేడు యూఎస్ఏ, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద ప్లాస్టిక్ వినియోగదారుగా ఉందన్నారు. 6 శాతం నుండి 7శాతం సీఎజీఆర్ వద్ద నిరంతరం వృద్ధి చెందుతుందన్నారు. గెయిల్ అమ్మకాల్లో దక్షిణ ప్రాంతం 18శాతం వాటాను అందిస్తుందన్నారు. చైనా జనాభా పెరిగినప్పటికీ మన తలసరి ప్లాస్టిక్ వినియోగం చైనాకంటే చాలా తక్కువ అన్నారు. 11 కేటీల వద్ద చైనా తలసరి వినియోగం, 46కేజీ, యూఎస్ఏ 170 కేజీ, ప్రపంచ సగటు 28 కేజీలు వాటి కంటే మనం వెనుకబడి ఉన్నామన్నారు. ప్లాస్టిక్‌పై విధించిన 18శాతం జీఎస్టీని తగ్గించాలని ఆప్మా, తాప్స్ తరఫున ఆయన కోరారు. ఆహార ప్యాకేజింగ్ పరిశ్రమతో పాటు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్‌లపై విధించిన జీఎస్టీని తగ్గించాలన్నారు. తెలంగాణ, ఆంధ్రా ప్లాస్టిక్స్ తయారీదారుల సంఘం(టాప్మా)నాలుగురోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తాప్మా అద్యభుడు విమలేష్గుప్త తెలిపారు. దశాబ్దం క్రితం 9 మిలియన్ టన్నుల నుంచి ఇప్పుడు 18 మిలియన్ టన్నుల వినియోగం స్ఠాయికి చేరుకున్నామని ఇండియన్ ప్లాస్టిక్స్ ఇనిస్టిట్యూట్ జాతీయ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి వెన్నం తెలిపారు. పర్యావరణ సంక్షోభానికి కేవలం ప్లాస్టిక్ పరిశ్రమనే నిందించలేమని సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ అవసరమన్నారు. భారతదేశంలో 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తిలో కేవలం 30శాతం మాత్రమే రీసైకిల్ చేయబడుతుందన్నారు. కీలకమైన వృద్ధి రంగంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వానికి ప్రాతినిథ్యాలను అందించాలని కోరారు. ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా 400 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. స్పెషాలిటీ కెమికల్స్, మాస్టర్బ్యాచ్లు, ప్రాసెస్ మిషనరీ, ప్రింటింగ్, ప్యాకేజింగ్, రామెటీరియల్స్, మోల్డ్స్, డై, పోస్ట్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, క్వాలిటి టెస్టింగ్ ఎక్విప్మెంట్, ఫినిస్ట్ ప్రొడెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో హెచ్ఎంఈఎల్ ఎండి ప్రభుదాస్,ఆలిండియా ఇండియా ప్లాస్టిక్ మానుప్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ పాల్గొన్నారు. -
దక్షిణాదిపై కేంద్రం వైఖరి మారాలి
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలని, పనిచేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహం లభిస్తే అవి మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నా రు. కానీ కేంద్రం ఆ దిశగా ఆలోచించడం లేదని విమర్శిం చారు. కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని, పారిశ్రామికీకరణలో కేంద్రం రాజకీయాలు చేయకూడదన్నారు. బుధవారం శిల్పకళావేదికలో టీఎస్ ఐపాస్ చట్టం చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘బుల్లెట్ రైలు అనగానే ఢిల్లీ, ముంబైలేనా..? హైదరాబాద్ ఎందుకు గుర్తుకు రాదు.. డిఫెన్స్ కారిడార్‌ను హైదరాబాద్–బెంగళూరుల మధ్య కాకుండా మరోచోట ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామిక కారిడార్ అంటే ఢిల్లీ– ముంబై మధ్యలోనేనా? దక్షిణాది రాష్ట్రాల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయకూడదా? అదివస్తే వారికం టే ఎక్కువగానే అద్భుతాలు చేయగలుగుతాం..’అని కేటీఆర్ అన్నారు. సీఎం మానస పుత్రిక టీఎస్ఐపాస్ ‘టీఎస్ఐపాస్ సీఎం కేసీఆర్ మానçస పుత్రిక. తెలంగాణ ఏర్పడ్డాక అమోదించిన తొలి బిల్లు ఇది. పటిష్టంగా అమలవుతున్న దీని క్రెడిట్ అంతా ముఖ్యమంత్రిదే. సీఎం స్ఫూర్తితో ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కొత్త తరహా ఆలోచనలను అమలు చేస్తున్నాం. 27 శాఖల ద్వారా 35 సర్వీసులకు సంబంధించిన అనుమతులను టీఎస్ఐపాస్ ద్వారా అందిస్తున్నాం. గత ఐదేళ్లలో దాదాపు 12 వేల పరిశ్రమలకు అనుమతుల ద్వారా రూ.1.73 లక్షల పెట్టుబడుల సాధనతో పాటు 13.02 లక్షల మందికి ఉపాధి కల్పించాం. పరిశ్రమలకు రాయితీలిస్తే పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్టుగా అపోహలున్నాయి. ఈ రాయితీలు కార్మికులకు జీవనాధారం’అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు (టీ ప్రైడ్) రూ.205 కోట్ల రాయితీలను ఈ సందర్భంగా కేటీఆర్ అందజేశారు. ‘2014–19 మధ్యకాలంలో 40 వేల ఎకరాల్లో 49 పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేశాం. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ) పై రాష్ట్రాల మధ్య కేంద్రం పోటీ పెట్టిన విధంగా, పరిశ్రమల ఏర్పాటులో 33 జిల్లాల మధ్య పోటీపెట్టి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం కల్పిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం 10 వేల ఎకరాలను సేకరించాం. ఇంకో 2 వేల ఎకరాలు సేకరించగానే క్లస్టర్ని ప్రారంభిస్తాం. ఫార్మా రంగంలో ప్రపంచానికే కేంద్రంగా హైదరాబాద్ మారుతుంది’అని కేటీఆర్ చెప్పారు. నేనేమీ మాయ చేయలేదు.: మంత్రి మల్లారెడ్డి ‘నన్ను చూసి నేర్చుకోండి. మజాక్ కాదు. కష్టపడి పనిచేస్తే ఎవరైనా ఏ స్థాయికైనా ఎదగొచ్చని చెప్పడానికి నేనే నిదర్శనం. సైకిల్‌పై తిరిగి పాలుపోసే మామూలు స్థాయి నుంచి 13 ఇంజనీరింగ్ కాలేజీలు, రెండేసి చొప్పున మెడికల్, డెంటల్ కాలేజీలు, 10 సీబీఎస్ఈ స్కూళ్లు, మహిళల ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, మేనేజ్మెంట్ కాలేజీలు స్థాపించాను. ఇందుకోసం నేనేమీ మాయ చేయలేదు. ప్రతి రూపాయి కష్టపడి సంపాదించా’అని వ్యాపారవేత్తలను ఉద్దేశించి కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. ఉపన్యాసం ముగించి తన పక్కనే కూర్చున్న మల్లారెడ్డిని కేటీఆర్.. ‘బాగా మాట్లాడారు. నీళ్లు తాగండి’అంటూ వాటర్‌బాటిల్ అందించారు. మల్లారెడ్డి మాట్లాడాక ప్రసంగించడం అంటే విరాట్ కోహ్లి బ్యాటింగ్ తర్వాత మరొకరు బ్యాటింగ్ చేసినట్టుగా ఉంటుందంటూ కేటీఆర్ తన ప్రసంగంలో చమత్కరించారు. టీఎస్ఐపాస్ అమల్లో ప్రతిభ కనబరిచిన 9 జిల్లాల కలెక్టర్లు, పరిశ్రమల శాఖ అధికారులకు అవార్డులు అందజేశారు. మూడు కేటగిరీల్లో 1 ,2, 3 స్థానాలు పొందిన జిల్లాలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి. వీరితో పాటు వివిధ శాఖల అధికారులకు కూడా అవార్డులు అందజేశారు. పరిశ్రమల శాఖ కమిషనర్ అహ్మద్‌నదీం స్వాగతం పలకగా, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ టీఎస్ఐపాస్ లక్ష్యాలను వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ముందున్నా.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ముందున్నప్పటికీ హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని మంత్రి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ రంగంలో నిపుణులైన మానవ వనరులు, పరిశోధన సంస్థలు హైదరాబాద్ సొంతమని గుర్తుచేశారు. సీఐఐ ఏర్పాటు చేసిన డిఫెన్స్ రంగ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దేశంలో డిఫెన్స్, ఏరోస్పేస్ యూనిట్ల ఏర్పాటు సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో యూనిట్ల ఏర్పాటుకు ఎక్కడైతే డిఫెన్స్ రంగం పటిష్టంగా ఉందో ఆ ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పెట్టుబడుల విషయంలో అల్ప రాజకీయాలు చేయకూడదంటూ హితవు పలికారు. ‘కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ఐదేళ్లలో నలుగురు రక్షణ శాఖ మంత్రులను కలిశాను. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో వృద్ధి బాటన ఉన్న హైదరాబాద్‌ను మరింత ప్రోత్సహించండి అని కోరా. డిఫెన్స్ ప్రొడక్షన్ కారిడార్లను ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, మరొకటి చెన్నైలో ఏర్పాటు చేయనున్నట్టు ఒక మంత్రి తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు కాకుండా ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ మంత్రిని అడిగా. అర్థం లేని సమాధానం చెప్పారు. జాతీయ శ్రేయస్సు కన్నా ప్రాంతీయ, రాజకీయ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేంద్రం వ్యవహరిస్తోంది. కేంద్ర డిఫెన్స్ శాఖ తన బడ్జెట్ నుంచి పలు ప్రాజెక్టులకుగాను రూ.1.05 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు’అని అన్నారు. కేంద్రాన్ని కోరుతోంది తన నియోజక వర్గం సిరిసిల్ల కోసం కాదని, తెలంగాణ కోసమని చురక అంటించారు. దేశంలో డిఫెన్స్ రంగాన్ని పటిష్టం చేయడంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించనున్న నేపథ్యంలో తన వ్యూహంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని మంత్రి విన్నవించారు. -
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లక్ష్యం అదే: కేటీఆర్
సాక్షి, యాదాద్రి : తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పారిశ్రామిక విధానంలో టీఎస్ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ తెలంగాణకే కాకుండా దేశానికే ప్రత్యేక గుర్తింపు తెస్తుందన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల మూలంగా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిం చేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారన్నారు. కాలుష్యరహితమైన ఆరెంజ్, గ్రీన్ కేటగిరీ పరిశ్రమలు మాత్రమే ఈ పార్క్‌లో ఏర్పాటు కానున్నాయని, రసాయనిక, బల్క్‌డ్రగ్స్ పరిశ్రమలకు అవకాశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్లాట్లు కొనుగోలు చేసిన ఔత్సాహికులు రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి వెంటనే ఉత్పత్తులను ప్రారంభించాలి. ఈ మేరకు ఇప్పటికే ఆయా కంపెనీల యాజమానులకు అగ్రిమెంట్లో నిబంధన విధించారు. ఈ పారిశ్రామిక వాడ ద్వారా ప్రత్యక్షంగా 19వేలు, పరోక్షంగా మరో 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జిల్లాలోని పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఉద్యోగులకు టౌన్షిప్, రెస్టారెంట్లు, డార్మెటరీ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు కానున్నాయి. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఐటీఐ ఏర్పాటు చేసిన నిరుద్యోగులకు విద్యతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. వృత్తి నైపుణ్యంతో కూడిన కార్మికులకు, నైపుణ్యం లేని కార్మికులకు లబ్ధి చేకూరనుంది. విజయవాడ – హైదరాబాద్ జాతీయహదారికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఏర్పాటవుతున్న ఈపార్క్‌కు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇదీ ప్రాజెక్టు స్వరూపం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 442 ఎకరాల భూమి కేటాయించారు. మొత్తం 450 యూనిట్లు రానున్నాయి. ఇందులో 40 యూనిట్లు మహిళలకు కేటాయించారు. రూ.1,553కోట్ల పెట్టుబడితో పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్ సైజు 450 మీటర్ల నుంచి 5 ఎకరాల వరకు నిర్ణయించారు. ప్లాట్లు పొందిన వ్యక్తులు రెండేళ్లలో పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తులను ప్రారంభించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ప్లాట్లను తిరిగి స్వాధీనం పరిశ్రమల ఏర్పాటుకు రూ.1,600కి గజం చొప్పున భూమి ధర నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్లాట్ల కేటాయింపులు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.250కోట్ల నిధులు కేటాయించారు. ప్లాట్లు పొందిన వ్యక్తులకు బ్యాంకులు రుణాలు, సబ్సిడీ లభిస్తాయి. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతాయి. ఎలక్ట్రికల్, డ్రిల్లింగ్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్, ఇంజనీరింగ్, డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ వంటి కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. టీఎస్ఐపాస్తో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం టీఎస్ఐపాస్ –2014 నూతన పారిశ్రామిక విధా నం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్ర భుత్వం చేయూతనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తక్కువ ధరకు భూమి, ప న్నుల్లో రాయితీ, పెట్టుబడుల్లో రాయితీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ ల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా పరిశ్ర మల శాఖ ప్రోత్సహిస్తోంది. టీఎస్ఐపాస్ ద్వా రా గడిచిన మూడేళ్లలో జిల్లాలో 482 చిన్న, సూ క్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. 2019 ఆగస్టు 31 వరకు రూ.4,559 కోట్ల వ్యయంతో ఏర్పాటైన ఆయా పరిశ్రమల్లో 17,618మందికి ఉపాధి లభిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు టీఫ్రైడ్, టీఐడియా ద్వారా 231మంది లబ్ధిదారులకు పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహక పథకాలను అందించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.5.51కోట్లు మంజూరు చేసింది. పరిశ్రమలు స్థాపించే జనరల్ కేటగిరీ వ్యక్తులకు 25శాతం, ఎస్సీ, ఎస్టీలకు 35 నుంచి 40శాతం, మహిళలకు అదనంగా 10 శాతం రాయితీ, పావలా వడ్డీ ఇస్తున్నారు. జిల్లాకు తరలిరానున్న మరో 300 పరిశ్రమలు హైదరాబాద్ జంటనగరాలనుంచి పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు బయటకు తరలించా లని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది అమల్లోకి వస్తే మరో 300 వరకు పరిశ్రమలు జిల్లాకు రానున్నాయి. పరిశ్రమలు స్థాపించే వారికి సరసమైన ధరలకు భూముల కేటాయింపు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్‌విండో విధానంతో అనుమతులు జారీ చేస్తారు. -
కొత్త మార్గదర్శకాలెక్కడ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో పారిశ్రామిక రంగం అత్యంత కీలకమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2015, జనవరి ఒకటి నుంచి నూతన పారిశ్రామిక చట్టం టీఎస్ ఐపాస్‌ను అమలు చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల పాటు అమల్లో ఉన్న టీఎస్ఐపాస్ మార్గదర్శకాల అమలు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. నూతన పారిశ్రామిక చట్టం మార్గదర్శకాల రూపకల్పనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పాత మార్గదర్శకాలను కొనసాగించాలని పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 నుంచి రాయితీలు,ప్రోత్సాహకాల చెల్లింపు రూ.2,540 కోట్ల మేర బకాయిల రూపంలో నిలిచిపోయాయి. పాత మార్గదర్శకాలు అమలుకు నోచుకోక, కొత్త మార్గదర్శకాలపై స్పష్టత లేక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో గందరగోళం నెలకొంది. ఇది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎన్నాళ్లు.. రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించి పారిశ్రామిక చట్టం టీఎస్‌ఐపాస్‌లో అంతర్భాగంగా ఉన్న టీ ఐడియా, టీ ప్రైడ్‌ను తదుపరి మార్గదర్శకాలు జారీ అయ్యేంత వర కు కొనసాగించాలంటూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఏడాది మార్చి 28న ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 2019–24 మధ్యకాలంలో ఐదేళ్ల పాటు అమల్లో ఉండేలా టీఎస్ఐపాస్కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రూపొందించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి లేఖ రాసి 6 నెలలు గడిచినా నూతన మార్గదర్శకాల రూపకల్పనపై పరిశ్రమల శాఖకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. దీంతో టీఎస్ఐపాస్ పాత మార్గదర్శకాలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ వర్గాలు అంటున్నాయి. బకాయిలు రూ.2,540 కోట్లు.. టీఎస్‌ఐపాస్‌లో భాగం గా జనరల్ కేటగిరీ పరిశ్రమల యజమానులకు టీ ఐడియా, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు టీ ప్రైడ్ కింద కలిపి మొత్తంగా 29 వేల మంది పారిశ్రామికవేత్తలకు రూ.2,540.17 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాల బకాయి లు అందాల్సి ఉంది. రాష్ట్ర అవతరణకు పూర్వం అమ్మకం పన్నుకు సంబంధిం చిన బకాయిలు 2013 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుత్ రాయితీలు, పావలా వడ్డీ ప్రోత్సాహకం, తనఖా సుంకం, నైపుణ్య శిక్షణ తదితరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో 2017 నుంచి, జనరల్ కేటగిరీల్లో 2015 నుంచి పరిశ్రమల శాఖ నుంచి విడుదల కావాల్సిన రాయితీలు, బకాయిలు పేరుకుపోయాయి. టీఎస్ఐపాస్ పాత మార్గదర్శకాల ప్రకారమే రాయితీలు, బకాయిలు కొనసాగిస్తామని పరిశ్రమల శాఖ ప్రకటించినా..ఏళ్ల తరబడి బకాయిలు పేరుకు పోవడంతో పరిశ్రమల నిర్వహణ భారంగా మారుతోందని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. కొత్త మార్గదర్శకాలు రూపొం దించే పక్షంలో రాయితీలు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వ వైఖరెలా ఉంటుందనేది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అంతు చిక్కడం లేదు. ముగిసిన గడువు... త్వరితగతిన పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014లో ‘తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ప్రాజెక్టు అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్’(టీఎస్ఐపాస్) చట్టాన్ని రూపొందించింది. 14 కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేలా మార్గదర్శకాలు రూపొందించింది. టీఎస్ఐపాస్ కింద అనుమతిచ్చిన పరిశ్రమలు: 11,000 ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమలు: 8,400 వీటి కోసం చేసిన ఖర్చు: 1.60 లక్షల కోట్లు ప్రత్యక్షంగా ఉపాధి లభించిన వారు: 12 లక్షలు పరోక్షంగా ఉపాధి పొందిన వారు: 20 లక్షలు -
రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం
హైదరాబాద్: తెలంగాణ నూతన పారిశ్రామిక చట్టం టీఎస్ ఐపాస్ కింద మరో విడత మరికొన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా 14 కంపెనీలకు అనుమతి పత్రాలు అందించారు. రూ.1118 కోట్ల పెట్టుబడులకు అనుమతులు పొందిన కంపెనీల అధినేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు. -
వడివడిగా అడుగులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పారిశ్రామిక విధానానికి (టీఎస్ఐపాస్) భారీ స్పందన వస్తోంది. ఇందులో అనుమతుల మంజూరు, వసతుల కల్పన, రాయితీలు ఆశాజనకంగా ఉండడంతో పలు సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో వీటి ఏర్పాటుకు బడా పారిశ్రామికవేత్తలు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. నూతన పారిశ్రామిక విధానం అమలు తర్వాత రెండు విడతల్లో 33 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఏకంగా తొమ్మిది పరిశ్రమలు జిల్లాలోనే ఏర్పాటు కానుండడం విశేషం. ప్రభుత్వం అనుమతిచ్చిన తొమ్మిది పరిశ్రమలు రూ.344.35 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా.. 2,920 మందికి ఉపాధి లభించనుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని పదేపదే ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్.. వాటి అనుమతుల విషయంలోనూ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతి పత్రాలను ఆయన దగ్గరుండి కంపెనీ ప్రతినిధులకు అందజేస్తున్నారు. గత నెల 23న తొలి దశలో జిల్లాలో మూడు పరిశ్రమలకు అనుమతులివ్వగా.. బుధవారం సచివాలయంలో ఆరు పరిశ్రమలకు అనుమతులు జారీ చేశారు. అనుమతి పత్రాలను ఆయా కంపెనీల చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓలకు సీఎం కేసీఆర్ అందజేశారు. కొత్తగా అనుమతులు పొందిన పరిశ్రమల్లో భగవత్ ప్రొడక్ట్స్ అధికంగా 1250 మందికి ఉపాధి కల్పించనుంది. రావిరాల సమీపంలో ఏర్పాటయ్యే ఈ కంపెనీలో మైక్రోమ్యాక్స్ సెల్ఫోన్లను తయారు చేయనున్నారు. అదేవిధంగా ఆదిబట్లలోని ఏరోస్పేస్ సిటీలో టాటా సికోర్‌స్కై ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీలో హెలికాప్టర్ క్యాబిన్, కిట్లు, ఇతర పరికరాలు తయారు చేయనున్నారు. ఈ కంపెనీలో 60 మందికి కొత్తగా ఉపాధి కలగనుంది. ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణకు సంబంధించి పనులు చేపడతారు. ఈ కంపెనీలోనూ 800 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. -
'ఆ వాస్తవాన్ని కేసీఆర్ సర్కార్ విస్మరించరాదు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన లేకపోవడం సరికాదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ భూములను బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ప్రభుత్వం ఇక్కడి వారికి ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఉద్యోగాల కోసం ఆ సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు అమలయ్యేలా జీవో జారీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉద్యోగ అవకాశాల కోసమనే వాస్తవాన్ని కేసీఆర్ సర్కారు విస్మరించరాదని హితవు పలికారు. -
తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానం
-
‘పారిశ్రామికాన్ని’ సగర్వంగా చాటుదాం
విధాన ప్రకటన కార్యక్రమ ఏర్పాట్లపై సీఎం సమీక్ష ♦ 2,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు ♦ ప్రత్యేక వెబ్సైట్లో కొత్త విధానం వివరాలు ♦ ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో పరిశ్రమల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యున్నతంగా రూపొందించిన తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా సగర్వంగా చాటాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఈ నెల 12న హెచ్ఐసీసీ వేదికగా నూతన విధానాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులు, బిజినెస్ స్కూళ్ల నిర్వాహకులు, ఐటీ, ఫార్మా తదితర రంగాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ప్రముఖులు హాజరవుతున్న కార్యక్రమంలో ప్రత్యేకత చాటేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించిన ఐపాస్ చట్టం, నూతన విధానంలోని అద్వితీయ అంశాలను సగర్వంగా ప్రకటించుకోవాలన్నారు. ఈ నెల 12న ఉదయం 11 గంటలకు విధాన ప్రకటన చేసిన మరుక్షణం నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు ఉండేలా చూడాలన్నారు. అదే రోజు ప్రారంభించే ప్రత్యేక వెబ్సైట్లో అన్ని వివరాలు ఉండాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి తెలంగాణలో అందుబాటులో ఉందని, ఇప్పటికే 1.60 లక్షల ఎకరాల భూమిని టీఎస్ఐఐసీకి అప్పగించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. వాటర్‌గ్రిడ్ ద్వారా పరిశ్రమలకు నీరు ఇవ్వడంతో పాటు, పారిశ్రామిక వాడల్లో మంచినీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులను ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో తెలంగాణలో పరిశ్రమలు స్థాపించే వారికి అనుకూల వాతావరణం కల్పిస్తామని సీఎం స్పష్టీకరించారు. అనుమతుల కోసం తిరగొద్దు తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించడాన్ని ప్రపంచమంతా గమనిస్తోందని, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం వెల్లడించారు. అనుమతుల కోసం పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పదిహేను రోజుల్లోనే అనుమతులు ఇవ్వడాన్ని నూతన విధానం ప్రత్యేకతగా అభివర్ణించారు. పరిశ్రమల అనుమతులు, ఇతర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సీఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారి నేతృత్వంలో చేజింగ్ సెల్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. బహుళజాతి సంస్థలు, ప్రముఖ పరిశ్రమలు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఆసక్తితో గమనిస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్’ అనే నినాదానికి ఆకర్షితులై పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారన్నారు. తెలంగాణ వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలకు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా వుందన్నారు. రక్షణ శాఖ పరిశోధన సంస్థలు, ఐటీ కంపెనీలు, వివిధ కంపెనీల డేటా బేస్ సెంటర్లు ఉండటంతో పాటు అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ విడిభాగాలు ఇక్కడే తయారవుతున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. దేశంలోని వివిధ కంపెనీల ప్రతినిధులు, సీఈఓలు, ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులు, ఫిక్కీ, ఫ్యాప్సీ వంటి పరిశ్రమల సంఘాలు నూతన పారిశ్రామిక విధానం మార్గదర్శకాల విడుదల కార్యక్రమానికి హాజరవుతున్నారు. క్రెడాయ్, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్ రంగాల ప్రముఖులనూ ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని పరిశ్రమల యజమానులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, జాతీయ మీడియా సంస్థలకు ఆహ్వానాలు పంపినట్లు సీఎం వెల్లడించారు. -
ఇక తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక విధానం 'టీఎస్ ఐపాస్'ను ఈ నెల 12వ తేదీన ప్రభుత్వం ప్రకటించనుంది. అదే రోజున పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల, పారిశ్రామిక ప్రతినిధులతో హైటెక్స్‌లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఈ ఈవెంట్‌కి ప్రముఖ కంపెనీల సీఈఓలకు ఆహ్వానాలు అందజేయనుంది. ఐపాస్ ప్రకటనను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పరిశ్రమలకు భూమి కేటాయింపులు, అనుమతులన్నీ కేవలం 15 రోజుల్లోనే వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అన్ని రకాల పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.