రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పారిశ్రామిక విధానానికి (టీఎస్‌ఐపాస్) భారీ స్పందన వస్తోంది. ఇందులో అనుమతుల మంజూరు, వసతుల కల్పన, రాయితీలు ఆశాజనకంగా ఉండడంతో పలు సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో వీటి ఏర్పాటుకు బడా పారిశ్రామికవేత్తలు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. నూతన పారిశ్రామిక విధానం అమలు తర్వాత రెండు విడతల్లో 33 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఏకంగా తొమ్మిది పరిశ్రమలు జిల్లాలోనే ఏర్పాటు కానుండడం విశేషం. ప్రభుత్వం అనుమతిచ్చిన తొమ్మిది పరిశ్రమలు రూ.344.35 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా.. 2,920 మందికి ఉపాధి లభించనుంది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని పదేపదే ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్.. వాటి అనుమతుల విషయంలోనూ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతి పత్రాలను ఆయన దగ్గరుండి కంపెనీ ప్రతినిధులకు అందజేస్తున్నారు. గత నెల 23న తొలి దశలో జిల్లాలో మూడు పరిశ్రమలకు అనుమతులివ్వగా.. బుధవారం సచివాలయంలో ఆరు పరిశ్రమలకు అనుమతులు జారీ చేశారు. అనుమతి పత్రాలను ఆయా కంపెనీల చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓలకు సీఎం కేసీఆర్ అందజేశారు.
కొత్తగా అనుమతులు పొందిన పరిశ్రమల్లో భగవత్ ప్రొడక్ట్స్ అధికంగా 1250 మందికి ఉపాధి కల్పించనుంది. రావిరాల సమీపంలో ఏర్పాటయ్యే ఈ కంపెనీలో మైక్రోమ్యాక్స్ సెల్‌ఫోన్లను తయారు చేయనున్నారు. అదేవిధంగా ఆదిబట్లలోని ఏరోస్పేస్ సిటీలో టాటా సికోర్‌స్కై ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీలో హెలికాప్టర్ క్యాబిన్, కిట్లు, ఇతర పరికరాలు తయారు చేయనున్నారు. ఈ కంపెనీలో 60 మందికి కొత్తగా ఉపాధి కలగనుంది. ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణకు సంబంధించి పనులు చేపడతారు. ఈ కంపెనీలోనూ 800 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.
వడివడిగా అడుగులు
Published Thu, Jul 23 2015 12:08 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement