సీఐఐ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలని, పనిచేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహం లభిస్తే అవి మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నా రు. కానీ కేంద్రం ఆ దిశగా ఆలోచించడం లేదని విమర్శిం చారు. కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని, పారిశ్రామికీకరణలో కేంద్రం రాజకీయాలు చేయకూడదన్నారు. బుధవారం శిల్పకళావేదికలో టీఎస్ ఐపాస్ చట్టం చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘బుల్లెట్ రైలు అనగానే ఢిల్లీ, ముంబైలేనా..? హైదరాబాద్ ఎందుకు గుర్తుకు రాదు.. డిఫెన్స్ కారిడార్‌ను హైదరాబాద్–బెంగళూరుల మధ్య కాకుండా మరోచోట ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామిక కారిడార్ అంటే ఢిల్లీ– ముంబై మధ్యలోనేనా? దక్షిణాది రాష్ట్రాల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయకూడదా? అదివస్తే వారికం టే ఎక్కువగానే అద్భుతాలు చేయగలుగుతాం..’అని కేటీఆర్ అన్నారు.
సీఎం మానస పుత్రిక టీఎస్‌ఐపాస్
‘టీఎస్‌ఐపాస్ సీఎం కేసీఆర్ మానçస పుత్రిక. తెలంగాణ ఏర్పడ్డాక అమోదించిన తొలి బిల్లు ఇది. పటిష్టంగా అమలవుతున్న దీని క్రెడిట్ అంతా ముఖ్యమంత్రిదే. సీఎం స్ఫూర్తితో ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కొత్త తరహా ఆలోచనలను అమలు చేస్తున్నాం. 27 శాఖల ద్వారా 35 సర్వీసులకు సంబంధించిన అనుమతులను టీఎస్‌ఐపాస్ ద్వారా అందిస్తున్నాం. గత ఐదేళ్లలో దాదాపు 12 వేల పరిశ్రమలకు అనుమతుల ద్వారా రూ.1.73 లక్షల పెట్టుబడుల సాధనతో పాటు 13.02 లక్షల మందికి ఉపాధి కల్పించాం. పరిశ్రమలకు రాయితీలిస్తే పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్టుగా అపోహలున్నాయి. ఈ రాయితీలు కార్మికులకు జీవనాధారం’అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు (టీ ప్రైడ్) రూ.205 కోట్ల రాయితీలను ఈ సందర్భంగా కేటీఆర్ అందజేశారు. ‘2014–19 మధ్యకాలంలో 40 వేల ఎకరాల్లో 49 పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేశాం. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ) పై రాష్ట్రాల మధ్య కేంద్రం పోటీ పెట్టిన విధంగా, పరిశ్రమల ఏర్పాటులో 33 జిల్లాల మధ్య పోటీపెట్టి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం కల్పిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం 10 వేల ఎకరాలను సేకరించాం. ఇంకో 2 వేల ఎకరాలు సేకరించగానే క్లస్టర్‌ని ప్రారంభిస్తాం. ఫార్మా రంగంలో ప్రపంచానికే కేంద్రంగా హైదరాబాద్ మారుతుంది’అని కేటీఆర్ చెప్పారు.
నేనేమీ మాయ చేయలేదు.: మంత్రి మల్లారెడ్డి
‘నన్ను చూసి నేర్చుకోండి. మజాక్ కాదు. కష్టపడి పనిచేస్తే ఎవరైనా ఏ స్థాయికైనా ఎదగొచ్చని చెప్పడానికి నేనే నిదర్శనం. సైకిల్‌పై తిరిగి పాలుపోసే మామూలు స్థాయి నుంచి 13 ఇంజనీరింగ్ కాలేజీలు, రెండేసి చొప్పున మెడికల్, డెంటల్ కాలేజీలు, 10 సీబీఎస్‌ఈ స్కూళ్లు, మహిళల ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్, మేనేజ్‌మెంట్ కాలేజీలు స్థాపించాను. ఇందుకోసం నేనేమీ మాయ చేయలేదు. ప్రతి రూపాయి కష్టపడి సంపాదించా’అని వ్యాపారవేత్తలను ఉద్దేశించి కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. ఉపన్యాసం ముగించి తన పక్కనే కూర్చున్న మల్లారెడ్డిని కేటీఆర్.. ‘బాగా మాట్లాడారు. నీళ్లు తాగండి’అంటూ వాటర్‌బాటిల్ అందించారు.
మల్లారెడ్డి మాట్లాడాక ప్రసంగించడం అంటే విరాట్ కోహ్లి బ్యాటింగ్ తర్వాత మరొకరు బ్యాటింగ్ చేసినట్టుగా ఉంటుందంటూ కేటీఆర్ తన ప్రసంగంలో చమత్కరించారు. టీఎస్‌ఐపాస్ అమల్లో ప్రతిభ కనబరిచిన 9 జిల్లాల కలెక్టర్లు, పరిశ్రమల శాఖ అధికారులకు అవార్డులు అందజేశారు. మూడు కేటగిరీల్లో 1 ,2, 3 స్థానాలు పొందిన జిల్లాలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి. వీరితో పాటు వివిధ శాఖల అధికారులకు కూడా అవార్డులు అందజేశారు. పరిశ్రమల శాఖ కమిషనర్ అహ్మద్‌నదీం స్వాగతం పలకగా, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ టీఎస్‌ఐపాస్ లక్ష్యాలను వివరించారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ముందున్నా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ముందున్నప్పటికీ హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని మంత్రి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ రంగంలో నిపుణులైన మానవ వనరులు, పరిశోధన సంస్థలు హైదరాబాద్ సొంతమని గుర్తుచేశారు. సీఐఐ ఏర్పాటు చేసిన డిఫెన్స్ రంగ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దేశంలో డిఫెన్స్, ఏరోస్పేస్ యూనిట్ల ఏర్పాటు సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో యూనిట్ల ఏర్పాటుకు ఎక్కడైతే డిఫెన్స్ రంగం పటిష్టంగా ఉందో ఆ ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
పెట్టుబడుల విషయంలో అల్ప రాజకీయాలు చేయకూడదంటూ హితవు పలికారు. ‘కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ఐదేళ్లలో నలుగురు రక్షణ శాఖ మంత్రులను కలిశాను. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో వృద్ధి బాటన ఉన్న హైదరాబాద్‌ను మరింత ప్రోత్సహించండి అని కోరా. డిఫెన్స్ ప్రొడక్షన్ కారిడార్లను ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, మరొకటి చెన్నైలో ఏర్పాటు చేయనున్నట్టు ఒక మంత్రి తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు కాకుండా ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ మంత్రిని అడిగా. అర్థం లేని సమాధానం చెప్పారు.
జాతీయ శ్రేయస్సు కన్నా ప్రాంతీయ, రాజకీయ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేంద్రం వ్యవహరిస్తోంది. కేంద్ర డిఫెన్స్ శాఖ తన బడ్జెట్ నుంచి పలు ప్రాజెక్టులకుగాను రూ.1.05 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు’అని అన్నారు. కేంద్రాన్ని కోరుతోంది తన నియోజక వర్గం సిరిసిల్ల కోసం కాదని, తెలంగాణ కోసమని చురక అంటించారు. దేశంలో డిఫెన్స్ రంగాన్ని పటిష్టం చేయడంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించనున్న నేపథ్యంలో తన వ్యూహంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని మంత్రి విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment