గజ్వేల్‌లో ‘పాలీహౌస్’ కూరగాయల సాగు
సాక్షి, గజ్వేల్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన పంటలు పత్తి, మొక్కజొన్న, వరికి ధీటుగా కురగాయలు సాగవుతున్నాయి. ఆయా జిల్లాలో పరిధిలో మొత్తం పంటలు సుమారు 15లక్షల ఎకరాల్లో సాగులోకి వస్తుండగా.. ఇందులో సుమారు 4లక్షల ఎకరాలకుపైగా పలు రకాల కురగాయల పంటలు సాగులో ఉండటం వల్ల ఉమ్మడి జిల్లాలో ‘వెజిటటుల్ హబ్’ ఆవిర్భవించింది. ప్రత్యేకించి గజ్వేల్, పటాన్‌చెరు, సిద్దిపేట, నర్సాపూర్, మెదక్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో కురగాయలు విస్తారంగా సాగులో ఉన్నాయి.
శ్రమను నమ్ముకొని జీవించే కురగాయల రైతులకు వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏ యేటికాయేడు కుంగదీస్తున్నాయి. నష్టాల బారిన పడిన రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో కురగాయల రైతులకు లాభాల పంట పండించడానికి ‘పాలీహౌస్’ ప్రభుత్వం తరుణోపాయంగా భావించి అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎకరాకు 75శాతం సబ్సిడీ కింద రూ.39 లక్షలను ప్రభుత్వం అందజేయనున్నది. రైతు తన వాటా కింద రూ.8.44లక్షలు చెల్లిస్తే చాలు...‘పాలీహౌస్’కు సంబంధించి అన్ని రకాల పరికరాలను పొలంలో బిగిస్తారు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పథకం ఆశించిన విధంగా అమలు కాలేదు. 2014–15, 2015–16, 2016–17 ఏడాదిలకు సంబంధించిన కేవలం 200 ఎకరాలకు మాత్రమే పథకాన్ని వర్తింపజేయగలిగారు.
పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలోనే 250 ఎకరాల్లో రైతులకు పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులను అదేశించింది. కానీ ఈ టార్గెట్‌ను మూడేళ్లల్లో కూడా సాధించలేకపోయారు. పలువురు రైతులకు మంజూరు పత్రాలు వచ్చినా.. నిధులు విడుదల కాక కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. నిధుల కొరత వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. ఇకముందు పథకం అమలుపై కూడా అనుమానాలు నెలకొన్నాయి.
‘వెజిటబుల్ హబ్’నే విస్మరిస్తే ఎలా...?
రాష్ట్రంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా విస్తారమైన కురగాయల సాగుతో ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. ఇక్కడ ఉత్పత్తవుతున్న కురగాయలు హైదరాబాద్ నగరానికే కాకుండా ఢిల్లీ, కలకత్తా, చంద్లాపూర్, బెంగుళూర్ లాంటి ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క రోజు ఇక్కడి నుంచి కురగాయలు వెళ్లపోతే దేశంలోని ప్రధాన కురగాయల మార్కెట్లన్నీ అల్లాడే పరిస్థితి నెలకొన్నది.
ప్రభుత్వం రైతులకు అభ్యున్నతి దోహదపడే ‘పాలీహౌస్’ పథకానికి నిధులు బంద్ చేసి.. ఎత్తివేయడానికి ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కురగాయల సాగు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనైనా ఈ పథకాన్ని ప్రత్యేకంగా అమలు చేయాలని రైతులు కోరుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment