తాగునీటి కోసం ‘భగీరథ’ యత్నం!  | Government is supposed to supply water supply across the state from this monsoon through Mission Bhagirathi | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం ‘భగీరథ’ యత్నం! 

Published Tue, Jun 5 2018 1:48 AM | Last Updated on Tue, Jun 5 2018 1:48 AM

Government is supposed to supply water supply across the state from this monsoon through Mission Bhagirathi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ ద్వారా ఈ వర్షాకాలం నుంచే రాష్ట్రవ్యాప్తంగా తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా రిజర్వాయర్లలో నీటి లభ్యతపై దృష్టి పెట్టింది. ప్రధానంగా కృష్ణా బేసిన్‌ పరిధిలో నీటి లభ్యత తక్కువగా ఉండి, అవసరాలు ఎక్కువగా ఉన్న ఎల్లూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించేదిశగా కసరత్తు చేస్తోంది. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని అందించే ఎల్లూర్‌ రిజర్వాయర్‌లో నీటి మట్టాలు అత్యంత కనిష్టానికి చేరాయి. మరోవైపు శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్‌ మరింతగా నీటిని తోడేస్తుండటంతో మట్టాలు తగ్గిపోయి నీటిని ఎల్లూర్‌కు తరలించేందుకు వీల్లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఎల్లూర్‌ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరాన శ్రీశైలం ఫోర్‌షోర్‌లో క్రాస్‌బండ్‌ నిర్మించి, 25 మోటార్లు పెట్టి ఎల్లూర్‌కు నీటిని తరలించాలని నిర్ణయించింది.  

తగ్గిన మట్టాలు.. తప్పని తిప్పలు.. 
రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని తాగు అవసరాల కోసం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగా శ్రీశైలం జలాలపై ఆధారపడ్డ ఎల్లూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఏటా 7.12 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ప్రణాళిక రూపొందించింది. అంటే ప్రతి నెలా 0.70 టీఎంసీలు అవసరం. ఈ లెక్కన ఆగస్టు వరకు 2.1 టీఎంసీలు కావాలి. కానీ ఎల్లూర్‌ రిజర్వాయర్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 0.3 టీఎంసీలే. శ్రీశైలం నుంచి కల్వకుర్తి పంపుల ద్వారా ఈ రిజర్వాయర్‌కు నీటిని తరలించే అవకాశముంది.

కానీ అందుకోసం శ్రీశైలం రిజర్వాయర్‌లో 802 అడుగుల మేర కనీస నీటి మట్టం ఉండాలి. కానీ ఏపీ తన అవసరాల కోసం నీటిని వాడేసుకోవడంతో శ్రీశైలంలో మట్టం 799.70 అడుగులకు తగ్గిపోయింది. దీంతో కల్వకుర్తి పంపుహౌజ్‌కు 4 కిలోమీటర్ల దూరంలో నీటి లభ్యత ఉంది. దీంతో అక్కడి నుంచి నీటిని తీసుకోవాలని నీటిపారుదల, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలు నిర్ణయించాయి. శ్రీశైలం ఫోర్‌షోర్‌లోని కోతిగుండ వద్ద 815 అడుగుల లెవెల్‌లో 200 మీటర్ల పొడవున క్రాస్‌బండ్‌ను నిర్మించాలని.. అక్కడ 100 హెచ్‌పీ సామర్థ్యమున్న 25 మోటార్లను పెట్టి కల్వకుర్తి పంపుహౌజ్‌ వద్దకు, పంపుహౌజ్‌ నుంచి ఎల్లూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 155 మీటర్ల క్రాస్‌బండ్‌ నిర్మాణం పూర్తయింది. త్వరలో మోటార్లు పెట్టనున్నారు. మొత్తంగా ఆగస్టు వరకు మూడు నెలల పాటు ఇదే పద్ధతిన నీటిని తోడనున్నారు. దీనికోసం 6.5 కిలోమీటర్ల మేర 11 కేవీ విద్యుత్‌ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement