రేపు ఢిల్లీకి గవర్నర్
రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులతో సమావేశాలు
ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలపై సమాచారం కోసమే..
నివేదిక సమర్పించనున్న నరసింహన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలోని పలు అంశాల్లో నెలకొన్న వివాదాలపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నివేదిక ఇవ్వడానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు. ప్రతీ అంశంపై ఇరు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదులు పంపడమే కాకుండా.. స్వయంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌లు) నేరుగా హోం శాఖ కార్యదర్శి వద్ద తమ తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం వాదించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశానికి కొనసాగింపుగా.. గవర్నర్‌ను కేంద్రం పిలిపిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగునీరు, విద్యుత్, నిధుల పంపిణీ, తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనతోపాటు ఏ షెడ్యూల్‌లోనూ లేని సంస్థలపై ఎవరి పెత్తనం ఉండాలన్న అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు తమ వాదనలను గట్టిగా వినిపించారు.
సోమవారం ఢిల్లీ వెళ్తున్న గవర్నర్ మూడ్రోజులపాటు అక్కడే ఉండనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై.. ఇక్కడి పరిస్థితులను వివరించనున్నారు. అదే విధంగా ఇంటర్ పరీక్షల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన అంశం కూడా ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. దీంతోపాటు కృష్ణా జలాల వినియోగం, వివిధ సంస్థల్లోని నిధుల అంశాన్ని కూడా గవర్నర్ కేంద్రంతో చర్చించనున్నారు. విభ జన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు ఉమ్మడి రాజధానిపై అధికారాల అంశాన్ని ఏపీ సర్కారు లేవనెత్తుతోంది. ఢిల్లీ పర్యటనలో ఈ అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలిసింది.
గవర్నర్‌తో ఆంధ్రా సీఎస్ భేటీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, పునర్విభజన విభాగం కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి శనివారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ఉద్యోగుల విభజన అంశాన్ని ప్రేమ్‌చంద్రారెడ్డి వివరించగా.. ఢిల్లీలో హోం శాఖ కార్యదర్శి వద్ద జరిగిన సమావేశ వివరాలను కృష్ణారావు వెల్లడించినట్లు తెలిసింది.