
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం రెండు రోజుల పర్యటనకోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రధానంగా ప్రత్యేక హోదా నేపథ్యంలో ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం కోసం గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. ప్రత్యేక హోదా కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల నిర్వహించిన దీక్షలో ప్రధాని మోదీని దూషిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ప్రసంగం తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, గవర్నర్ పదవీకాలం పొడిగింపు విషయంలో కేంద్రం నుంచి ఇంకా రాతపూర్వక ఉత్తర్వులు రాలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఇతర ప్రముఖులను కలుసుకోనున్నారని సమాచారం.