రైతుగా ఉంటే ఆత్మహత్య చేసుకునేవాణ్ని: గవర్నర్
సిరిసిల్ల: దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తీవ్రంగా స్పందించారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా కాకుండా రైతుగానే ఉండి ఉంటే అనేకసార్లు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చి ఉండేదని తెలిపారు. విద్యాసాగర్ రావు శనివారం ఆయన తన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో పర్యటించారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారిగా సొంతూరుకు వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు గ్రామంలోని తన కుటుంబ సభ్యులను, బంధువులను, గ్రామస్తులను పేరుపేరునా గుర్తు చేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గవర్నర్ పదవీకాలం పూర్తయ్యాక, ప్రధానమంత్రి మోదీ గనుక వదిలిపెడితే స్వగ్రామం నాగారంలోనే స్థిరపడలానన్నారు. నాగారంలో ఉన్న తన భూమి హైదరాబాద్‌లోని గుంట భూమితో సమానం కాకపోవచ్చు.. కానీ తన గుండె మాత్రం ఇక్కడే ఉందని ఉద్వేగానికి లోనయ్యారు. మూడు వందల ఏళ్ల క్రితమే మనది ధనిక దేశమని, కానీ ఇప్పుడు గ్రామాల్లో ఇంకా అభివృద్ది జరగాల్సి ఉందని తెలిపారు. మహిళలు, చిన్న పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మన దేశంలో ప్రజలు ఎంత పేదరికంలో ఉన్న ఆత్మగౌరవాన్ని మాత్రం విడిచిపెట్టరని అన్నారు. పేద ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ది జరగాల్సి ఉందన్నారు. ఎన్నికల తరువాత రాజకీయాలకతీతంగా అందరూ కలిసి అభివృద్దికి కృషి చేయాలన్నారు. దేశాభివృద్దికి పెట్టుబడులు పెట్టేందుకు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు.. వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి అనుసంధానం చేస్తే ఫలితాలుంటాయన్నారు. కాగా గ్రామంలో ఏర్పాటు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
కాగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్ రావుతో పాల్గొనే అవకాశం రావడం సంతోషమన్నారు. మహారాష్ట్ర నుంచి గోదావరి జలాలు తెలంగాణకు తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేసారన్నారు. పుట్టిన ఊరిపై ఆయనకు ఎంతో మమకారం ఉందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విద్యాసాగర్ రావు చాలా రిస్క్ తీసుకంటారన్నారు. అదే విధంగా మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ నాగరంలో శ్రీ కోదండరాం ఆలయంను త్వరగా పూర్తి చేస్తామని హామి ఇచ్చారు. సీఎం కేసీఆర్ గొప్ప భక్తి భావాలున్నవ్యక్తి అని తెలిపారు. తిరుపతి పుణ్యక్షేత్రం లాగా త్వరలోనే యాదాద్రి, రాజన్న ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు.