సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈనెల 27న లేదా 28న ఈ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. రిలయన్స్, మహీంద్రా, బిర్లా తదితర æప్రముఖ సం స్థలు రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ఇప్పటికే ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతించాలని భావిస్తోంది. వీటి అనుమతుల విషయంలో కీలక నిబంధనలు ఉండేలా చూస్తోంది.
ప్రముఖ సంస్థల ఆసక్తి..
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రైవేటు వర్సిటీలను రాష్ట్రం లో అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ సంస్థలతోపాటు పారిశ్రామిక సంస్థల ఆధ్వర్యంలో వర్సిటీల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించింది. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. తాజాగా రిలయన్స్ సంస్థ ఇక్కడ విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరించింది. రాష్ట్రంలో క్యాంపస్‌లున్న గీతమ్ డీమ్డ్ వర్సిటీ, ఇక్ఫాయ్ వంటి సంస్థలు రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీని ఏర్పాటు చేసే అవకాశముంది. ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి.
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా..
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అందించే కోర్సుల ను ప్రైవేటు వర్సిటీల్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా జాగ్ర త్తలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు యూనివర్సిటీల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఉండే అవకాశం లేదు. ఏ రంగంలోనైనా ఆధునిక పరిజ్ఞానాన్ని నేర్పించేలా కోర్సులను డిజైన్ చేయాల్సి ఉంటుందని, ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థల అవసరాలకు ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
భవనాలు ఉంటేనే సరిపోదు..
రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలకు 50 నుంచి 100 ఎకరాల వరకు స్థలాలు ఉన్నాయి. విశాలమైన భవనాలు ఉన్నాయి. అంత మాత్రాన ప్రైవేటు వర్సిటీని స్థాపించేందుకు ముందుకు వచ్చినా వాటన్నింటికి అనుమతివ్వొద్దని భావిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు, బ్రాండ్ ఇమేజ్ ప్రధాన ప్రాతిపదికగా తీసుకొని అనుమతిచ్చే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బిల్లులో నిబంధనలను పొందుపరిచినట్లు తెలిసింది. స్థలాలు, భవనాలు చూసి అనుమతులు ఇస్తే హైదరాబాద్ బ్రాండ్ ఈమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున యూనివర్సిటీల మంజూరులో అనేక జాగ్రత్తలు తీసుకునేలా నిబంధనలు సిద్ధం చేసింది. దేశంలో ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు 300 వరకు ఉంటే అందులో పేరున్నవి 50 కూడా లేవని, అందుకే రాష్ట్రంలో జాగ్రత్తలు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment