వెంట నడిచే అనుచర గణం.. హోదా తెచ్చిపెట్టే అధికార దర్పం.. రాజకీయమంటే అదో ‘ప్రత్యేకమైన’ ఆసక్తి.. అందుకే పాలిటిక్స్‌లోకి వచ్చేందుకు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. డాక్టర్లు, ఇంజినీర్లు, వివిధ రంగాల్లో స్థిరపడిన వారే కాదు.. విద్యావంతులు సైతం బరిలోకి దిగేందుకు ఎన్ని‘కలలు’ కంటున్నారు. విద్యాసంస్థల నిర్వాహకులు కూడా అధికార పీఠమెక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే కొందరు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండగా.. మరికొందరు ఏదో ఒక పార్టీలో చేరి సార్వత్రిక ఎన్నికల సమరంలో తలపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
సాక్షి, కామారెడ్డి: రాజకీయాల్లోకి వచ్చేందుకు విద్యా వంతులు, విద్యాసంస్థల నిర్వాహకులు ఆస క్తి చూపుతున్నారు. అధికార పీఠమెక్కేందు కు అవసరమైన బాటలు వేసుకుంటున్నా రు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే పలువురు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు విద్యావంతులు, విద్యాసంస్థల నిర్వాహకులు వివిధ రాజకీయ పా ర్టీల గొడుగు కిందకు చేరగా, ఇంకొందరు ఏదో పార్టీలో చేరడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం కావాలని యత్నిస్తున్నారు. ఎలాగైనా ఏదో ఒక పార్టీ ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నారు.
ఎల్లారెడ్డిలో పోటీ అధికమే..
ఇక, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెలే ఏనుగు రవీందర్‌రెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆయన భార్య మంజులారెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే, ఈ నియోజక వర్గంలో తెలంగాణ జన సమితి పార్టీ నుంచి ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి భూ నిర్వాసితుల పక్షాన న్యాయపోరాటం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన రచనారెడ్డి ప్రొఫెసర్ కోదండరాం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి ఆవిర్భావ బృందంలో ఒకరుగా ఉన్నారు. ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ప్రొఫెసర్ కోదండరాం దగ్గర పరిశోధన విద్యార్థిగా ఉన్న లింగంపేట మండలానికి చెందిన ఓయూ విద్యార్థి నాయకుడు నిజ్జెన రమేశ్ కూడా ఎల్లారెడ్డి నుంచి పోటీకి సన్నద్ధమవుతున్నారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన ప్రొఫెసర్ ఎల్లన్నయాదవ్ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర నాయకుడిగా నియోజక వర్గాన్ని చుట్టి వస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నత హోదాలో అధికారిగా ఉన్న ఒకరు అధికార పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
బాన్సువాడ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న విద్యావంతుడు మల్యాద్రిరెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన గ్రూప్ వన్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్‌గౌడ్ కూడా రాజకీయాలపై ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం.
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన జు క్కల్ నుంచి పోటీ చేయడానికి కొందరు ఆ సక్తి చూపుతున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ నుం చి సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే తిరిగి బరిలో నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నా యి. కాంగ్రెస్ నుంచి విద్యావంతురాలైన మాజీ ఎమ్మెల్యే అరుణతార పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరో ఇద్దరు విద్యావంతులు కూడా ఇతర పార్టీల వైపు చూస్తు న్నట్టు తెలుస్తోంది. జిల్లా రాజకీయాల్లో వి ద్యావంతులు, విద్యా సంస్థల యజమాను లు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుండడంపై అంతటా చర్చ జరుగుతోంది.
రేసులో నిలిచేదెవరో..?
జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజక వర్గాలపైనే ఎక్కువ మంది విద్యావంతులు దృష్టి సారించారు. అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలవడానికి పలువురు విద్యావంతులు, విద్యాసంస్థల నిర్వాహకులు ఆరాటపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజక వర్గమైన జుక్కల్‌లో ఇప్పుడిప్పుడే ఒకరిద్దరు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తిరిగి బరిలో నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయ నాయకురాలు సుమిత్రానంద్ టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. గతంలోనే ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారు. ఈ సారి కూడా ఆమె ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో ఉంటారని ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి నియోజక వర్గ ఇన్‌చార్జీగా కొనసాగిన, ప్రస్తుత ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిర్మల్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో నిలిచే అవాకశం ఉంది. అయితే, టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తిరిగి పోటీ చేయనుండడంతో టిక్కెట్ ఆశిస్తున్న వాళ్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ తిరిగి పోటీ చేస్తారని భావిస్తున్నారు.
బీజేపీ తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న విద్యావంతుడు డాక్టర్ మురళీధర్‌గౌడ్ కూడా కామారెడ్డి నియోజక వర్గంలో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈ సారి టిక్కెట్ కోసం ప్రయత్నించవచ్చని చెబుతున్నారు. లేదంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. పట్టణంలో ఫ్రొబెల్స్ స్కూల్ యజమాని, జెడ్పీ మాజీ చైర్మన్ కేపీ వెంకటరమణారెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన కూడా కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. సాందీపని విద్యాసంస్థల డైరెక్టర్ హరిస్మరణ్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యనేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. అలాగే, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైబ్రరీ ఇన్‌చార్జీగా కొనసాగుతున్న ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్ మోహన్ కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీకి దిగాలని, లేదంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో ఆర్‌కే డిగ్రీ కళాశాల నిర్వాహకుడు, గతంలో విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పని చేసిన ముస్కు జైపాల్‌రెడ్డి కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment