మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, వేదికపై అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు
సాక్షి, గద్వాల: గద్వాలలో జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధి, అవకాశవాదానికి మధ్య జరుగుతున్నవిగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభివర్ణించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తనది ఇక్కడ తొలి అడుగు మాత్రమేనని.. కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించుకుని తన వెంట అసెంబ్లీలోకి తీసుకునే వెళ్తాననే ధీమా వ్యక్తం చేశారు.
కొన్నేళ్లుగా గద్వాలలో డబ్బు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తున్నారని.. డబ్బు అహంకారం ఇక నడవదని పేర్కొన్నారు. అలాగే, హరీశ్‌రావు ఇక్కడకు వచ్చాడని గుర్తించాలని సూచించారు. గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌లో డాక్టర్ అబ్రహం గెలుపు ఖాయమని అన్నారు. కంటికి రెప్పలాగా గద్వాల కార్యకర్తలను కాపాడుకుంటామని, ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా పార్టీ కోసం 19 ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలు మరో 19రోజులు గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా కృష్ణమోహన్‌రెడ్డి గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. గద్వాలలో కొందరు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని.. వారికి అధికారం, పదవులు తప్ప ప్రజాసంక్షేమం పట్టలేదని విమర్శించారు. టికెట్ వస్తే ఒక పార్టీ.. రాకపోతే మరో పార్టీ.. అంతిమ లక్ష్యం మాత్రం అదికారమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
బాబుతో పొత్తు సిగ్గుచేటు
తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటని హరీశ్‌రావు అన్నారు. చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలకు కారణమయ్యారని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలోనే మహబూబ్‌నగర్ వలసల జిల్లాగా మారిందన్నారు. పోతిరెడ్డిపాడుకు బొక్కకొట్టి మహబూబ్‌నగర్‌కు రావాల్సిన నీటిని ఆం«ధ్రాకు తరలించినప్పుడు డీ.కే.అరుణ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని తెలిపారు. దీంతో ఎటు చూసినా చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. నెట్టెంపాడుకు 2004లో కొబ్బరికాయ కొడితే 2014వరకు పదేళ్లలో పట్టుమని 10వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్లలో కాల్వలు పూర్తిచేసి రూ.వందల కోట్లు ఖర్చుతో 1.20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని తెలిపారు.
ఈ మధ్య కొబ్బరి కాయకొట్టే పాత ఫొటో పట్టుకొచ్చి తామే జీఓ తెచ్చామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు మంత్రిగా ఉండి గట్టు ఎత్తిపోతలకు తట్టెడు మట్టి తవ్వని వ్యవస్థ మీదైతే... రూ.552కోట్లు మంజూరు చేసిన, చేయించుకున్న ఘనత కేసీఆర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి దక్కుతుందని తెలిపారు. గట్టు ఎత్తిపోతల ద్వారా గట్టు మండలాన్ని సశ్యశ్యామలం చేస్తామని అన్నారు.
గద్వాలకు 350 పడకల ఆస్పత్రి, గద్వాలకు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు, ఆర్డీసీ బస్టాండ్ ఆధునీకరణకు రూ.2కోట్లు, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, గుర్రగడ్డ బ్రిడ్జికి రూ.10కోట్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాలలో టెక్స్‌టైల్ పార్కుకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పేద ప్రజలు, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పథకాలు ప్రవేశపెట్టామని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు.
కార్యకర్తల రుణం తీర్చుకుంటా..
15ఏళ్లుగా ఓడినా, గెలిచినా వెన్నంటే ఉన్న కార్యకర్తల రుణం రుణం తీర్చుకుంటానని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు పెట్టినా, ఇబ్బందులు వచ్చినా తన వెంట ఉన్న కార్యకర్తలను మరువలేనని అన్నారు. ఈసారి అవకాశం ఇచ్చి అందరి రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అచ్చంపేట రాములు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వినియోగదారుల కార్పొరేషన్ ఛైర్మన్ గట్టు తిమ్మప్ప, టీఎస్ టెక్నాలజీ ఛైర్మన్ రాకేష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, జిల్లా గ్రం«థాలయ చైర్మన్ బీ.ఎస్. కేశవ్, టీఆర్‌ఎస్ నాయకులు పరుమాల నాగరాజు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment