‘మహా’ పోటీ
- గణేశుని లడ్డూ కోసం పోటెత్తిన భక్తులు
- గంటల తరబడి బారులు
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి చేతిలో పూజలందుకున్న మహా లడ్డూ (5వేల కిలోలు) ప్రసాదం కోసం భక్తులు పోటెత్తారు. నగర నలు మూలల నుంచే కాకుండా నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కొంతమంది బుధవారం అర్థరాత్రి నుంచే పడిగాపులు కాశారు.
గురువారం ఉదయం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లలో ఖైరతాబాద్ రైల్వేగేటు వైపు పురుషులు, మింట్ కాంపౌండ్ వైపు మహిళలు బారులు తీరారు. అంతకుముందు సైఫాబాద్ ఏసీపీ ఇస్మాయిల్, ఇన్‌స్పెక్టర్ పి.అశోక్, ఉత్సవ కమిటీఅధ్యక్షుడు సింగరి సుదర్శన్, లడ్డూ దాత మల్లిబాబు, శిల్పి రాజేంద్రన్‌తో పాటు కమిటీ సభ్యులు, నాయకులు పూజలు చేసి, ప్రసాద పంపిణీని ప్రారంభించారు. 5వేల కిలోలలో దాత మల్లిబాబుకు రెండు టన్ను లడ్డూను ఇచ్చారు. క్రేన్‌తో వాహనంలోకి లడ్డూను చేర్చారు.
ప్రత్యేక వాహనంలో మల్లిబాబు తన స్వగ్రామం తాపేశ్వరానికి ప్రసాదాన్ని తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది మహాగణపతికి ప్రసాదం సమర్పించినా, దక్కించుకోలేకపోయామని, ఈ సంవత్సరం తిరిగి తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రసాదాన్ని తమ చుట్టు పక్కల గ్రామాల వారికి ఉచితంగా అందజేస్తానని మల్లిబాబు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ కార్యక్రమం రెండు గంటలకు ముగిసింది.
రసాబాసగా మారిన పంపిణీ
మహాప్రసాదం కోసం భారీగా జనం తరలి రావడంతో అదుపు చేయడం నిర్వాహకులు, పోలీసులకు కష్టంగా మారింది. ఖైరతాబాద్ రైల్వేగేటు వైపు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ భక్తులు ముందుకు రావడంతో కొద్ది సేపు తోపులాట జరిగింది. పోలీసులు మళ్లీ బారికేడ్లు సరిచేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైల్వే గేటు నుంచి శ్రీనివాస్‌నగర్ వరకు భక్తులు దాదాపు కిలోమీటర్ మేర క్యూలైన్‌లో వేచి ఉన్నారు.
భక్తుల నిరాశ
ప్రసాదం కోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉన్నప్పటికీ లభించకపోవడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. మహిళలు చంటి పిల్లలను ఎత్తుకొని బారులు తీరారు. తీరా రెండు గంటలకే ప్రసాదం అయిపోయిందని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటికీ భారీగా తరలివచ్చిన విద్యార్థులు ‘ఉయ్ వాంట్ లడ్డూ...’ అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.