నల్లమల.. చెంచుల విలవిల..!
- అడవి నుంచి మైదానాలకు పెంటల తరలింపు
- మొదటి దశలో మూడు చెంచు గ్రామాలు
- ఆ మూడు గ్రామాల్లో రూ.2 వేల జనాభా
- ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆఫర్
- వన్యప్రాణుల స్వేచ్ఛను హరిస్తున్నారని సాకులు
- ఇప్పటికే అటవీ భూములను స్వాధీనం చేసుకున్న అధికారులు
మన్ననూర్: ‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కా..?.. ఈ ఊళ్లో మాకింకా ఏమున్నదక్కా.. ఈ పల్లె విడిచి, మేం వెళ్లిపోతా ఉన్నాం..’ అని కూలీ కుటుంబాలు పల్లెల్ని వదిలి వలస వెళ్లే దృశ్యాల్ని కళ్లకు కట్టినట్లు చూపుతూ రెండుదశాబ్దాల క్రితం ఓ సినీ కవి పాటరాస్తే.. అది అందర్నీ కంటతడి పెట్టించింది. ఇలాంటి దృశ్యాలు పాలమూరు జిల్లాలో నిత్యకృత్యమే. తాజాగా ఇపుడు నల్లమలలో చెంచులు విలవిల్లాడుతున్నారు.. ఎన్నో ఏళ్లుగా అటవీభూములు, అక్కడ లభించే సంపదను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అటవీప్రాంత చెంచు గిరిజనులను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియ ముమ్మరమైంది.
వన్యప్రాణుల స్వేచ్ఛను హరిస్తున్నారనే సాకుతో అటవీశాఖ వారు ఆయా చెంచుపెంటలను తరలించేందుకు సిద్ధమవడంతో స్థానిక గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం-హైదారాబాద్ ప్రధాన రహదారిలోని వటువర్లపల్లిలో వెయ్యిమంది జనాభా, పర్యాటకప్రదేశం మల్లెలతీర్థం వెళ్లే రహదారిలోని సార్లపల్లిలో 500 మంది, కుడిచింతలబైలు తదితర పెంటల్లో 400 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్న చెంచు గిరిజనులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.
ఈ క్రమంలోనే గతేడాది వటువర్లపల్లి గ్రామంలో ఉన్న 800 ఎకరాల భూములను అటవీశాఖ స్వాధీనం చేసుకుని చెట్లు కూడా నాటించింది. ఈ వేసవిలో సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల్లో అటవీభూములను స్వాధీనం చేసుకుని చెట్లు నాటేందుకు అధికారులు పరిశీలించారు. భూములు తీసుకున్న తరువాత తాము ఇక్కడ ఉండటం ఎందుకుని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడినుంచి వెళ్తే కుటుంబానికి రూ.10 లక్షల ప్యాకేజీ ఇస్తామని అటవీశాఖ అధికారులు బంపర్‌ఆఫర్ ప్రకటించారు. స్థానిక చెంచుగిరిజనులను తరలించేందుకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, జిల్లాలోని కొత్తూరు తదితర ప్రాంతాలను ఎంపికచేసి మోడల్‌కాలనీలు కట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అటవీ సంపదే ఆధారం
ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్న చెంచుగిరిజనులకు అటవీసంపదే ఆధారం. ఇక్కడ లభించే కుంకుడుకాయలు, చీపురుపుల్లులు, తేనె, చింతకాయలు, మారేడుగడ్డలు, చిల్లగింజలు, జిగురు, బుడిపాల వేర్లు, విస్తరాకులు, తూనికాకు తదితర వాటిని సేకరించి మన్ననూరులో ఉన్న జీసీసీలో విక్రయించి ఉపాధి పొందుతున్నారు. దీనికితోడు మరికొందరు అటవీశాఖ భూములను సాగుచేరుకుని శనగ, వేరుశనగ, కంది, పత్తి తదితర పంటలను సాగుచేస్తున్నారు.
జంతుజాలం రక్షణ కోసమేనా?
రాజీవ్‌పులుల రక్షిత అభయారణ్య ప్రాం తమైన నల్లమల అటవీ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో 2013 అటవీశాఖ లెక్కల ప్రకారం 15 పెద్దపులులు, 32 చిరుతపులులతోపాటు ఎలుగుబంట్లు, రేసుకుక్కలు, కణితి, జింకలు, దుప్పులున్నాయి. అటవీశాఖ డివిజన్ పరిధిలో అచ్చంపేట, అమ్రాబాద్, మన్ననూర్, కొల్లాపూర్, లింగాల్ రేంజ్ పరిధిలో 400మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణుల మనుగడ, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడం, ఈ గ్రామాలను తరలించేందుకు సుమారు రూ.500 కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలిసింది.
స్థానిక చెంచుగిరిజనులను ఇక్కడి తరలించే క్రమంలో వారిని సిద్ధంచేసేందుకు అటవీశాఖ అధికారులు ఓ స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటుచేశారు. ఆయా గ్రామాల్లోని కొంతమందిని ఇప్పటికే అటవీశాఖ వారు కర్ణాటకలోని చెట్టెళ్లి, ఎబిళ్లాలో ఏర్పాటుచేసిన పునరావాస మోడల్ గ్రామాలకు తీసుకెళ్లి చూపించారు. ఇదివరకే డీఎఫ్‌ఓ, ఏఎఫ్‌ఓ, ఫారెస్ట్ రేంజర్లు ఎన్నోసార్లు గ్రామస్తులతో అభిప్రాయసేకరణ జరిపారు. ఆవాస ప్రాంతాలను విడిచిపెట్టేందుకు కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తుండగా.. ఎక్కువమంది చెంచు గిరిజనులు మాత్రం అడవిని విడిచిపెడితే బతకలేమని తేల్చిచెబుతున్నారు.
18న చలో సెక్రటేరియట్ పాదయాత్ర
ప్యాకేజీతో ప్రలోభాలను నిలిపేయడంతోపాటు ఆరు దశాబ్దాలుగా తీరని కనీస సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ ఈనెల 18న గ్రామ సమస్యల సాధన కమిటీ ఆధ్వర్యంలో ‘చలో సెక్రటేరియట్ పాదయాత్ర’కు ఆ 3 గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ప్యాకేజీ అంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని వటువర్లపల్లి మాజీసర్పంచ్ సర్యానాయక్, గ్రామ సమస్యల సాధన సమితి అధ్యక్షుడు చిర్ర రాములు, శ్రీనువాస్, బీచ్యానాయక్ వాపోతున్నారు. కాగా, మా తాతలు, తండ్రుల నుంచి ఎన్నోఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామనీ, ఇక్కడే కలో, గంజో తాగి బతుకుతామని వటువర్లపల్లి మాజీ సర్పంచ్ సర్యానాయక్, కుడిచింతబైలు వాసి చెంచు ఐతయ్య అంటున్నారు.
ఎవరినీ బలవంత పెట్టడంలేదు..
బలవంతం లేకుండా ఇష్టాప్రకారంగానే గ్రామాల నుంచి వెళ్లిపోతామనుకునే వారికే రూ.10లక్షల ప్యాకేజీ ఇస్తున్నాం. ఆ మూడు గ్రామాల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ బలవంతపెట్టలేదు. ఇదివరకే వారికి మోడల్ కాలనీలను చూపించిన మాట వాస్తమే. ఇష్టం లేనివారిని బలవంతపెట్టం.. కాకపోతే ఇక్కడే ఉంటామంటే మాత్రం అటవీశాఖ భూములను సాగుచేసుకోవద్దు.. ఎలాగైనా వాటిని మేం స్వాధీనం చేసుకుంటాం.
- వెంకటరమణ, డీఎఫ్‌ఓ, అచ్చంపేట