- వరంగల్ జిల్లాలో ఒకరికి, మహబూబ్‌నగర్‌లో మరొకరికి ..
సాక్షి, హైదరాబాద్/వరంగల్/ మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లో చలితగ్గుముఖం పట్టినా స్వైన్‌ఫ్లూ కేసులు మాత్రం పెరుగుతుండటంతో గ్రేటర్ వాసు లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు 336 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 21 మంది మృతి చెందారు. తాజాగా ఆదివారం 52 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో చాలామంది ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లోని స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాల్లో, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్వైన్‌ఫ్లూ నోడల్ అధికారులు తెలిపారు.
మరో పక్క జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఒకరికి, మహబూబ్‌నగర్‌లో మరొకరికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట యువకుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ మనోహర్, మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. మరో వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్వైన్‌ఫ్లూ అనుమానితులకు రవాణా సౌకర్యం
రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ తీవ్రత తగ్గిందని, ప్రజలు ఆందోళన చెందొద్దని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూ అనుమానిత రోగులను ఆస్పత్రులకు చేర్చడానికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 108కు ఫోన్ చే స్తే వారిని ఆస్పత్రులకు చేరుస్తాయని ఆయన వివరించారు. ఆదివారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ.. స్వైన్‌ఫ్లూ సోకినట్లు అనుమానం ఉన్న వారిని ప్రైవేటు ఆస్పత్రులు అడ్మి ట్ చేసుకోవాలని, లేదంటే ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. స్వైన్‌ఫ్లూ అనుమానితులు గాంధీ ఆసుపత్రికే రావాలని, ఎక్కడికి పం పాలో తామే నిర్ణయిస్తామని అన్నారు. శని, ఆది వారాల్లో 35 కేసులు పాజిటివ్‌గా తేలాయన్నారు.